ట్రిపుల్‌ఆర్‌ జంక్షన్లపై రియల్టర్ల కన్ను

by Daayi Srishailam |

ముందస్తుగా భూముల కొనుగోళ్లు

ట్రిపుల్‌ఆర్‌ జంక్షన్లపై రియల్టర్ల కన్ను
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) తెలంగాణకే గేమ్‌ చేంజర్‌గా నిలువనున్నది. హైదరాబాద్‌ చుట్టూ నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో శివారు ప్రాంతాలు గణనీయమైన అభివృద్దిని సాధించడంతోపాటు భూములకు భారీగా డిమాండ్‌ పెరిగింది. రియల్‌ వ్యాపారులకు సైతం ఇది ఆర్థికంగా కలిసొచ్చింది. కొత్తగా చేపడుతున్న ట్రిపుల్‌ ఆర్‌ సైతం రియల్‌ ఎస్టేట్‌కు ఊతం ఇవ్వడంతోపాటు సామాజిక ఆర్థిక లాభాలు ఒనగూరనున్నాయి. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ కాస్త ఢల్‌ గానే ఉండగా.. భవిష్యత్తులో మాత్రం మంచి డిమాండ్‌ వచ్చే ఛాన్స్​ ఉందని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ముందు చూపుతోనే రియల్టర్లు ట్రిపుల్‌ ఆర్‌ కు సంబంధించిన జంక్షన్ల వద్ద పెద్ద ఎత్తున భూములను కొని పెట్టుకుంటున్నారు.

ఆర్థికాభివృద్ది మరింత వేగవంతం

ట్రిపుల్‌ ఆర్‌ తో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతం అవనున్నది. ప్రభుత్వం రవాణా ఆధారిత అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ప్రణాళికలో భాగంగానే ట్రిపుల్‌ ఆర్‌ ను కార్యరూపంలోకి తెస్తోంది. ఇందులో భాగంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు అనుసంధానంగా వలయ రహదారిని చేపడుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు శివార్లలో ఉన్న ప్రాంతాలకు సైతం రాకుండానే నేరుగా ఇతర ప్రాంతాలకు సులువుగా ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా అయి దూరభారంతోపాటు ఇతర వ్యయ ప్రయాసలు సైతం తప్పనున్నాయి. ఇటీవలనే ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన హెచ్‌ఎండీఏ ట్రిపుల్‌ ఆర్‌ వెళ్లే 8 జిల్లాలు, 33 మండలాల పరిధిలోని 163 గ్రామాలకు సంబంధించిన డిజిటల్‌ మ్యాప్‌ తోపాటు సర్వే నంబర్లను వెబ్‌ సైట్‌లో ఉంచింది. అయితే దక్షిణ భాగం నిర్మాణంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు అధిక ప్రయోజనాలను పొందనున్నాయి. ఈ జిల్లాల పరిధిలోని అనేక ప్రాంతాలు వ్యాపార పరంగానే కాకుండా.. అనేక రకాలుగానూ గణనీయమైన వృద్ధిని సాధించనున్నాయి. ఇంటర్‌ ఛేంజ్‌లు, టోల్‌ ప్లాజాలు, సర్వీసు రోడ్లు, బస్ బే వంటి నిర్మాణాలతో ఆరు వరుసలతో నిర్మిస్తుండడంతో ఇవన్నీ.. రియల్‌ రంగానికి ఊతంగా నిలవనున్నాయి. ఏ పల్లె నుంచి.. ఏ సర్వే నంబర్ల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తుందోనని స్థిరాస్థి వ్యాపారులు నేతలను కలిసి ఆరా తీస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తో స్థిరాస్తి వ్యాపారం రెట్టింపు అవుతుందన్న ఆలోచనతనో వ్యాపారులు ట్రిపుల్‌ ఆర్‌ జంక్షన్లు వచ్చే ప్రాంతంలో ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున భూములను కొని పెట్టుకుంటున్నారు.

ఫోర్త్ సిటీకి మహర్దశ

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వేదికగా రూపుదిద్దుకుంటున్న ఫోర్త్ సిటీకి సైతం ట్రిపుల్‌ ఆర్‌ తో మహర్దశ పట్టుకోనున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ట్రిపుల్‌ ఆర్‌ కు మధ్యన 30వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీకి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం 7 మండలాలు, 56 గ్రామాలతో ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే స్కిల్‌ యూనివర్శిటీ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కృత్రిమ మేధ నగరంతోపాటు ఎడ్యుకేషన్‌, హెల్త్ హబ్‌ లు, కాలుష్య రహిత ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలతో ఫ్యూచర్‌ సిటీకి రవాణా కనెక్టివిటీ కల్పించేందుకు 300 అడుగుల గ్రీన్‌ ఫీల్డ్ రోడ్డును ప్రభుత్వం చేపడుతోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వద్ద నిర్మాణంలో ఉన్న స్కిల్‌ యూనివర్శిటీ వరకు మెట్రో కారిడార్‌ డీపీఆర్‌ తయారీ కోసం సర్వే పనులు చకచకా సాగుతున్నాయి. ఫోర్త్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి గ్రీన్‌ ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్ హైవేను నిర్మించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని టౌన్‌ షిప్‌ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తరహాల్లో ఫోర్త్ సిటీని ఫ్యూచర్‌ సిటీగా అభివృద్ది చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దార్శనికతకు ట్రిపుల్‌ ఆర్‌ ఆలంభనగా నిలవనున్నదని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story