Viral : జర్నీలో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ వాడి వినికిడి కోల్పోయిన మహిళ.. మీరూ జాగ్రత్త అంటున్న నిపుణులు!

by Javid Pasha |

Viral : జర్నీలో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ వాడి వినికిడి కోల్పోయిన మహిళ.. మీరూ జాగ్రత్త అంటున్న నిపుణులు!

Viral : జర్నీలో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ వాడి వినికిడి కోల్పోయిన మహిళ.. మీరూ జాగ్రత్త అంటున్న నిపుణులు!
X

దిశ, ఫీచర్స్ : ఖాళీ టైమ్‌లోనో, జర్నీ చేస్తున్నప్పుడో ఇయర్ బడ్స్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయడం ఇప్పుడు కామనైపోయింది. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ అదే చేస్తున్నారు. నచ్చిన పాటలు వింటూనో, వీడియోలు చూస్తూనో లీనమైపోతున్నారు. కానీ ఇది చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. తాజాగా ఓ మహిళకు ఇదే అనుభవం ఎదురైంది. ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఆమె, 8 గంటలపాటు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ వాడటంతో చివరికి వినికిడి కోల్పోయింది. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇయర్ బడ్స్ వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్ అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటివల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తల గురించి ఇంకా ఏం చెప్తు్న్నారో చూద్దాం.

హెడ్‌ఫోన్ల ప్రభావం

హెడ్‌ఫోన్లు, ముఖ్యంగా ఇయర్‌బడ్స్ పెట్టుకోవడంవల్ల శబ్దం నేరుగా చెవుల్లోకి వెళ్తుంది. ఎక్కువసేపు వినడంవల్ల లోపలి భాగంలో ఉండే కోక్లియా, కర్ణబేరి, ఆడిటరీ నర్వ్స్ (Auditory nerves) వంటివి దెబ్బతింటాయి. దీంతో వినికిడిలోపం, తలనొప్పి, మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

హైవాల్యూమ్ రిస్క్

సాధారణంగా 85 డెసిబెల్స్ (Db) కంటే ఎక్కువ శబ్దం సుదీర్ఘంగా వినడం వినికిడి లోపానికి కారణం అవుతుంది. అది మ్యూజిక్ లేదా ఆడియో, వీడియో వంటి శబ్దాలు ఏవైనా సరే 100 dB వద్ద 15 నిమిషాల కంటే ఎక్కువ వినడం చాలా డేంజర్. ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆటోమేటిగ్గా చాలామంది తమకు తెలియకుండానే ఇలాంటి శబ్దాలకు గురవుతుంటారు. కాబట్టి జాగ్రత వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెడ్‌పోన్స్ లేదా ఇయర్ బడ్స్ ఎక్కువసేపు, ఎక్కువ శబ్దంతో వాడటం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఇది మరింత ప్రమాదమని చెబుతున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

మీరు ఇప్పటికే ఇయర్ బడ్స్ వాడుతున్నట్లయితే బీ కేర్ ఫుల్. ఎందుకంటే దీనివల్ల త్వరగా వినికిడి కోప్పోయే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. చెవుల్లో తరచుగా గుయ్.. మంటూ శబ్దం రావడం, ఇతరులు మాట్లాడేది సరిగ్గా వినబడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది వినికిడి లోపానికి ముందు సంభవించే లక్షణం కూడా కావచ్చు. దీంతోపాటు చెవుల్లో చీము కారడం, వింత శబ్దాలు వినబడటం, సరిగ్గా వినబడకపోవడం వంటివి గుర్తిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి.

Next Story