- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

పీర్ల పండుగ ఒక మరుపురాని సంబరం.
గత జ్ఞాపకాల చిరునామా.
కులాలేవీ.. మతాలేవీ తెలియని సమయంలో..
కల్మషం లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకున్న పండగ.
ఇప్పుడు మొహర్రం అంటున్నారు.
కానీ.. "పీర్ల పండుగ" అంటేనే తెలుసు అప్పుడు.
- దిశ, ఫీచర్స్
నిజంగా ఆరోజుల్లో "పీర్ల పండగ" ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేది. నిజంగా అప్పుడు ఈ హిమామ్ హుస్సేన్ తెల్వదు. బలిదానం తెల్వదు. కత్తులు, బ్లేడ్లతో రక్తమొచ్చెటట్లు పొడుసుకుంటరని కూడా తెల్వదు. తెలిసిందల్లా ఒక్కటే కులం లేదు.. మతం లేదు అందూ "అలావ్ గుంత"లో "అలాదులా అసొయ్ దులా" అని పాడుకుంటూ ఆడటమే తెలుసు. అదే గొప్ప అనుభూతి.
పీర్ల కొట్టం కాడనే..
ఊర్లల్ల "ఆశన్న.. ఊశన్న" పేరుమీద సవార్లు పెట్టేటొళ్లు. వాటినే "పీర్లు" అంటారు. పీర్లకు మొక్కితే పిల్లలు లేనొళ్లకు సంతానమైతుందని అంటుండేది అప్పుడు. సవార్ల వంతు గౌండ్లొళ్లకు ఉండేది. పీర్లకు పూజలు చేసేది మాత్రం తురక సాయెబులే. కచ్చీర్ కాడ పీర్లను నిలవెట్టేది. ఇగ దినాం పొద్దుమూకంగా పీర్ల కాడనే పిలగాళ్లంతా ఆడుకునేది. "శారెడు శారెడువోసినారు శార్మినారు కట్టినారు.. మానెడు మానెడువోసినారు మక్కా మసీదు కట్టినారు" అనీ "ఆసేని పూసేని అన్నదమ్ముళ్లు.. అన్నదమ్ముళ్లు పూసేని సెరుగూన వూది బుక్కీటు సామి వూసేని" అనీ కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఆడిపాడుతుండె.
హైసొయ్ జూలోయ్..
పీర్ల పేరుమీద పిల్లలకు ఆశన్నా.. ఊశన్నా.. ఆశక్కా.. ఊశక్కా అని పేర్లువెడ్తుండె. పది రోజుల పాట జరిగే పీర్ల ఉత్సవాలల్ల హైలైట్ "అలావ్ ఆట". సేమ్ అగ్గి గుండాల లెక్కనే ఉంటది. గుంత తీసి ఆ గుంతలో మంట పెట్టేవాళ్లు. మంట మండేది మండుతుండంగనే ఈ కొననుంచి ఆ కొనకు దుంకాలె. ఏ మాత్రం రాంగ్ స్టెప్పేశినా గుంతల పడ్తరు. అట్లా ఎంతోమంది పడతరు కూడా. అట్లా దుంకుతుంటే "అలా దులా" అని కొందరు అంటారు. దానికి కొనసాగింపుగా "హైసొయ్ జూలోయ్" అని కొందరంటారు. అట్లా దుంకుతూ ఆడుతుంటే మస్తు మజా వచ్చేది.
పెద్దపులి డ్యాన్స్
పీర్లను లేపిన్నాడు సవార్ల వంతున్న గౌండ్లొళ్లు పీర్లను ఎత్తుకొని సిగమూగినట్లే ఆడేది. డడ్డన్క డన్ అని డప్పులు కొడ్తుంటే.. ఆ డప్పు సప్పుళ్లకు కాళ్లు కదిలిస్తూ ఆడుతుంటే పిల్లలంతా పీర్ల చుట్టే తిరిగేది. ఇంటింటికీ తిరిగి డ్యాన్స్ చేస్తుంటే ఆ డప్పుచప్పుళ్లకు ఎగరనివాళ్లంటూ ఎవరూ ఉండరు. ఇంటింటికీ తిరుగుడు అయిపోయినంక పొద్దుమూకినంక నిమజ్జనం ఉంటది. అప్పుడు జూలూస్ తీస్తరు. ఇగ అప్పుడు చూడాలె.. ఊరంతా పీర్లకొట్టం కాడ జమయ్యి.. సిగాలొచ్చినట్లే ఊగుతుంటరు. జూలూస్‌లో పులివేషాలు హైలైట్. పులి వేషాలేసుకున్నొళ్లు పెద్దపులి డ్యాన్స్ చేస్తూ హంగామా చేస్తుంటరు.
మలీద ముద్దల కోసమే..
పీర్లకొట్టం కాడ జూలూస్ అయిపోంగనే ఆత్రమాత్రం బావిలో నిమజ్జనం చేస్తందుకు తీసుకపోయేది. గంటలకొద్దీ ఓపికతో ఆడి అదేందోగానీ ఉరికినట్టే పీర్లను ఎత్తుకొని పోతుంటే వాళ్లెనకాల పోరగాళ్లమంతా పరుగులు పెట్టేది. ఇక బావికి కొంత దగ్గర్లో దుకాణ్లు ఉండేది. అక్కడ ఆటాణకో.. చారాణకో ఏదైనా కొనుక్కొని నిమజ్జనం అయిపోయినంక పెట్టే మలీద ముద్దలు తీసుకొని ఇంటికొచ్చేది. అంతా అయిపోయినంక.. "కాసీము నిలిచేది వెండి మాసీదో బంగారి మాసీదో.. ఆతియ సక్కని వాడె మన కాసిములయ్యా" అని పాటలు పాడుకుంటా ఇంటికొచ్చేది.






