- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ పేరు ఒక సంగీతమే..! ఆ ఊరి ప్రత్యేకతే వేరు
ఆ గ్రామంలో దూరంగా కొండలు, అడవులు, పొలాల నుండి పిల్లలను లేదా కుటుంబ సభ్యులను పిలవడానికి ‘సంగీత స్వరాలను’ వాడతారు.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చాలా మందికి ఇంటి పేరు ఉంటుంది. ఎవరినైనా అడగాల్సి వస్తే మీ సర్‌నేమ్ ఏమిటి? అంటారు. కానీ మేఘాలయలోని పచ్చని కొండల మధ్య దాగి ఉన్న ఒక మారుమూల గ్రామంలో మాత్రం మీ ‘విజిలింగ్ నేమ్’ ఏమిటి అని అడగాల్సిందే. ఎందుకంటే అది అక్కడి వారి గుర్తింపు. పురాతన సంప్రదాయంలో భాగం. ప్రతీ ఒక్కరికి ఒక విభిన్నమైన ‘ఈల రూపంలో పేరు’’ ఉంటుంది. అందుకే ఆ ఊరికి ‘విజిలింగ్ విలేజ్’ అనే పేరు కూడా వచ్చింది. ఆ ఊరి అసలు పేరు మాత్రం కాంగ్‌థాంగ్.
పిలిస్తే.. రాగం పలికినట్టు..
ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన ప్రాంతాలలో ఒకటిగా కాంగ్‌థాన్ (Kongthong) గుర్తింపు పొందింది. ఇక్కడ నివసిచేవారంతా ఖాసి తెగ(Khasi tribe)కు చెందినవారే. ప్రస్తుతం దీనిని భారత దేశపు విజిలింగ్ విలేజ్ (ఈలల గ్రామం) అని పిలుస్తారు. ఇలా పిలవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఏమిటంటే.. ఈ గ్రామంలోని ప్రజలకు మనలాగా లక్షరాలతో కూడిన పేర్లు ఉండవు. బదులుగా ప్రతీ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన రాగం(Tune) పేరుగా ఉంటుంది. శతాబ్దాలుగా వస్తున్న ఈ అరుదైన సంప్రదాయాన్ని ‘జింగ్‌ర్వాయ్ ఇయావ్‌బీ (Jingrwai Iawbei) అని పిలుస్తారు.
తల్లి రూపకల్పనలో..
జింగ్‌ర్వాయ్ ఇయావ్‌బీ సంప్రదాయం ప్రకారం కాంగ్‌థాంగ్ గ్రామంలో పుట్టిన ప్రతీ శిశువుకు వారి పేరెంట్స్ సాధారణ పేరు పెట్టడంతో పాటు, తల్లి ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ ట్యూన్(మెలోడి)ను కూడా రూపొందిస్తుంది. దీనినే ‘విజిల్ నేమ్’గా ఉపయోగిస్తారు. దూరంగా కొండలు, అడవులు, పొలాల నుండి పిల్లలను లేదా కుటుంబ సభ్యులను పిలవడానికి ఈ సంగీత స్వరాలను వాడతారు. ఇవి అచ్చం ఈలవేసినట్లుగా వినిపిస్తుంది కాబట్టి బయటి వారు స్థానికులు దానిని విజిలింగ్ నేమ్‌గా, గ్రామాన్ని విజిలింగ్ విలేజ్ పేర్కొంటారు.
ఏమిటీ సంప్రదాయం!
జింగ్‌ర్వాయ్ ఇయావ్‌బీ అంటే ఖాసి భాషలో ‘మూల పూర్వీకురాలైన తల్లి (root ancestress) గౌరవార్థం పాడే సంగీతం’ అని అర్థం. ఇది ఆ సమాజంలోని మాతృస్వామిక సంప్రదాయంతో ముడిపడి ఉంది. తల్లి ఈ ట్యూన్‌ను బిడ్డ పుట్టినప్పుడు రూపొందించి, పదే పదే పాడుతూ అలవాటు చేస్తుంది. విశేషం ఏమిటంటే.. అందరికీ ఒకే ట్యూన్ పేరు ఉండదు. ప్రతీ వ్యక్తికి సపరేట్ నేమ్ ట్యూన్ ఉంటుంది. ఒకరి ట్యూన్ మరొకరికి అస్సలు ఉండదు. ఇవి సాధారణంగా స్వభావం, ప్రకృతి లేదా కుటుంబ సంప్రదాయాల నుంచి ప్రేరణ పొంది ఉంటాయని నిపుణులు అంటున్నారు. గ్రామస్తులు ఈ ట్యూన్‌ల ద్వారానే ఒకరినొకరు పిలుచుకుంటారు. సంభాషించుకుంటారు. ఇది ఖాసి తెగ ప్రజలు తమ గుర్తింపుతో, సంస్కృతితోపాటు భావోద్వేగాలను వ్యక్తం చేసే భిన్నమైన మార్గమని చెప్పవచ్చు.
కాంగ్‌థాంగ్ ప్రత్యేకతలు
కాంగ్‌థాంగ్(విజిలింగ్ విలేజ్) గ్రామం షిల్లాంగ్ నుండి సుమారు 55-60 కి.మీ. దూరంలో ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో ఉంది. మిస్టీ కొండలు, అడవులు, జలపాతాలు, రూట్ బ్రిడ్జెస్ మధ్య ఉన్న ఈ గ్రామం సహజ సౌదర్యంతోపాటు అపూర్వ సాంస్కృతిక వైభవాన్ని కలిగి ఉంది. ఇటీవల టూరిజం రంగంలో నమోదయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా అవార్డులు, యునెస్కో ‘ఇంటాంజిబుల్ హెరిటేజ్ నామినేషన్’లు పొందింది.
జీవన విధానం
ఖాసి తెగలో విజిల్ నేమ్ సంప్రదాయం ఆ సమాజంలోని తల్లి-పిల్లల మధ్య బంధం, పూర్వీకుల గౌరవం, సంగీతం ద్వారా మానవ సంబంధాలను బలపరుస్తుంది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో ఈ గ్రామాన్ని సందర్శించడానికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి గ్రామస్తుల విజిల్ నేమ్ ట్యూన్‌లను వినడం, వారి జీవన విధానాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెబుతుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక గ్రామం కాదు.. సంగీతం ద్వారా జీవించే జీవన విధానం.






