Hello Bros.. ఈమెలా పెళ్లి చేసుకోండి.!

by Daayi Srishailam |

పెళ్లిని రిచ్‌గా చేసుకోవాలని ఉమకూ ఉండేది

Hello Bros.. ఈమెలా పెళ్లి చేసుకోండి.!
X

పెళ్లంటే "దుమ్ము దుమ్ము" చేసుకోవాలి..

అనుకునేవాళ్లు ఎవరైనా ఉంటే..

ఒకసారి ఈ ఉమ గురించి తెలుసుకోండి.

అందరిలా పెళ్లిని రిచ్‌గా చేసుకోవాలని ఉమకూ ఉండేది.

కానీ.. ఒక ఆలోచన.

ఏమొస్తుంది గ్రాండ్‌గా చేసుకుంటే అనీ.

ఇంతకూ ఏం చేసిందంటే..??

- దిశ, ఫీచర్స్

పెళ్లంటే ప్రేమ.. ఆనందం.. జీవితకాలపు జ్ఞాపకాల సమ్మేళనం. కానీ ఆ ఆనందోత్సవం పర్యావరణానికి సమస్య కావొద్దని నిరూపించింది చెన్నయ్‌కి చెందిన లైఫ్ స్టయిల్ బ్లాగర్ ఉమారామ్. తక్కువ వ్యర్థాలతో.. సాంప్రదాయ.. సమకాలీన పర్యావరణహిత సూత్రాలతో పెళ్లి చేసుకుందామె.

కనెక్ట్ టు ఎర్త్

మనొళ్లకు పెళ్లంటే ముందుగా గుర్తుకొచ్చేది మాంచి దావత్. తీరొక్క వంటకాలతో పసందైన విందు ఇవ్వాలనుకుంటారు. పెళ్లి ఎంత గ్రాండ్‌గా అయ్యిందనేది వంటకాల మీదనే ఆధారపడి ఉంటుందనుకుంటారు. ఉమ పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. వంటకాల ప్రిపరేషన్ కోసం ఫ్యామిలీ అంతా తలామునకలైతే.. ఉమ "అవేవీ వద్దు" అని చెప్పేసింది. ఫ్యామిలీ షాక్ అయ్యింది. "వంటల్లేనిదే పెళ్లెక్కడిది.?" అన్నారు. "వంటలు వద్దని చెప్పడం లేదు.. వ్యర్థాలు తగ్గిద్దాం" అని కుటుంబానికి.. వరుడి ఇంటివాళ్లకు సముదాయించి చెప్పింది. "కనెక్ట్ టు ఎర్త్" అనే వ్యర్థ నిర్వహణ సంస్థ సహాయంతో పెళ్లిలోని భోజన.. అలంకరణ వ్యర్థాలను సేకరించి తడి.. పొడి వ్యర్థాలుగా విభజించారు. మిగిలిన పండ్లు.. ఆహారాన్ని పశు ఆహారంగా అందించారు.

అతిథులంతా ఇదే చర్చ

ఉమారామ్ తన పెళ్లిలో మొత్తం 110 కిలోల వ్యర్థాలను మళ్లించి.. తక్కువ వ్యర్థాలతో పెళ్లి చేసుకుంది. ప్రతీ మార్పు ప్రయాణంలో అడ్డంకులు సహజం. ఉమా పెళ్లిలో కూడా క్యాటరింగ్ బృందం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేసింది. కానీ ఉమ వెనక్కి తగ్గలేదు. మిగిలిన నీటిని మొక్కలకు పోసి.. ప్లాస్టిక్ బాటిళ్లు రీసైకిల్ కేంద్రాలకు పంపించింది. పువ్వులు.. మిగిలిన పండ్లు.. ఇతర కంపోస్టబుల్ వ్యర్థాలను పోషకాలు నిండి ఎరువుగా మార్చారు. ఈ విధంగా అతిథులను ఆతిథ్యం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మంచి ప్రయత్నం చేశారు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా దీని గురించే చర్చించుకున్నారు. దీంతో తన కాన్సెప్ట్ పదిమందికి అర్థమయ్యేలా తన పెళ్లిని వేదికగా మల్చింది ఉమారామ్.

ఎప్పటికీ గుర్తుండిపోయేలా

పూర్తి జీరో వేస్ట్ వివాహం సాధ్యం కాకపోయినా మార్పు కోసం ఆమె ఒక మంచి ప్రయత్నమైతే చేసింది. తక్కువ వ్యర్థ ఈవెంట్ ఆలోచనను ప్రచారం చేసేందుకు సినీ తారల చిత్రాలతో కూడిన ఆకర్షనీయమైన పోస్టర్లను ముద్రించింది. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికలను కూడా సీడ్ పేపర్‌తో తయారుచేయించింది. తద్వారా అవి పెళ్లి తర్వాత మొక్కలుగా మారి.. ఈ జంటను గుర్తుచేసే హృద్యమైన జ్ఞాపకంగా నిలిచాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా ఆమె నిరోధించిన 110 కిలోల వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా పునర్నిర్మాణం చేయబడింది. ఫైనల్‌గా ఉమారామ్ పెళ్లి పర్యావరణ ప్రేమను.. సంప్రదాయ ఉత్సవాలతో సమన్వయం చేయగలిగిన ప్రకాశవంతమైన ఎగ్జాంపుల్‌గా నిలిచింది.

ట్రెండ్‌గా మారాలి

పెళ్లిలో వ్యర్థాలను పునర్వినియోగం చేయడం.. అతిథులకు సందేశాత్మక ఆతిథ్యాన్ని్వ్వడం.. జీవితాంతం గుర్తిండిపోయే జ్ఞాపకాలను మూటగట్టుకోవడం ఉమారావ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది కేవలం ఇద్దరి హృదయాల సమ్మేళనం మాత్రమే కాదు.. స్థిరమైన జీవనం గురించి సంభాషణలను రేకెత్తించిన ఉత్సవంగా భావించారు దంపతులిద్దరూ. ఉమారామ్ ఆలోచనలు గ్రీన్ వెడ్డింగ్‌లను ట్రెండ్‌గా మార్చే అవకాశం ఉందన్నారు ఈ పెళ్లికి వచ్చిన ప్రముఖులు.. పర్యావరణ వేత్తలు. ఆహార వ్యర్థాలకు తన పెళ్లి ద్వారా స్మార్ట్ పరిష్కారం చూపించిన ఉమను.. తనకు సహకరించిన వరుడికి అభినందనలు తెలియజేశారు.

Next Story