వన్ అండ్ ఓన్లీ.. సర్టిఫైడ్ స్నేక్ ఉమన్ రెస్కూయర్.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:48:23  IST  )

800కు పైగా పాములను రక్షించిన రోష్ని నేటితరం అమ్మాయిలకు కలలను సాధించడానికి ప్రేరణగా నిలుస్తోంది

వన్ అండ్ ఓన్లీ.. సర్టిఫైడ్ స్నేక్ ఉమన్ రెస్కూయర్.!
X

దిశ, ఫీచర్స్: డాక్టర్ జిఎస్ రోష్ని పేరు కేరళలో సంచలనంగా మారింది. ఒకప్పుడు దూరదర్శన్‌లో వార్తలు చదివే ఈ మహిళ ఇప్పుడు కేరళలో తొలి, ఏకైక సర్టిఫైడ్ మహిళా పాము రక్షకురాలిగా నిలిచింది. 800కు పైగా పాములను రక్షించిన రోష్ని నేటితరం అమ్మాయిలకు కలలను సాధించడానికి ప్రేరణగా నిలుస్తోంది.

న్యూస్ రీడర్ టు స్నేక్ ఫ్రెండ్

రోష్ని జీవితం దూరదర్శన్‌లో వార్తలు చదువుతూ సాఫీగా సాగిపోతోంది. డ్యూటీలో భాగంగా ఒకరోజు వన్యప్రాణుల రక్షణ శిక్షణ శిబిరాన్ని సందర్శించింది. పాములను ఎలా పడతారో చూసి ఆ పనిపై ఆసక్తి పెంచుకుంది. ఆ తర్వాత అటవీ అధికారులను సంప్రదించి పాములు పట్టడంలో మెళకువలు నేర్చుకుంది. ఎప్పటకీ ఈ పనిలోనే ఉండిపోవాలనుకుంది. మెల్లమెల్లగా పాములను పట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత పాములను సురక్షితంగా పట్టుకునే లైసెన్స్‌ను సంపాదించి కేరళ అటవీ శాఖలో చేరింది. మొదటి సాహసంగా కేవలం మూడు నిమిషాల్లో దాన్ని సురక్షితంగా పట్టుకుని ఆశ్చర్యపరిచింది.

సవాళ్లను అధిగమిస్తూ

రోష్ని జీవితంలో అసలైన సవాళ్లు పాములు పట్టడంలో కాదు. సమాజం నుంచి వచ్చిన విమర్శలే తనకు పెద్ద సవాలుగా మారాయి. ఆడొళ్లు పాములు పట్టడమేంటి.? అని చాలామంది చాలా రకాలుగా అన్నారు. అటవీ శాఖలో కూడా సామర్థ్యం గురించి తక్కువచేసి మాట్లాడారు. ఏది చేసినా హేళనగా చూసేవాళ్లు. అలా తన ప్రతి అడుగూ, ప్రతి విజయమూ పరీక్షకు గురైంది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. ఆ సవాళ్లను అధిగమించి తిరువనంతపురంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌కు నాయకత్వం వహిస్తోంది. ఆమె ధైర్యం, సంకల్పం సమాజంలోని అనుమానాలను తిప్పికొట్టేలా చేశాయి.

ఆరు నిమిషాల్లో కింగ్ కోబ్రాను

ఇప్పటివరకు రోష్ని 114కు పైగా పైథాన్‌లను, 55 కిలోల బరువున్న క్రైట్‌లను, రసెల్ వైపర్‌లను రక్షించింది. కింగ్ కోబ్రాను పట్టుకొని రక్షించడం తన కల. అది కూడా సాకారమైంది. 2025 జూలై 6న పెప్పర సంరక్షణ కేంద్రం సమీపంలో 14-16 అడుగుల పొడవు, 20 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను ధైర్యంగా పట్టేసింది. అందరూ భయడుతూ ఉంటే ఒక సాధారణ స్నేక్ హుక్, ఒక సంచితో వచ్చిన రోష్నీ ఆరు నిమిషాల్లో సురక్షితంగా పట్టుకుంది. కోబ్రా అంటే మామూలుగా ఎవరికైనా భయముంటుంది. కానీ ఆమె దాన్నిచూస్తూనే నీళ్లలోకి వెళ్లింది. సంచి పెట్టింది. హుక్‌తో అమాంతం సంచిలోకి తోసేసింది.

రాత్రి లేదు పగలు లేదు

రోష్నికి రాత్రి సమయంలో కూడా డజన్ల కాల్స్ వస్తాయి. కొన్నిసార్లయితే మధ్యరాత్రి 2 గంటలకు కూడా కాల్ వస్తే స్కూటీ వేసుకొని వెళ్తుంది. పట్టుకున్న పామును సురక్షితంగా సీటు కింద బంధించి ఏమీ తెలియనట్టు వస్తుంది. సాధారణమైన జీవితాన్ని దాటి కలలు కనే ప్రతి యువతికి రోష్ని లైఫ్ జర్నీ ఒక సందేశం. అడవులైనా, అగ్నిమాపక విభాగమైనా, విమానాలను నడపడమైనా మనకు నచ్చిందే చేయాలంటుంది రోష్ని. తప ధైర్యం, నిబద్ధత, సంకల్పం ఆమెను ఇలా కేవలం పాముల రక్షకురాలిగానే కాక సమాజంలో మార్పును తీసుకొచ్చే ఒక శక్తిగా నిలబెట్టాయి.

Next Story