- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థింక్ సైబర్.. డిజిటల్ మోసాలు పరార్.!
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సైబర్ సెక్యూరిటీ నిపుణులు థింక్ సైబర్ అనే ప్లాట్‌ఫాం తీసుకొచ్చారు

దిశ, ఫీచర్స్: చూస్తున్నాం కదా.. డిజిటల్ మోసాలు.. ఫిషింగ్.. సైబర్ ఫ్రాడ్‌లు రోజురోజుకూ ఎలాపెరిగిపోతున్నాయో. 2024లో సైబర్ మోసాల వల్ల రూ.22,845 కోట్లు ఇండియన్స్ కోల్పోయారని ప్రభుత్వ డేటా చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ అవగాహన పెంచడం చాలా ముఖ్యం. దీనికోసం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సైబర్ సెక్యూరిటీ నిపుణులు థింక్ సైబర్ అనే ప్లాట్‌ఫాం తీసుకొచ్చారు.
మోసాల కట్టడికి..
"థింక్ సైబర్.ఇన్ఫో" స్టార్టప్ ఫౌండర్స్ హైదరాబాద్‌కు చెందిన సుజాత యెర్రంశెట్టి.. రమేష్ కుమార్. 2025 డిసెంబర్లో దీనిని ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫాం టీహబ్ కేంద్రంగా నడుస్తోంది. వయసు.. విద్య.. నేపథ్యం ఏదైనా సులభంగా అర్థమయ్యేలా సైబర్ అవగాహన.. బాధ్యతాయుత ఆన్‌లైన్ ప్రవర్తన గురించి ఈ స్టార్టప్ ద్వారా నేర్పిస్తారు. డిజిటల్ రిస్క్‌లు.. మోసాలను తగ్గించడం థింక్ సైబర్ ప్రధాన లక్ష్యం. సుజాత.. రమేష్ కుమార్ ఇద్దరూ ఎనిమిదేళ్ల క్రితం సైబర్ వర్క్‌షాప్‌లో కలిసి స్నేహితులయ్యారు. సైబర్ అవగాహనలో ఉన్న గ్యాప్‌ను గుర్తించి థింక్ సైబర్ ప్లాట్‌ఫాంను మొదలుపెట్టారు.
సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌గా..
సజాతకు వాళ్ల నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన క్రమశిక్షణ.. చదువు పట్ల ధ్యాస తనను సైబర్ సెక్యూరిటీ రంగంలో 20 సంవత్సరాలకు పైగా పనిచేసేలా చేశాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ డిగ్రీ చేసిన తను పలు అంతర్జాతీయ సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌గా పనిచేసింది. రమేష్ కుమార్ బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. అమెరికాలో 15 సంవత్సరాలకు పైగా సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. ఆక్స్‌ఫర్డ్ నుంచి సైబర్ ఆర్కిటెక్టింగ్ కోర్సు చేశాడు.
వాస్తవికతకు దగ్గరగా..
2025లో స్టార్టప్ ఐడియా వచ్చింది. ఇద్దరూ రూ.20 లక్షలు పెట్టి స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన 7-8 డెవలపర్ల టీమ్‌తో పని మొదలుపెట్టారు. కంటెంట్ రాయడం.. ప్రొడక్షన్ అంతా వారే చేశారు. ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఫండింగ్ తీసుకోకుండా ఎనిమిది నెలల్లో ప్లాట్‌ఫాం రెడీ చేసి డిసెంబర్ 27.. 2025న లాంచ్ చేశారు. ఆటో డ్రైవర్ నుంచి బ్యాంకు అధికారి వరకు అందరికీ సరిపోయేలా ఇంగ్లీష్.. హిందీ.. తెలుగు వీడియోలు.. కంటెంట్ రూపొందించారు. గూగుల్‌లో సమాచారం చెదురుమదురుగా ఉంటుంది. నమ్మదగినది ఎంచుకోవడం కష్టం. కానీ థింక్ సైబర్లో వాస్తవిక ప్రపంచానికి దగ్గరగా ఉంటుంది.
సురక్షితమే లక్ష్యం..
థింక్ సైబర్ వెబ్ పోర్టల్.. ఆండ్రాయిడ్.. ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది. స్టూడెంట్స్.. టీచర్లు.. బ్యాంకు సిబ్బంది.. సీనియర్ సిటిజన్స్.. బిజినెస్ ఓనర్లు ఇలా అందరికీ ఉపయోగకరంగా ఉంది ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే షార్ట్ వీడియోలు.. కంటెంట్‌తో "ముందు ఆలోచించి.. తర్వాత చర్య తీసుకో" అనే ఆలోచనను పెంచుతుంది. సైబర్ రిస్క్‌లు టెక్నాలజీ కంటే మనుషుల వల్లే ఎక్కువగా వస్తున్నాయి కదా.. ఈ ఎర్రర్స్‌ను థింక్ సైబర్ గుర్తించింది. డిజిటల్ ప్రపంచంలో అందరూ సురక్షితంగా నడవగలిగేలా చేయడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు సుజాత.. రమేష్ కుమార్.






