- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Memories : కప్పుకున్న కొప్పెర.. టేకాకు దొప్ప.. ఆ రోజులే వేరబ్బా!
తను వస్తున్నట్టు సూచనలేవో కళ్లకు కడుతున్నాయి. తను వచ్చేముందు ఇచ్చే సిగ్నల్స్ ఏవో మదిని తడుముతున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఎందుకో కానీ.. నేనెప్పుడు బయట అడుగు పెడదామన్నా నేను కూడా రెడీ అన్నట్లు తనెప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తనంటే నాకు ఇష్టమే అయినా.. కొన్నిసార్లు తన కంట పడకూడదని, తన స్పర్శ తగలకూడదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాను. చాలాసార్లు అలాంటి ప్రయత్నం చేసి విఫలం అయ్యాను. కానీ ఈసారి ఆ చాన్స్ ఇవ్వొద్దని మైండ్‌లో ఫిక్స్ అయ్యా. అందుకే తన గురించి ఆలోచిస్తూ.. హాల్లో నిల్చున్న నేను, తనేమైనా వచ్చే అవకాశం ఉందేమోననే అనుమానంతో కిటిలోంచి బయటకు చూశా. నో చాన్స్.. ఆ క్షణమైతే తను లేదక్కడ.
ఆకు పచ్చని గుబుర్లలో..
ఏదేమైనా తను రాకముందే నేను వెళ్లిపోవాలని రెడీ అయిపోయా. ఎంతకైనా మంచిదని మరోసారి అటూ ఇటూ చూశాను. తను కనుబడుట లేదు కానీ.. బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పరిసరాలన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇక మా ఇంటి ముందు గల ఆకుపచ్చని గుబుర్లలో అరవిరిసిన గులాబీలు అందంగా కనిపిస్తున్నాయి. నా వైపు చూస్తూ నవ్వుతున్నట్టే తోస్తోంది నాకైతే. ఇంతలోనే మళ్లీ ఠక్కున తను గుర్తొకొచ్చి పరిసరాలన్నీ పరిశీలిస్తూ.. తల పైకెత్తి చూశా. ఆకాశంలోని అధికభాగం తెల్లగా.. మధ్య మధ్యలో ఏదో అర్జంటు పనుంది అన్నట్లు వేగంగా పరుగెడుతున్న నల్లటి మేఘాలు కనువిందు చేస్తున్నాయి.
అడుగు జాడల సవ్వుడులై..
హమ్మయ్యా.. ఇప్పటికైతే తను లేదు. ఇక రాదు కూడా అని మనసులోనే అనుకుంటూ గడపదాటాను. కొంత దూరం నడిచి వెళ్లానో లేదో.. తను వస్తున్నట్టు సూచనలేవో కళ్లకు కడుతున్నాయి. తను వచ్చేముందు ఇచ్చే సిగ్నల్స్ ఏవో మదిని తడుముతున్నాయి.. తన అడుగు జాడల సవ్వడులేవో చెవుల్లో మారు మోగుతున్నాయి. అయినా నేను చేరాల్సిన గమ్యం కూడా మరెంతో దూరం లేదు. ఈ రోజు ఎలాగైనా తనకు చిక్కకూడదనే గట్టి నిర్ణయంతో నడక దారిలో నడుస్తూనే ఉన్నాను.
ఇంతకీ ఎవరు తను?
అయ్యో.. ఎంత పనైంది! ఏ సముద్రపు అలలను స్పృశిస్తూ ఇటుగా వస్తున్నదో కానీ.. రానే వచ్చింది. తన రాకతో చల్లటి పవనమేదో నా శరీరాన్ని తాకుతున్న భావన. ఏ మలయ మారుతాలను మోసుకొస్తున్నదో తను.. నలువైపుల నుంచి నన్ను చుట్టు ముట్టే ప్రయత్నమేదో జరుగుతోంది. ఎలాగైనా.. తన నుంచి తప్పించుకోవాలనే ఆరాటంతో నేను.. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నట్లు నన్ను అల్లుకుపోతున్న తను.. ఈసారి కూడా అంతే.. తను లేకుండా వెళ్లాలన్న నా ఆశ నెరవేరలేదు. అయినా నాకేం బాధ లేదు. ఒక్కోసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తానుకానీ.. తనంటే నాకు ప్రాణం. ఇంతకీ తనెవరో అనుకుంటున్నారా..? ఎవరో కాదు.. వర్షం (the rain). వర్షాకాలం చుట్టూ అల్లుకుపోయి నా బాల్య సృతులు.
చిరు జల్లు వచ్చినా.. జడివాన కురిసినా..
నాకే కాదు. 90s కిడ్స్(90s Kids) అందరికీ అంతేనండోయ్.. వర్షం వచ్చే సందర్భమన్నా, వర్షాకాలమన్నా, వర్షంలో తడవడమన్నా మహా ఇష్టంగా ఉండేది ఆరోజుల్లో.. చిరు జల్లు వచ్చినా.. జడి వాన కురిసినా.. తడుస్తూ.. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.. కాగితపు పడవలు వదులుతూ.. కాలం ఒడిలో ఆనందంగా గడిపేసే వాళ్లం.. అప్పుడప్పుడూ వానలో తడవకుండా కప్పుకున్న గోనె సంచి కొప్పెరలు కప్పుకొనో, టేకాకు దొప్పలు తలపై పెట్టుకొనే పొలాలపోంటి ఉర్కులాడేటోళ్లం. ఒకటా.. రెండా.. వానమ్మ చుట్టూ అల్లుకున్న అనుభవాలు ప్రతీ ఒక్కరి జీవితంలో మరువలేని మధుర జ్ఞాపకాలే కదా..!






