ఇతడు కదా రియల్ లైఫ్ కుబేరా.!

by Daayi Srishailam |

నిరాశ్రయులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని చూపిస్తున్నాడు యువ ఇంజినీర్ నవీన్ కుమార్.

ఇతడు కదా రియల్ లైఫ్ కుబేరా.!
X

దిశ, ఫీచర్స్: కుబేర సినిమా చూశారు కదా.? నిజమైన కుబేరుడు వేల కోట్ల రూపాయలుండి మనశ్శాంతి లేనోడా.? ఏ పూటకు ఆ పూట అడుక్కునైనా సరే సంతోషంగా బతుకుతున్నోడా.? అలాంటి నిరాశ్రయులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని చూపిస్తున్నాడు యువ ఇంజినీర్ నవీన్ కుమార్.

బిచ్చగాళ్లు కాదు..

బిచ్చగాళ్లను చూస్తే నవీన్ ముందు వాళ్ల దగ్గరికి వెళ్లిపోతాడు. డబ్బు ఇవ్వడానికి కాదు. వారికి గౌరవం, జీవన లక్ష్యం, స్వాతంత్ర్యం ఇవ్వడానికి. ఇందుకోసం ఆయన "అచ్చయం ట్రస్ట్" స్థాపించాడు. ఇప్పటివరకు ఆ ట్రస్ట్ ద్వారా 1480 మంది నిరాశ్రయుల జీవితాలను మార్చాడు. భిక్షాటన రహిత భారతదేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు. "బిచ్చగాడు" అనే పదం ఉచ్ఛరించడానికి ఇష్టపడడు. వారిని గౌరవంగా "నిరాశ్రయులు" అని పిలవాలని అంటాడు నవీన్. "అక్షయపాత్ర" నుంచి స్ఫూర్తి పొంది ఈ ట్రస్టును ప్రారంభించాడు.

తొలి రిహాబిలిటేషన్

బిచ్చగాళ్ల గురించి మాట్లాడితే చాలామంది ఎగతాళి చేశారు. "నీ పని నువ్వు చూసుకో" అని అన్నారు. అయినా కూడా నవీన్ ఎక్కడా తగ్గలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసి "బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్" అవార్డును సాధించినప్పుడు నవీన్ మదిలో "భిక్షాటన" చేసేవాళ్లే మెదిలారు. స్టార్టింగ్లో నిరాశ్రయుల దగ్గరికి వెళ్తే తిట్టేవాళ్లు, కొట్టేవాళ్లు. అయినా భరించాడు. రాజశేఖర్ అనే వ్యక్తిని మొదటిసారిగా రిహాబిలిటేషన్ చేసి తొలి విజయం సాధించాడు. కుటుంబాన్ని కోల్పోయి డ్రగ్ అడిక్ట్‌గా మారిన రాజశేఖర్ ఇప్పుడు వాచ్మెన్ పనిచేస్తూ గౌరవంగా బతుకుతున్నాడు.

ఆర్థిక స్వతంత్రులుగా..

నాలుగేళ్ల పాటు నవీన్ తన జీతంతోనే ట్రస్ట్ ను నడిపించాడు. 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ యూత్ అవార్డు రావడం తన కృషికి గుర్తింపు లభించినట్లయింది. ఇలా మొత్తం 80కి పైగా అవార్డులొచ్చాయి. అచ్చయం ట్రస్ట్ ఇప్పుడు ఐదు శాఖలతో 13000 మంది జీవితాలు ప్రభావితం చేస్తోంది. ప్రతీ ఆదివారం నిరాశ్రయులను కలుస్తారు. రోజుకు సగటున 20 కాల్స్ వస్తాయి. నిరాశ్రయులను 18 రకాలుగా వర్గీకరించి వారి అవసరాలకు తగ్గట్టు కౌన్సిలింగ్, శిక్షణ ఇస్తాడు. అగర్ బత్తీలు, పేపర్ ప్లేట్లు, మట్టి దీపాలు వంటి ఉత్పత్తులు తయారుచేయడం నేర్పించి వారిని ఆర్థికంగా స్వంత్రులను చేస్తున్నాడు.

కట్నం కాదు.. విరాళం

19 ఏళ్ల వయసులో సేలంలో గేట్ పరీక్షకు సిద్ధమవుతున్న నవీన్ పక్కన భిక్షాటన చేసేవారిని చూసి బాధపడేవాడు. తన డిన్నర్ కోసం దాచుకున్న డబ్బును వాళ్లు ఇచ్చేసి ఆకలితో నిద్రపోయేవాడు. అదే ఆయనను ట్రస్ట్ ఏర్పాటుచేసేలా ప్రేరేపించింది. భిక్షాటనను జాతీయ సమస్యగా చూడని మనలో చాలామంది నవీన్ లా దాన్ని పరిష్కరించాలని ఆలోచించరు. అంత సాఫీగానే సాగుతుంది కానీ.. అచ్చయం ట్రస్ట్ కు నిధుల సమస్య ఏర్పడింది. ఇందుకోసం MOI 101 అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టాడు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బహుమతులు ఇచ్చే సంప్రదాయం నుంచి స్ఫూర్తి పొంది రూ.101 విరాళంగా ఇవ్వమని కోరుతున్నారు.

Next Story