- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే చదువుకున్న అమ్మాయిలు పెళ్లిపట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. వారు తమ చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తూ జీవితంలో మ్యారేజ్ చేసుకోవడాన్ని సెకండ్ ప్రయారిటీ లేదా నాన్ ప్రయారిటీగా భావిస్తున్నారు. ఒకప్పుడైతే పేరెంట్స్ తమ కూతురికి 18 ఏండ్ల రాగానే పెళ్లి చేసేద్దామని ఆలోచించేవారు. చదువు, కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాలకంటే కూడా వివాహానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు వివాహం చేసుకునే అవకాశం ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతోందని, 40 ఏండ్ల వయసు వచ్చేసరికి కూడా వీరిలో అత్యధికమంది ఒంటరిగా ఉండే అవకాశం ఎక్కువని వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ తరపున జర్నల్ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్‌లో పబ్లిషైన ఒక అధ్యయనంలో వెల్లడించింది. కాగా ఈ పరిశోధన మల్టిపుల్ డెవలప్‌మెంట్ సాధించిన కంట్రీస్ నుంచి సేకరించిన డేటాను ఎనలైజ్ చేసింది. ఆ వివరాలేమిటో చూద్దాం.
ఆర్థికస్థితి- జెండర్ ఈక్వాలిటీ..
అధ్యయనంలో భాగంగా నిపుణులు అమెరికా, దక్షిణ యూరప్, ఈస్ట్ ఆసియా వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం.. చదువుకున్న మహిళలు సంప్రదాయం, వివాహ బంధం కంటే కూడా చదువు, కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని భావిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన పెరిగితేనే జెండర్ ఈక్వాలిటీ సాధ్యం అవుతుందని నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈరోజుల్లో చాలామంది చదువుకున్న మహిళలు తమ ఇంటలెక్చువల్ అండ్ లైఫ్ స్టైల్ స్టాండర్స్‌కు సరిపడే భాగస్వాములను కనుగొనడంలో ఇబ్బందులు కూడా పడుతున్నట్లు కూడా అధ్యయనం స్పష్టం చేసింది. సోషల్ సైంటిస్టుల అభిప్రాయాల ప్రకారం మహిళలు విద్య, ఆదాయం వంటి విషయాల్లో పురుషులను అధిగమిస్తున్న కొద్దీ ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది.
వివాహ బంధం- మారుతున్న దృక్పథం
తాజా మార్పు అమ్మాయిల్లో వివాహ బంధం, కుటుంబం, సామాజిక దృక్పథం వంటి అంశాల్లో మహిళల అభిప్రాయాన్ని మార్చేస్తోందని, వారు ఉన్నతంగా ఆలోచించేలా చేస్తున్నదని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ యూరప్ అండ్ అమెరికా వంటి దేశాల్లో గత దశాబ్దాలతో పోలిస్తే మహిళలు ఇప్పటికే ఉన్నత విద్యలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కానీ వివాహ రేట్లు తగ్గుతున్నాయి. ఇందులో 30-40 ఏండ్ల మధ్య వయసు గల చదువుకున్న మహిళల్లో 25-30 శాతం మంది ఒంటరిగా ఉంటున్నట్టు తేలింది. అయితే భారత దేశంలోనూ ఆ ప్రభావం ఉన్నప్పటికీ తక్కువస్థాయిలో ఉందని, ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ మార్పు సాంప్రదాయ కుటుంబ నమూనాలను సవాలు చేస్తూ, మహిళలు తమ జీవితాన్ని తాము స్వయంగా నిర్ణయించుకునే, నిర్మించుకునే స్వేచ్ఛను ఇస్తోంది. కానీ అదే సమయంలో భాగస్వామ్యం కోసం ఎదురుచూసే ఒంటరితనం వంటి సమస్యలను కూడా తెస్తోంది.






