రంది లేకుండా ఛలో కంది.. ఎకరా ధర రూ.3 కోట్ల పైమాటే

by Daayi Srishailam |

20 వెంచర్లు వెలిశాయంటే వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

రంది లేకుండా ఛలో కంది.. ఎకరా ధర రూ.3 కోట్ల పైమాటే
X

దిశ, సంగారెడ్డి అర్బన్: ఒకప్పటి గ్రామీణ ప్రాంతం.. నేడు మండల కేంద్రమై.. పట్టణాల కంటే ధీటుగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కంది మండల కేంద్రం చుట్టూ ఎక్కడ అయినా ఒక ఎకరా కొనాలన్న కోట్ల రూపాయలు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ రియల్ భూమ్ జోరు అందుకుంది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో పెట్టుబడిదారులంతా ఈ ప్రాంతాన్ని టార్గెట్ గా పెట్టుకొని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రోజు రోజుకి ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వస్తుండడంతో కొత్త కొత్త హెచ్ఎండీఏ అప్రూవ్డ్ వెంచర్లను ఏర్పాటు చేసి ప్లాట్లుగా చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలోనే కొత్తగా ఇక్కడ 20 వెంచర్లు వెలిశాయంటే వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

కంది మండల కేంద్రం నుంచి శంకర్పల్లి - బెంగళూరు రహదారి ఉంది. ఈ రహదారి పక్కన ఎకరా స్థలం రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు పలుకుతోంది. ఇదే కంది పక్కన ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ ఉంది. ఈ ఐఐటీ హైదరాబాద్ స్థాపించిన నాటి నుంచి కంది గ్రామ పంచాయతీ చుట్టూ ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా లక్షల నుంచి కోట్లకు పడగలెత్తాయి. ఇదే కంది నుంచి జాతీయ రహదారి 165 హైదరాబాద్ - ముంబై హైవే పక్కన ఎకరా స్థలం రూ. 8 కోట్ల నుంచి రూ.10 కోట్లు పలుకడం విశేషం. అన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈ హైవే పక్కన స్థలం దొరకడం ప్రస్తుతం చాలా కష్టమైపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డబ్బులు ఉన్న బడాబాబులు అందరూ ఇక్కడ స్థలాల్లో ఇన్వెస్ట్ చేసి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా కొనసాగిస్తున్నారు.

భూములపై ఇన్వెస్ట్మెంట్

కంది మండల కేంద్రం పరిధిలో ఉన్న భూములపైనే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి ఉంచారు. ఈ ప్రాంతంలోని భూములపై ఇన్వెస్ట్మెంట్ పెడుతూ అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయల లాభాలను పొందుతున్నారు. సగటున ఉండే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కూడా ఈ ఏరియాలో కనీసంగా 100 గజాలు స్థలం అయినా కొనాలని టార్గెట్ గా పెట్టుకొని జీవిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి వల్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ప్రాంతం హాట్ కేక్ గా మారింది.

మెట్రో రైలు వస్తే...

హైదరాబాద్ లోని మియాపూర్ వరకు ఉన్న మెట్రో రైలు సర్వీసు, సంగారెడ్డి వరకు వస్తే ఊహించిన దాని కంటే మరింత అభివృద్ధి ఇక్కడ జరిగేందుకు ఆస్కారం ఉంది. అయితే మెట్రో రైలు విస్తరణలో భాగంగా లింగంపల్లి వరకు పొడిగించనున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సంగారెడ్డి చుట్టుప్రక్కల ప్రాంతాలవాసులు మెట్రో రైలు ఇక్కడి వరకు వస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. గతంలో స్థానిక నాయకులు కూడా ప్రభుత్వం ముందు తమ ప్రతిపాదనలు సమర్పించారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే సంగారెడ్డికి మెట్రో రైల్ సర్వీస్ ప్రారంభం అయ్యేందుకు కూడా అవకాశాలున్నాయి. మొత్తంగా కంది మండల కేంద్ర పరిధిలో అభివృద్ధి పరుగులు తీస్తుండడంతో ఈ ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకొని ఉండేందుకు ఎక్కువ శాతం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Next Story