ఉద్యమాల ఊరు.. ఉద్యోగాల జోరు.. లక్ష్యాల దారుల్లో ఆదర్శంగా నిలుస్తున్న బీర్పూర్

by Javid Pasha |   (  Updated:2025-06-26 05:50:08  IST  )

ఉద్యమాల ఊరు.. ఉద్యోగాల జోరు.. లక్ష్యాల దారుల్లో ఆదర్శంగా నిలుస్తున్న బీర్పూర్

ఉద్యమాల ఊరు.. ఉద్యోగాల జోరు.. లక్ష్యాల దారుల్లో ఆదర్శంగా నిలుస్తున్న బీర్పూర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఒకప్పుడు బాంబు పేలుళ్లు.. ఎన్ కౌంటర్లతో దద్ధరిల్లిన ప్రాంతం అది. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు పుట్టిన బీర్పూర్ గ్రామం.. క్రమంగా మారుతున్న కాలాన్ని బట్టి అసమానతల నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ఒకప్పుడు ఉద్యమాల బాట పట్టిన బీర్పూర్ యువత.. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల బాట పడుతున్నారు. పోలీసు, ఆర్మీ, టీచర్ వంటి ఉద్యోగాలకు పదుల సంఖ్యలో ఎంపికై సత్తా చాటుతున్నారు.

ఒకప్పుడు సారంగాపూర్ మండలంలో ఉన్న బీర్పూర్ 2016 లో మండల కేంద్రంగా ఏర్పడింది. మావోయిస్టు లీడర్లైన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, బల్మూరి నారాయణరావు, అంగ ఓదెలు, బుచ్చన్న , మల్లేశం వంటి మావోయిస్టు లీడర్లు అంతా బీర్పూర్ నుండి వచ్చినవారే. అప్పుడు సమాజంలో ఉన్న సామాజిక అసమానతలు, వెనుకబాటుతనంపై పోరాడేందుకు వీరంతా అడవి బాట పట్టారు. వీరిలో ముప్పాల గణపతి అలియాస్ లక్ష్మణరావు మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన నక్సలిజం వైపు వెళ్లకముందు ప్రభుత్వ టీచర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో పనిచేశారు. వీరిలో అంగ ఓదేలు, బుచ్చన్నలు గతంలో జరిగిన ఎన్ కౌంటర్లలో మృతి చెందగా ముప్పాల గణపతి, బల్మూరి నారాయణరావును ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. అప్పట్లో మావోయిస్టులు బీర్పూర్ లో ఎర్ర స్తూపం నిర్మించగా, అప్పట్లో ఉమ్మడి జిల్లాలో ఎస్పీగా పనిచేసిన శివకుమార్ శాంతి స్థూపం నిర్మించారు. ఇదిలా ఉండగా 1989 సెప్టెంబర్ ఒకటవ తేదీన రాష్ట్రంలోనే తొలి మందు పాతర బీర్పూర్ ఘాట్ రోడ్డుపై పేల్చి వేయడంతో ఉమ్మడి రాష్ట్రంలో బీర్పూర్ అత్యంత ప్రభావితం కలిగిన నక్సలైట్ ఏరియాగా ముద్ర పడింది.

కొలువుల పల్లె..

ఒకప్పుడు పేద ప్రజలకు న్యాయం కోసం అడవుల బాట పట్టిన బీర్పూర్ గ్రామం నుంచి పదుల సంఖ్యలో యువత దేశసేవ, ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. బీర్పూర్ నుంచి 10 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 10 మంది ఆర్మీ జవాన్లు, 12 మంది ప్రభుత్వ టీచర్లు, ఒక ఎస్సై, ఇద్దరు గ్రూప్ -2 ఆఫీసర్లు, ఇద్దరు ఫారెస్ట్ బీట్, ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు, ఇద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉండగా ఇంకొందరు ఆర్టీసీ కండక్టర్లు గా, మరికొందరు ఎలక్ట్రీసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు గా ఉన్నారు. ఉన్నత చదువులు చదివి లండన్, అమెరికా వంటి దేశాల్లో స్థిరపడిన వాళ్లూ ఉన్నారు.

దేశసేవకే ఆర్మీలో చేరాను : బోదాసు తిరుపతి, సైనికుడు

చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని అనుకునేవాన్ని. అనుకున్నట్టే 2010లో ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం పంజాబ్ లో విధులు నిర్వర్తిస్తున్న. నేను కాకుండా మా ఊరి నుంచి చాలామంది ఆర్మీలో ఉన్నారు. యువత దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలి.

ఒకేసారి కానిస్టేబుళ్లమయ్యాం : రామ్, లకన్ ( కవల సోదరులు)

పోలీస్ డిపార్ట్ మెంట్లో చేరి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాం. బీ ఫార్మసీ చదువుతుండగా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రావడంతో అప్లై చేశాం. ఇద్దరం కష్టపడి చదివి కానిస్టేబుల్స్ గా ఒకేసారి నియామకమయ్యాం. ప్రస్తుతం ఒకరం ఇంటలిజెన్స్ లో, మరొకరు ఎస్పీ ఆఫీస్ లో విధులు నిర్వర్తిస్తున్నాం. డిపార్ట్మెంట్ లో చేరినందుకు గర్వంగా అనిపిస్తుంది.

Next Story