అద్దెకు భర్తలు.. ఆ దేశంలో వింత పోకడలు.. అసలు కారణమిదే..!

by Javid Pasha |

భర్తలను అద్దెకు తెచ్చుకోవడమనే కొత్త పోకడ లాట్వియా(Latvia) దేశంలో ఉంది.తీవ్రమైన లింగ అసమానతలవల్ల ఇది పుట్టుకొచ్చింది.

అద్దెకు భర్తలు.. ఆ దేశంలో వింత పోకడలు.. అసలు కారణమిదే..!
X

దిశ, ఫీచర్స్ : ఎక్కడైనా ఇల్లు, వాహనాలు వంటివి అద్దెకు తీసుకోవడం సహజమే. కానీ మనుషుల్ని.. అది కూడా స్త్రీలు భర్తల్ని అద్దెకు తెచ్చుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? వింతగా అనిపించవచ్చు కానీ ఇది జరుగుతున్నది. యూరోపియన్ దేశాల్లో ఒకటైన లాట్వియాలో ఈ ట్రెండ్ నడుస్తోంది. అక్కడ మేజర్లు అయిన మహిళలు ఇతర పురుషులను లేదా ఇతర మహిళల భర్తలను తమ అవసరాలకోసం గంట, రెండు గంటలు.. ఇలా తమకు నచ్చినంత సమయం మేరకు అద్దెకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఇండ్లల్లో చిన్న చిన్న పనులు, రిపేర్లు, ఫర్నిచర్ అమర్చడం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, టీవీ/వాషింగ్ మెషిన్ ఇన్‌స్టాలేషన్ వంటి పనులకు సైతం ఇతర పురుషులను గంటకు చొప్పున అద్దెకు తెచ్చుకుంటారు. అద్దె భర్తలకు డిమాండ్ పెరుగుతుండటంతో లాట్వియాలో ఇప్పుడు ‘హస్బెండ్ ఫర్ యాన్ హవర్ (Husband-for-an-hour) పేరుతో సేవలు కూడా అందుబాటులోకి వచ్చి ప్రజాదరణ పొందుతున్నాయి.

సంబంధాలకు కొత్త నిర్వచనం

భర్తల్ని అద్దెకు తెచ్చుకునే పోకడలు మనకు ఆశ్చర్యాన్ని కలిగింవచ్చు కానీ లాట్వియాలో ఇదొక సహజమైన సేవగా పరిగణిస్తారు. ఎవరూ తప్పుగా భావించరు. పలు ఆన్‌లైన్ వేదికలు ఈ సేవలను అందిస్తున్నాయి. కాగా ఈ సరికొత్త పోకడలు లాట్వియా సమాజంలో ట్రెడీషనల్ జెండర్ రూల్స్ (Gender roles)ను సవాలు చేస్తూ, స్త్రీ, పురుష సంబంధాలను కొత్తగా నిర్వచిస్తున్నాయని, రోజువారీ జీవితాన్ని మేనేజ్ చేయడానికి కొత్త రకం సేవలకు డిమాండ్‌ క్రియేట్ చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దీని వల్ల మహిళలు స్వతంత్రంగా, సమర్థవంతంగా తమ ఇంటి పనులను నిర్వహించగలుగుతున్నారు. అలాగే ఎమోషనల్ సపోర్ట్, వ్యక్తిగత సంబంధాల విషయంలో సమస్యలను అధిగమిస్తున్నారు.

కారణం ఇదే..

భర్తలను అద్దెకు తెచ్చుకోవడమనే కొత్త పోకడ లాట్వియా(Latvia)లో ఎందుకు ఉంది? అంటే అందుకు ప్రత్యేక కారణాలున్నాయి. ఈ దేశంలో తీవ్రమైన లింగ అసమతుల్యత(Gender imbalance) ఉంది. పైగా ఇక్కడ పురుషులకంటే మహిళల సంఖ్య 15.5 శాతం ఎక్కువ. ఇది యూరోపియన్ యూనియన్ సగటు కంటే కూడా చాలా ఎక్కువ. దీంతో పురుషుల కొరత వేధిస్తోంది. ఇక అసమతుల్యతకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. గతంలో జరిగిన యుద్ధాలు, వలసలు, దేశంలో పురుషుల యావరేజ్ ఆయుష్షు తక్కువగా ఉండటం వంటివి కారణమని నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ కాలంలో జరిగిన డిపోర్టేషన్లు (పురుషులను బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టడం), ఆల్కహాల్ అధిక సేవనం (Alcoholism), ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల పురుషుల సగటు ఆయుష్షు తక్కువగా ఉంటున్నది. ఇక్కడ స్త్రీలకంటే కూడా పురుషులు సుమారు 10-12 సంవత్సరాల ముందుగానే మరణిస్తుంటారు. దీంతోపాటు ఉన్నవారిలో కూడా చాలామంది పురుషులు విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటూ అప్పుడప్పుడూ స్వదేశానికి వస్తుంటారు. ఈ విధంగా స్త్రీలు ఇంటివద్ద ఒంటరిగా ఉండటం, వితంతువులు లేదా ఒంటరి మహిళలు పెరిగిపోవడం వంటి పరిస్థితులు అద్దె భర్తల సేవలు విస్తరించేందుకు కారణం అవుతున్నట్లు అక్కడి నిపుణులు చెబుతుంటారు.

అసలు ఉద్దేశం వేరైనప్పటికీ..

లాట్వియా (Latvia) దేశంలో స్త్రీలకంటే కూడా పురుషుల జనాభా చాలా వరకు తగ్గిపోయింది. పెళ్లి చేసుకోవడానికి లేదా సహజీవనం చేయడానికి ఆ దేశ స్త్రీల సంఖ్యకు అనుగుణంగా పురుషులు లభించడం లేదు. దీంతో చాలా మంది స్త్రీలు ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చిందే “గంటకు భర్త” (Husband-for-an-hour) సేవలు. అంటే ఒంటరి మహిళలు తమకు అవసరమైనప్పుడు పురుషులను అద్దెకు తెచ్చుకుంటారు. మొదట ‘అద్దెకు భర్తల సేవ’ కేవలం ఇంటి పనుల్లో సహాయం కోసమంటూ పుట్టుకొచ్చినప్పటికీ, ఎమోషనల్ సపోర్ట్, ఫిజికల్ రిలేషన్స్ కోసం కూడా చాలా మంది ఈ సంబంధాలపై ఆధారపడుతున్నారట. ప్రస్తుతం ఈ నయాట్రెండ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Next Story