- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, గండిపేట: సొంతింటి నిర్మాణం.. ఒక కల. జీవితంలో ఎప్పటికైనా ఓ సొంత ఇంటిని నిర్మించుకోవాలనేది సగటు మధ్యతరగతి ప్రజల లక్ష్యం. ప్రస్తుతం ధనికులతోపాటు వ్యాపారులు సొంత ఇంటిపై మక్కువ తక్కువ చేసుకొని అద్దె ఇళ్లలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం చాలామంది సంపన్న వర్గాలు, ఉన్నతస్థాయి ప్రజలు, వ్యాపారస్తులు, పొలిటీషియన్స్ అద్దె ఇళ్లలో హాయిగా జీవితం గడుపుతున్నారు. దానికి కారణం సొంతింటి నిర్మాణం భారీ బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కావడం. ఆ డబ్బులను వ్యాపారంతో పాటు పెట్టుబడిగా ఉపయోగించుకుంటున్నారు. వీరంతా కూడా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలలో విలాసవంతమైన జీవితం గడపటానికి ఇష్టపడుతున్నారు.
సకల సౌకర్యాల వైపు మొగ్గు
ప్రస్తుతం విల్లాల రెంట్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు సంపన్నవర్గాల ప్రజలు పారిశ్రామికవేత్తలు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో, కాలుష్యనికి దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. వారందరూ నగరానికి పశ్చిమ వైపు ఉన్న కోకాపేట, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొల్లూరు తదితర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఇప్పటికే వందలాది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో జిమ్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్టీ ఏరియా, క్లబ్ హౌసెస్ వంటి అధునాతన సౌకర్యాలు ఉండటంతో ప్రజలు విల్లాలలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. నగరానికి పశ్చిమాన ఉన్న ఈ ప్రాంతం ఎయిర్ పోర్టుకు చేరువలో అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు కూడా అందుబాటులో ఉండటంతో మక్కువ చూపుతున్నారు.
భారీగా అద్దెలు
గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో మధ్యలో భారీగా ఉంటున్నాయి. గండిపేట మండల పరిధిలో పదుల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాల ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మితమై ఉన్నాయి. నార్సింగి, కోకాపేట, గండిపేట, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానాక్ రామ్ గూడ తదితర ప్రాంతాలలో విల్లాలకు సంబంధించిన అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విస్తీర్ణాన్ని బట్టి నెలకు 2 లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉన్నాయి. చాలామంది వ్యాపారులు, సంపన్న వ్యక్తులు నాలుగు పడక గదుల విల్లాలను ఇష్టపడుతున్నారు. మై హోమ్ అవుతార్ సమీపంలో ఉన్న టెంపుల్ ట్రీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా నెల అద్దె సుమారు ఆరు లక్షలు పలుకుతుంది. అదేవిధంగా ఎ న్ ఎస్ ఎల్ ఒరియన్ గేటెడ్ విల్లాస్ సుమారు రూ. 4 లక్షలు, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని మై స్కేప్ కోర్ట్ యార్డ్ లో 4 లక్షలకు పైగానే అద్దె పలుకుతుంది. కోకపేటలోని రాజపుష్ప లో 3 లక్షలు ఉంది. గండిపేట పరిధిలోని విల్లా గ్రీన్ లో సుమారు మూడు లక్షలు ఉంది. తారమతి బారాదరి సమీపంలో విసెల్లా మిడోస్ లో 2-3 లక్షలు అద్దె ఉంది. దీంతోపాటు మూడు పడక గదుల విల్లాలు సుమారు లక్షన్నర పలుకుతున్నాయి. కొత్తగా అద్దెకు తీసుకునేవారు మూడు నెలలకు సంబంధించి అడ్వాన్స్ ని కూడా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాల్లో కాలుష్యం తోపాటు ట్రాఫిక్ అధికం కావడంతో చాలామంది నగరంలోని పశ్చిమ ప్రాంతం అయిన నార్సింగి, కోకాపేట, గండిపేట తదితర ప్రాంతాలలో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నారు.
సరైన ప్రాపర్టీలు లేవు: బి. లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్
ప్రస్తుతం రెంటల్ బిజినెస్ చాలా బాగుంది. చాలామంది విల్లాస్ అడుగుతున్నారు. ఎక్కువమంది అద్దె విల్లాలలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ సరిపడే ప్రాపర్టీలు మార్కెట్లో అందుబాటులో లేవు. ఎక్కువమంది హైదరాబాద్ నగరానికి వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం రెంటల్ బిజినెస్ బాగా ఉంది. ఎవరికైనా విజయవంతంగా అద్దెకు ఇప్పిస్తే రెంట్ లో సగం కమిషన్ ఇస్తున్నారు. మార్కెట్ చాలా బాగుంది.






