- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాన చినుకులే వేల చప్పట్లుగా.. జ్యోతి భావోద్వేగ విజయం
మెడల్‌ని ముద్దాడి విజయానందాన్ని మనసారా ఆస్వాదించి దేశానికి పేరు తీసుకొచ్చింది

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. ఏపీకి చెందిన మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజికి సంబంధించిన వీడియో అది. భారత ఛాంపియన్‌గా నిలిచిన క్షణాన చూస్తే స్టేడియంలో ఎవరూ లేరు. ఆటగాడికి ప్రేక్షకుల చప్పట్ల స్పందన కూడా బలమే. కానీ.. జ్యోతికి ఆ క్షణాన ఆ అవకాశం లేకుండె. ఐనా తను బాధపడలేదు. మెడల్‌ని ముద్దాడి విజయానందాన్ని మనసారా ఆస్వాదించి దేశానికి పేరు తీసుకొచ్చింది.
ఒంటరిగా ఫీలయ్యింది..
దక్షిణ కొరియాలోని గుమి స్టేడియంలో ఇటీవల 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జరిగింది. పోటీలు స్టార్ట్ అయ్యాయి. ఇంతలోనే వర్షం. అయినా ఆటను యథావిధిగా కొనసాగించారు. జ్యోతి వంతు రానే వచ్చింది. తన అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. 25 ఏళ్ల ఈ అమ్మాయి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి.. కొత్త రికార్డు సృష్టించింది. కానీ చూస్తే స్టేడియంలో ప్రేక్షకులు లేరు. వర్షం వల్ల అందరూ వెళ్లిపోయారు. జ్యోతి ఒంటరిగా ఫీలయ్యింది. అంతపెద్ద విక్టరీ ఎలాంటి హడావిడి లేకుండా చాలా నిశ్శబ్దంగా మిగిలిపోయింది.
వీడియో వైరల్..
గుమి స్టేడియంలో ఎలాంటి హర్షధ్వానాలు లేకుండానే జ్యోతి 12.96 సెకన్లలో రేస్ పూర్తి చేసింది. ఇదే ఛాంపియన్‌షిప్ రికార్డుగా నిలిచింది. మొదటి హర్డిల్ వద్ద కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా.. మధ్యలో రిథమ్ పట్టుకుని.. చివరి హర్డిల్స్‌లో వేగం పెంచింది. జపాన్.. చైనా అథ్లెట్లను వెనక్కి నెట్టింది. మెడల్ తీసుకుంటున్నప్పుడు జాతీయ గీతం వినిపిస్తుండగా ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అథ్లెట్ల జీవితంలోని ఏ విధమైన సవాళ్లుంటాయనేది ఈ వీడియో ద్వారా తెలుస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో శిక్షణ..
విశాఖపట్నంలో పుట్టిన జ్యోతిది సాధారణ కుటుంబం. వాళ్ల నాన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. అమ్మ హౌజ్ కీపింగ్ పనిచేసేది. అథ్లెటిక్స్ పట్ల జ్యోతికి చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. 2015లో ఆంధ్రప్రదేశ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ మీట్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత.. తన అథ్లెట్ జర్నీ స్టార్ట్ అయింది. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో శిక్షణ పొంది ఒలింపిక్ అథ్లెట్ ఎన్ రమేష్ మార్గదర్శకత్వంలో ప్రాక్టీస్ చేసింది. 2019లో ఒడిషాలోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు వెళ్లి.. బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ సహాయంతో తన స్కిల్స్‌ను మెరుగుపరచుకుంది.
అర్జున అవార్డు..
జ్యోతి తన అథ్లెట్ జర్నీలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. అయినప్పటికీ 2022లో భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 2023లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ఫిసు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇక 2024లో పారిస్ ఒలింపిక్స్‌లో ఎంట్రీ ఇచ్చి అర్జున అవార్డు అందుకుంది. ఈ అచీవ్‌మెంట్స్ ఆమెను భారత మహిళల స్ప్రింట్ హర్డిలింగ్‌లో అగ్రగామిగా నిలిపాయి. గుమి విక్టరీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే అది హడావుడి లేకుండా నిశ్శబ్దంగా సాధించిన గొప్ప విజయం.






