- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్‌ను టీషర్టులుగా మార్చిన ఫిల్మ్ స్కూల్ విద్యార్థులు
ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎంత మంది దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారన్నదే ప్రశ్న. కానీ ఒక్కసారి ఈ సమస్యను స్పష్టంగా చూస్తే.. పరిష్కారం కూడా కనిపెట్టొచ్చని విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ క్యాంపస్ ప్రూవ్ చేసింది.

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎంత మంది దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారన్నదే ప్రశ్న. కానీ ఒక్కసారి ఈ సమస్యను స్పష్టంగా చూస్తే.. పరిష్కారం కూడా కనిపెట్టొచ్చని.. ప్రకృతిని పాడు చేసే వ్యర్థాన్ని కూడా మనకు ఉపయోగకరంగా మార్చుకోవచ్చని విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ క్యాంపస్ ప్రూవ్ చేసింది.
మనం ప్లాస్టిక్‌తో చుట్టుముట్టబడి ఉన్నామనేది వాస్తవం. కానీ ఇది ఎక్కడికి వెళ్తుందో అని ఆలోచించడం చాలా అరుదు. విజిలింగ్ వుడ్ ఇంటర్నేషనల్ క్యాంపస్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం చూసిన అధ్యక్షురాలు మేఘనా ఘై పురి దాన్ని మంచికి ఉపయోగించుకోవడం ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టింది. దాన్ని ఉపయోగకరమైనదిగా మార్చడం ద్వారా సస్టైనబులిటీని క్యాంపస్ జీవితంలో భాగం చేయాలని నిర్ణయించుకుంది. క్లాసులు ముగిసిన తర్వాత డ్రై వేస్ట్ బిన్‌ల నుంచి ప్లాస్టిక్‌ను సార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంటి నుంచి ఆన్‌లైన్ డెలివరీ ప్యాకేజింగ్ వ్యర్థం కూడా తెచ్చేవారు. 2024 సెప్టెంబర్‌లో WWI తన ఖ్వాబ్ CSR కార్యక్రమం కింద ప్లాస్టిక్ సేకరణ డ్రైవ్‌ను ప్రారంభించింది. విద్యార్థి వాలంటీర్లు మార్కెటింగ్ & హౌస్‌కీపింగ్ బృందాలతో కలిసి వ్యర్థాన్ని సేకరించి వేరు చేశారు. 2024 అక్టోబర్ 17న క్యాంపస్ 100 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాన్ని హ్యాండోవర్ చేసింది. ఆ తర్వాత కూడా ప్రయత్నం కొనసాగింది. 2025 వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే నాటికి మరో 50 కేజీలు సేకరించారు.
వ్యర్థం నుంచి టీషర్ట్స్
యునైటెడ్270 సంస్థ ఆ ప్లాస్టిక్‌ను సార్ట్ చేసి.. శుభ్రం చేసి, ష్రెడ్ చేసి ఫైబర్‌గా మార్చింది. ఆ ఫైబర్‌ను టీ-షర్టుల తయారీకి సరిపడే ఫాబ్రిక్‌గా నేసింది. ఈ రీసైకిల్డ్ ఫాబ్రిక్‌తో 50 టీ-షర్టులు తయారయ్యాయి. విసిరేసిన ప్లాస్టిక్‌ను ధరించగల దుస్తులుగా మార్చడం చూస్తే.. వ్యర్థం పట్ల మన దృక్పథం కచ్చితంగా మారిపోతుంది. ఈ టీ-షర్టులను ‘సలామ్ బాంబే’ NGOకి చెందిన 50 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ ఆలోచన వారిని కూడా ప్రభావితం చేసి.. వారు సొంతంగా ప్లాస్టిక్ సేకరణ డ్రైవ్ ప్రారంభించారు. సలామ్ బాంబే ఇప్పటికే 600 కేజీలకు పైగా ప్లాస్టిక్ సేకరించింది. WWI క్యాంపస్‌లో కంపోస్టింగ్ బిన్‌లు, గాజు బాటిళ్లు, వ్యర్థం గురించిన చర్చలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి.
చిన్న ఆలోచన.. పెద్ద మార్పు
ఒక వ్యక్తి తనంతట తాను మార్పు తీసుకురాగలడని నమ్మిన ఓ విద్యార్థి.. ఒక మొత్తం కమ్యూనిటీ అదే నమ్మకంతో ఉంటే పెద్ద మార్పునే తీసుకురాగలమని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పాడు. ఒక సమస్యను.. మరో సమస్యకు పరిష్కారంగా చూడటం గొప్పగా అనిపిస్తుందని అంటున్నారు ఫిల్మ్ స్కూల్ విద్యార్థులు.






