- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఫ్రిడ్జ్‌లు లేని కాలమది.
ఇంటింటికీ ఒక ఉట్టి ఉండేది.
పాలో.. ఊడ్శిపెట్టిన అన్నమో ఆ ఉట్టిమీద పెట్టేది.
వచ్చినొళ్లు వచ్చినట్లు ఉట్టిమీదికెల్లి అన్నం తీసుకొని..
తిని, మల్లా దానిమీదనే పెట్టేసి పోతుండె.
ఉట్టితో ఉన్న అనుబంధమెంతో మధురమైనది.
అందుకే ఒకసారి నెమరేసుకుందాం పదండీ.!
దిశ, ఫీచర్స్: "ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా" అనే సామెత ఉంటుంది కదా.? దానర్థం.. ఇంట్లో "దూలానికి కట్టిన ఉట్టినే అందుకోలేకపోతున్నవూ" అనీ. 90s కిడ్స్ బాల్యం చాలావరకు ఉట్టిచుట్టే తిరిగింది. అన్నం, పాలు, పెరుగు, కూరలను దాచిపెడ్తందుకు "ఉట్టి" ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లేస్.
పిల్లిపాలు కావద్దనీ..
ఇప్పడంటే ఇంటికో ఫ్రిడ్జ్ ఉంటది. అన్నం నుంచి అల్లమెల్లిగడ్డ దాక, కూరగాయల నుంచి కుల్ఫీ దాక, బిస్కెట్ల నుంచి బిస్లరీ వాటర్ దాక, కోడిగుడ్ల నుంచి కొత్తిమీర కట్టదాక అన్నీ ఫ్రిడ్జ్‌లనే ఉంటయి. చిన్న పిల్లలైతే ఎప్పుడుజూశినా ఆ ఫ్రిజ్డ్‌లనే మూతివెడ్తుంటరు. ఏముంటదో ఏమో దాంట్ల.? "ఉట్టి" ముఖ్యంగా పిల్లుల భయానికి పెట్టేటొళ్లు. అప్పుడు ఇప్పట్లెక్క జిమ్మి, టామీ, జిక్కి, మిక్కీ అనే కుక్కలు పెట్స్‌గా ఉండకపోయేది. అప్పటి పెట్సన్నీ పిల్లులే. కుక్క వాకిలి అవతల్నే ఉండేది. పిల్లులేమో పడమటింటి నుంచి సయమాన్లకు, సయమాన్ల నుంచి వంటింట్లకు పోలీస్ గస్తీ కొట్టినట్లే తిరుగుతుండేవి.
వాసన పసిగడితే ఖతం
ఇండ్లల్లకు ఎర్ర చీమలు వచ్చేవప్పుడు. ఎందుకో ఏమోగానీ అప్పట్లో అన్నానికి ఊకే చీమలు పడుతుండె. ఉట్టిమీద పెడ్తే ఏ చీమలు పట్టకపోతుండె. ఉట్టిమీద పెట్టిన అన్నానికి, కూరకు ఏ సమస్య ఉండకపోతుండె అన్నమాట. ముఖ్యంగా పిల్లలు రొట్టెలను ఎత్తుకపోకుండా ఈ ఉట్టి బాగా అక్కెరకొస్తుండె. ఒగాల ఏదన్నా నాన్ వెజ్ వండితే మాత్రం పిల్లులెక్కడున్నా వాసన పసిగట్టి వస్తుండె. పుసుక్కున మర్శిపోయి ఉట్టిమీద పెట్టకపోతే.. ఇగ మల్లొచ్చేసరికి కోరికోరి వండుకున్న కోడికూర పిల్లిపాలు ఐతుండె. అప్పుడు ఒకటే కూర చేసేది.. పిల్లలేమో ఎక్కువుండేది కాబట్టీ ఉట్టిమీద పెడితే పొదుపుగా వాడుకోవచ్చు అనుకునేటొళ్లు.
మీదికెక్కి అందుకునేది
పిల్లలు లంచ్ బాక్సులు ఇప్పట్లెక్క స్కూల్‌కు తీస్కపోయేది కాదు. స్కూలెంత దూరమున్నా సైకిలేస్కొని లంచ్ చేస్తందుకు ఇంటికే వస్తుంటిమి. ఆకలిమీదున్న పానమాయె. మొలతాడుకున్న తాళంచెయ్యి ముడి ఇప్పేసి ఆదరాబాదరా తాళం తీసి లోపలికివొయ్యేది. ఉట్టిమీద మూడు నాలుగు కాసండీలు కనిపించేవి. ఒకటి అన్నం కుండ.. ఇంకోటి కూర అటికె.. ఇంకొకటి పెరుగో లేదా పాలో ఉండేవి. ఇప్పటిలెక్క ఇబ్బడిముబ్బడిగా కుర్చీలు.. డైనింగ్ టేబుళ్లు లేకపోయేది కదా.? ఇద్దరు అన్నదమ్ముండ్లుంటే అన్న కింద ఒంగేది.. అతనిమీద తమ్ముడు నిలబడి మెల్లగా ఒకటి తర్వాత ఒకటి ఉట్టిమీది కుండలను తీసి తింటుండె.
ఉట్టి.. తీపి జ్ఞాపకం
డీమార్టులు, బీమార్టులు లేవు కాబట్టీ ఈ ఉట్టిని ఇంట్లనే ఎవరికివాళ్లు తయారుచేసెటొళ్లు. ఎట్లా ఎద్దెవుసం ఉన్నొళ్లు తాళ్లు, పగ్గాలు పేనేది కాబట్టీ, పనిలో పనిగా ఒక రెండుమూడు ఉట్లు తయారుచేస్తుండె. సన్నటి, చిన్నపాటి నారతాడుతో ఉట్టి చేసేది. ఇప్పుడు ఇండ్లల్ల దిష్టి తాకకుండా బూడిది గుమ్మడికాయలు, దిష్టి యంత్రాలు కట్టడానికి మాత్రమే ఉట్టిని వాడుతున్నారు. ఒక్క ఉట్టి కావాలంటే మినిమం వంద రూపాయలు తీస్కుంటున్రు. టెక్నాలజీ ఎక్కువయ్యి ఫ్రిడ్జ్‌లు, కోల్డ్ స్టోరేజ్‌లు, మైక్రోవేవెన్స్, హార్డ్ బాక్స్‌లు వంటివెన్నో వచ్చినయి కాబట్టీ ఉట్టి కనిపిస్తలేదు. కానీ దానితో అనుబంధం ఉన్నొళ్లకైతే ఇదొక తీపి జ్ఞాపకం.






