నిబంధనలు ఉల్లంఘిస్తే టీజీరెరా ఉక్కుపాదం.. బాధితులకు భరోసగా..

by Sujitha Rachapalli |

టీజీరెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, డెవలప్మెంట్ చట్టాన్ని అమలు చేయడమే కాదు.. రూల్స్‌ను అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరిస్తుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే టీజీరెరా ఉక్కుపాదం.. బాధితులకు భరోసగా..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీరెరా) రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్, డెవలప్‌మెంట్) చట్టం అమలు చేయడమే కాదు.. బాధితులకు భరోసా కల్పించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పెనాల్టీ వేయడమే కాదు.. పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయించి వినియోగదారులకు అండగా నిలిచింది. టీజీరెరా బడాబాబుల పక్షం కాదు.. బాధితుల పక్షమని నిరూపించింది.

చట్టానికి పదును…

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్, డెవలప్‌మెంట్) చట్టం 2016లోని సెక్షన్ 7, 8 ప్రకారం చర్యలు తీసుకుని పెండింగులో ఉన్న ‘జయా ప్లాటినం’ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయించింది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిన ఈ ప్రాజెక్ట్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని బౌరంపేట్ గ్రామం, దుండిగల్ మున్సిపాలిటీలో ఉంది. ఈ జయా ప్లాటినం ప్రాజెక్ట్ తెలంగాణ రెరా వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ P02200003688 కింద నమోదైంది. మొత్తం 60 ఫ్లాట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్.. 2022 జూన్ నాటికి సుమారు 66 శాతం పనులు పూర్తి చేసుకుంది. కానీ బిల్డర్ చేతులెత్తయ్యడంతో నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. మెజార్టీ ఫ్లాట్లు కొనుగోలుదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పటికీ పనులు ఆగిపోయాయి.

ప్రమోటర్ చేతులెత్తేయడంతో…

ప్రమోటర్ గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమవడంతో బాధితులు టీజీరెరాను ఆశ్రయించారు. ప్రమోటర్ నిర్దేశిత గడువులో ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయాడని.. స్పష్టమైన పూర్తి ప్రణాళికను ఇవ్వలేదని అథారిటీకి ఫిర్యాదు చేశారు. అథారిటీ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ) తనిఖీ చేపట్టి, నివేదికను రెరాకు సమర్పించింది. ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయిందని, మిగిలిన పనులకు అధిక సమయం, నిధులు అవసరమని నివేదికలో తేలింది. ప్రమోటర్ తన ఆర్థిక స్థోమతను నిరూపించుకోవడంలో, సరైన పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించడంలో విఫలమవడంతో అథారిటీ 30 ఏప్రిల్ 2024న సదరు ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అసమర్థత కారణంగా ప్రమోటర్‌ను ‘డిఫాల్టర్’గా ప్రకటించి, ఇతర ప్రాజెక్టుల నుంచి నిషేధించడమే కాకుండా, వివిధ ప్రాజెక్టులలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలకుగాను రూ.2,36,83,156 జరిమానా విధించింది. ఈ డీఫాల్ట్ ప్రకటనను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రెరాలకు పంపించిన టీజీరెరా.. ఈ ప్రమోటర్‌కు ఎటువంటి కొత్త అనుమతులు ఇవ్వొద్దని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి పట్టణాభివృద్ధి సంస్థలకు అథారిటీ లేఖలు రాసింది.

కొనుగోలుదారుల సంఘం ఏర్పాటు…

సెక్షన్ 7 కింద రిజిస్ట్రేషన్ రద్దు చేసిన అనంతరం కొనుగోలుదారుల సంఘం ద్వారా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అథారిటీ చట్టంలోని సెక్షన్ 8ని వర్తింపజేసింది. ఫ్లాట్ యజమానులు మెజారిటీ సమ్మతితో ‘జేపీ వెల్ఫేర్ అసోసియేషన్’ను ఏర్పాటు చేసి, మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఒక స్పష్టమైన ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదనలో ఆర్థిక ప్రణాళిక, ప్రత్యేక బ్యాంకు ఖాతా, పనులు పూర్తి చేయడానికి నిర్ణీత కాలపరిమితి వంటి వివరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత, అథారిటీ నిబంధనల పర్యవేక్షణలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అసోసియేషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ పర్యవేక్షణలో మిగిలిన 34 శాతం పనులు విజయవంతంగా పూర్తి కావడమే కాకుండా, ప్లానింగ్ అథారిటీ నుండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) కూడా లభించింది. ఈ ప్రక్రియ ద్వారా నిలిచిపోయిన ప్రాజెక్టులను చట్టబద్ధంగా పూర్తి చేయవచ్చని తెలంగాణ రెరా నిరూపించడమే కాకుండా, కొనుగోలుదారులకు న్యాయం చేకూర్చి రియల్ ఎస్టేట్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది.

Next Story