రియల్ జహీరాబాద్ షా

by Daayi Srishailam |

నిమ్జ్‌తో రియల్ బూమ్ పైపైకి

రియల్ జహీరాబాద్ షా
X

దిశ, జహీరాబాద్: రాష్ట్రంలో జహీరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజుగా ఎదుగుతోంది. నిమ్జ్ లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఎఫెక్ట్ తో పొరుగు రాష్ట్రాల పెట్టుబడుల బూమ్ పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో ఒకప్పుడు సాదాసీదా పట్టణంగా ఉన్న జహీరాబాద్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ స్పాట్‌గా మారింది. అనూహ్యంగా ఈ ప్రాంతం ప్రాధాన్యత పెంచుకోవడంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి భూములు, అపార్ట్‌మెంట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు పక్క రాష్ట్రాల రియల్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రధాన కారణం నిమ్జ్

జహీరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇంతటి తారస్థాయికి ఎగబాకడానికి నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు - ఉత్పాదక మండలి) ప్రాజెక్టే ప్రధాన కారణం. సుమారు 12 వేలఎకరాలకు పైగా విస్తరించనున్న అంతర్జాతీయ స్థాయి నిమ్జ్ ప్రాజెక్టు ఈ ప్రాంత రూపురేఖలను మార్చేస్తోంది. దీనికి తోడు వ్యూహాత్మక భౌగోళిక స్థానం జహీరాబాద్‌కు అదనపు బలాన్ని చేకూర్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం. దేశ ఆర్థిక రాజధాని మంబైకి కనెక్ట్ అయ్యే జాతీయ రహదారి సౌకర్యం ఉంది. కర్ణాటకలోని చారిత్రక పట్టణం బీదర్ సిటీ సమీపంలో ఉంది. రైల్వే సౌకర్యం తదితర అనుకూలతల కారణంగా జహీరాబాద్ కేవలం తెలంగాణ రియల్ వ్యాపారులకే కాక, పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు కూడా బంగారు బాతులా కనిపిస్తోంది.

అనూహ్య వృద్ధి

పక్క రాష్ట్రాల రియల్ వ్యాపారులు తమ చూపును జహీరాబాద్‌పై మళ్లించడంతో, ఇక్కడ రియల్ బూమ్ అంతకంతకూ పెరుగుతోంది. భూముల కొనుగోలు, అపార్ట్‌మెంట్‌లలో పెట్టుబడులపైనే వారు పూర్తి ఫోకస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం, రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం ఊహకందని రీతిలో వృద్ధి చెందుతుందని, స్థిరాస్తి విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి, జహీరాబాద్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇది రియల్ ఎస్టేట్ వృద్ధికి మరింత ఇంధనాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జహీరాబాద్ భవిష్యత్తులో ఓ ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

త్వరలో ఫస్ట్ ఫేజ్ పనులు

నిమ్జ్ ఫస్ట్ ఫేజ్ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి దశలో 3,245 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నిమ్జ్ ప్రాజెక్ట్ మొత్తం 12,635 ఎకరాల్లో విస్తరించనుంది. ఇందుకోసం రూ.2,369 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ పురోగతి వ్యాపారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. జాతీయ రహదారుల పొడవునా ఎకరం భూమి ధర రూ. 4 కోట్లు దాటగా, ఇతర రహదారులపై కూడా రూ.1 కోటి కంటే ఎక్కువగా పలుకుతోంది. నిమ్జ్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు జహీరాబాద్ ను ఒక కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాయి. భూముల వ్యాపారం మళ్లీ జోరందుకోవడమే కాకుండా, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఇదో మైలురాయిగా నిలుస్తుంది.

అభివృద్ధికి అవకాశాలు

నిమ్జ్ ప్రాజెక్టు ప్రాంతంలో అభివృద్ధికి ఎనలేని అవకాశాలున్నాయని రియల్ వ్యాపారుల అంచనా. అందుకే పెట్టుబడులకు అయా వర్గాలనుంచి ఆసక్తి పెరుగుతోంది. ప్రాజెక్టు ప్రాంతం జహీరాబాద్ కు హైదరాబాద్ నగరం లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం రెండు గంటల్లో ఇక్కడికి చేరుకునే ఫోర్ వే జాతీయ రహదారి సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి ముంబైకి ఈ సౌకర్యం విస్తరించి ఉండటం. దీనికి తోడుగా పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ విమానాశ్రయం ఇక్కడికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలైతే వేలాది ఉద్యోగాలు వస్తాయి. దీంతో నివాస ప్రాంతాల అవసరం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే, చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు భూములతో పాటు ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే అనేక కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. రానున్న అతికొద్ది రోజుల్లో ఈ ప్రాంతం రూపురేఖలను పూర్తిగా మారిపోనున్నాయని అంచనా.

నెలరోజుల్లో లేఔట్ పనులు

ప్రభుత్వం నిమ్జ్ ఫస్ట్ ఫేజ్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెర పడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం. ఇది స్థానిక వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. 2012లో మొదలైన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కల త్వరలో నెరవేరనుంది. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, భూముల ధరలు ఊహ కందని రీతిలో పెరగనున్నాయి. నిమ్స్ ప్రాజెక్ట్ మొదటి దశకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.

Next Story