Viral : కాళ్లూ చేతులూ లేకపోయినా.. ఎందరికో స్ఫూర్తి.. ఆమె లైఫ్ జర్నీ!

by Javid Pasha |

ఆటంకాలు వెంటాడుతుంటాయి. సవాళ్లు చుట్టు ముడుతుంటాయి. అయితేనేం..! వాటిని అధిగమిస్తూ విజయ తీరాలదాకా సాగుతుంటారు కొందరు.

Viral : కాళ్లూ చేతులూ లేకపోయినా.. ఎందరికో స్ఫూర్తి.. ఆమె లైఫ్ జర్నీ!
X

దిశ, ఫీచర్స్ : జీవితం అందరికీ పూలబాట కాదు. ముళ్లూ రాళ్లూ ఎన్నో ఉంటాయి. అనుకోని ఆటంకాలు వెంటాడుతుంటాయి. సమస్యల సుడిగుండాలు, సవాళ్లు చుట్టు ముడుతుంటాయి. అయితేనేం.. ఆ కష్టాలను అధిగమించి, బాధలకు ఓర్చి విజయ తీరాలదాకా సాగుతుంటారు కొందరు. ఈ కోవకు చెందిన మరో ధైర్యవంతురాలే 18 ఏళ్ల పాయల్ నాగ్. ఇటీవల జరిగిన వరల్డ్ ఆర్చరీ పారాసిరీస్‌లో భారత పారా ఆర్చర్‌గా ప్రతిభ చాటి బంగారు పతకాన్ని సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే చర్చిస్తోంది. కాళ్లూ చేతులూ లేని ఒక యువతి దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చడమే కాకుండా.. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

అనుకోని ప్రమాదంతో వైకల్యం

పాయల్ నాగ్ స్వగ్రామం జమునాబహాల్. ఇది ఒడిశా రాష్ట్రంలోని బలాంగీర్ (Balangir / Bolangir) జిల్లాలో ఉంది. తల్లిదండ్రులు జనతా నాగ్, బిజయ్ కుమార్ నాగ్. చాలా పేదకుటుంబం. తండ్రి రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అందరిలా ఆడుతూ పాడుతూ పెరిగిన పాయల్ జీవితంలో ఒక రోజు అనుకోని సంఘటన జరిగింది. సుమారు ఎనిమిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురై.. రెండు చేతులు, రెండు కాళ్లను కోల్పోయింది. ఆ సమయంలో అందరూ బాధను, సానుభూతిని వ్యక్తం చేసినా.. ఆ తర్వాత ఈ అమ్మాయి బతికినా లాభం లేదు. జీవితాంతం కూర్చోబెట్టి పోషించాల్సిందే అని పాయల్ నాగ్ తల్లిదండ్రులతో అనేవారు. ఇక బంధువులైతే ఇంత విషమిచ్చి చంపినా మేలు అని ఎద్దేవా చేసేవారట.

అనాథాశ్రమం నుంచి అంతర్జాతీయం వరకు

ఓ వైపు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు సమాజం నుంచి వచ్చిన ఒత్తిడివల్ల బలాంగీర్ జిల్లా కలెక్టర్ సహాయంతో 2019లో పాయల్‌నాగ్‌ను పర్బతిగిరి బాల్ నికేతన్ అనాథాశ్రమంలో చేర్చారు ఆమె తల్లిదండ్రులు. అక్కడే చాలా కాలం పెరిగిన ఈ యువతి ఇప్పుడు ప్రపంచం మెచ్చిన పారా ఆర్చర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్-2026లో కాంపౌండ్ మహిళల విభాగంలో.. వరల్డ్ ఫేమస్ ఆర్చర్, తన స్ఫూర్తి ప్రదాత అయిన శీతల్ దేవిని ఫైనల్‌లో 139-136 స్కోర్‌తో ఓడించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నది. ఇది ఆమె సీనియర్ ఇంటర్నేషనల్ రంగంలో మొదటి బంగారు పతకం కాగా, ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం 16 పతకాలు (7 గోల్డ్, 5 సిల్వర్, 4 రాగి) సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచంలోనే కాళ్లూ చేతులు(quadruple amputee) మొదటి అంతర్జాతీయ ఆర్చరీ క్రీడారిణిగా పాయల్‌నాగ్ కృషి, పట్టుదల, ప్రదర్శించిన ధైర్యం, సాధించిన విజయం నేటి యువతకు ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి. వైకల్యం వైఫల్యానికి కేరాఫ్ కాదు అనే ఒక సందేశం అంటున్నారు విశ్లేషకులు.

Next Story