- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాలర్ వాల్యూ ట్రెండ్.. సంబంధాలను వ్యాపారంగా మార్చేస్తోందా?!
ఒకప్పుడైతే వ్యక్తి మంచితనం విలువైనదిగా భావించేవారు చాలా మంది. ఇప్పుడైతే లుక్స్, స్టైల్, ఆదాయం వంటి పరిస్థితుల ఆధారంగా విలువల్ని అంచనా వేస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తిని విలువైన వారిగా ఎలా పరిగణిస్తాం? ఏం చూసి విలువ కడతారు? అంటే మంచితనం, మర్యాద, గుణగణాలు, గౌరవ ప్రదమైన మానవ సంబంధాలు, మంచి ప్రవర్తన వంటివి ఇందులో కీలకంగా ఉంటాయి అంటారు పెద్దలు. ఒకప్పుడు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలోనూ ఇలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇటీవల ఒక కొత్త రకం ట్రెండ్ విస్తరిస్తోంది. ఇంటర్నెట్‌లోని చీకటి మూలల్లో (obscure corners) చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆలోచన ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వంటి మెయిన్‌స్ట్రీమ్ సోషల్ మీడియా వేదికల్లోకి వచ్చేసింది. ఇంతకీ అదేమిటంటే.. ‘లవ్, డేటింగ్, మ్యారేజ్’ వంటి విషయాల్లో వ్యక్తులను డబ్బులతో విలువకట్టడం. అంటే కాబోయే జీవిత భాగస్వాములకు(potential mates), కోట్లు లేదా డాలర్ విలువ (dollar figure)ను అంటగట్టడం. అది ఎలా కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచితనం vs మనీ రేటింగ్
ఒకప్పుడైతే వ్యక్తి మంచితనం విలువైనదిగా భావించేవారు చాలామంది. మనసులో ఇప్పటికీ అదే భావన ఉన్నప్పటికీ, బయట చర్చల్లో, సోషల్ మీడియా వేదికల్లో మాత్రం వ్యక్తి లుక్స్, స్టైల్, ఇన్‌కం వంటి పరిస్థితుల ఆధారంగా వ్యక్తులను.. అంటే ఆమె/అతను లక్షలు లేదా కోట్ల విలువైన ఫిగర్ అని, $X వ్యాల్యూ అని డబ్బు రూపంలో కొలుస్తున్నారు. ఇది డేటింగ్ మార్కెట్‌ను వ్యాపారంగా మార్చడమేనని, వ్యక్తుల మధ్య భావోద్వేగపరమైన మానవ సంబంధాలను ఈ ట్రెండ్ దెబ్బతీస్తున్నదని నిపుణులు అంటున్నారు. ఇక్కడ కేవలం అవతలి వ్యక్తులో, ఆధునికులో ఇలా రేటింగ్ కడుతున్నారనుకుంటే పొరపాటే.. జెన్‌జీ స్వతహాగా దీనిని అనుసరిస్తోందని కూడా పలువురు చెబుతున్నారు.
విలువలంటే ఇవేనా?
నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక వ్యక్తి విలువ. ముఖ్యంగా డేటింగ్ లేదా వివాహం విషయంలో సదరు వ్యక్తిని చూడగానే ఇతను/ఈమె వాల్యూ లక్షల్లో అని చెప్పేస్తుంటారు. అంటే సదరు వ్యక్తి అందం, హోదా, చదువు, ఉద్యోగం, ఆదాయం ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇలా చెప్పేస్తుంటారన్నమాట. ఉదాహరణకు ఉద్యోగం చేసే ఒక అందమైన యువతి అయితే ఆమె మార్కెట్ విలువ కనీసం 10 లక్షలు అంటుంటారు. అంటే ఆమెకు ఈ మేర ఆదాయం గల వ్యక్తి సరిపోతారనే అర్థంలో మాట్లాడుతుంటారు. ఉదాహరణకు ఒక అమ్మాయి చాలా అందంగా, ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉంటే.. ‘ఆమె $80,000 వాల్యూ’ అనేస్తుంటారు. అంటే ఆమెకు అంత డబ్బు గల అబ్బాయి మాత్రమే సరిపోతారని భావిస్తారు. అలాగే ఒక అబ్బాయి మంచి జాబ్, ఫిట్‌నెస్, జిమ్ బాడీ, కారు కలిగి ఉంటే.. లేదా అధిక ఆదాయం కలిగి ఉంటే అతని విలువు మరింత పెరుగుతుంది. ‘అతను $1,20,000 వాల్యూ’ అని రేటింగ్ ఇచ్చే్స్తుంటారు. ఇలా డబ్బు సంఖ్యలతో మార్కెట్ వ్యాల్యూని అంటగడుతూ మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని, ఆప్యాయతలను, నైతిక విలువలను పలువురు విస్మరిస్తున్నారని నిపుణులు విమర్శిస్తున్నారు.
నా వాల్యూ ఎంత?
ముఖ్యంగా డేటింగ్, మ్యారేజ్ వంటి అంశాల్లో వ్యక్తులకు ఇతరులు ‘రేటింగ్’ ఇవ్వడం ఒకటైతే.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా ‘స్వీయ రేటింగ్’ను అంటగట్టుకుంటున్నారు. ఉదాహరణకు ఒక అమ్మాయిలు తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా అందానికి, మొత్తం శరీరానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నాకు ఏ విధమైన వ్యక్తి లవర్‌గా లేదా భర్త/భార్యగా సెట్ అవుతారు? అని అడుగుతుండటం ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో కామన్ అయిపోయింది. దీంతో చాలామంది యువతీ యువకులు నిజమైన మానవ సంబంధాలు, విలువలు పక్కన పెట్టి, సోషల్ మీడియాలో లేదా ఇతరుల ద్వారా రేటింగ్ (looks rating లేదా sexual market value) మెరుగు పర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
సంబంధాలు -విపరీత ధోరణులు
కొందరైతే తమకు లుక్స్ అండ్ సెక్సువల్ ఫిగర్‌గా మార్కెట్ వాల్యూ రావాలని జిమ్‌లో ఎక్కువగంటలు వ్యాయామాలు చేస్తుంటారు. జవ్ సర్జరీ (jaw surgery), హెయిర్ ట్రాన్స్ ప్లాంట వంటివి చేయించుకుంటుంటారు. లక్షలు ఖర్చు చేసి లగ్జరీ కార్లు, బ్రాండెడ్ దుస్తులు కొనడం, డబ్బు సంపాదించడానికి అదనపు పనులు అంటే.. సైడ్ బిజినెస్‌లు వంటివి చేస్తుంటారు. ఎందుకంటే ఇలా చేస్తే వారి డబ్బు/డాలర్ విలువ పెరుగుతుంది. అంతే విలువైన లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్, ‘డాలర్ విలువ’గల భాగస్వామిని ఆకర్షించవచ్చు. ఈ ట్రెండ్ ఒకప్పుడు 4chan, రెడ్డిట్, మానోస్ఫియర్, లుక్స్‌మ్యాక్స్ వంటి కొన్ని ఆన్‌లైన్ వేదికల్లోనే కనిపించేది. కానీ ప్రస్తుతం సాధారణ యువతీ యువకులు కూడా ‘నా రేటింగ్’ ఎంత? అని సెల్ఫీలు పోస్ట్ చేసి అడుగుతున్నారు. మనిషి విలువను, జీవిత భాగస్వామి ఎంపికను కూడా చివరకు మార్కెట్ రేటింగ్ లేదా వాల్యూతో కొలవడమంటే.. నిజమైన మానవ సంబంధాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఇది ట్రెండ్ మాత్రమే. నిజమైన సంబంధాలు డబ్బు సంఖ్యతో కాదు.. ప్రేమ, గౌరవంతోనే నిలుస్తాయి.






