Technology : పర్యావరణ హితమే లక్ష్యం.. సెల్ఫ్ హీలింగ్ ప్లాస్టిక్‌ను డెవలప్ చేసిన పరిశోధకులు..

by Javid Pasha |   (  Updated:2025-08-13 07:55:45  IST  )

Technology : పర్యావరణ హితమే లక్ష్యం.. సెల్ఫ్ హీలింగ్ ప్లాస్టిక్‌ను డెవలప్ చేసిన పరిశోధకులు..

Technology : పర్యావరణ హితమే లక్ష్యం.. సెల్ఫ్ హీలింగ్ ప్లాస్టిక్‌ను డెవలప్ చేసిన పరిశోధకులు..
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ వాడకం తప్పనిసరైనప్పుడు దాని వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలను ఎలా నివారించాలనేదానిపై పరిశోధకులు చాలా కాలంగా ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. స్టీల్‌కంటే కూడా ఎక్కువ కాలం మనగలిగే Self-healing (స్వీయ- స్వస్థత) కాంపోజిట్ మెటీరియల్‌ను డెవలప్ చేశారు. ఈ కార్బన్ - ఫైబర్ ఆధారిత ప్లాస్టిక్ కాంపోజిట్ ఏరోస్పేస్, ఆటోమోటివ్, అలాగే డిఫెన్స్ పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని భావిస్తున్నారు.

సెల్ఫ్ హీలింగ్ కాంపోజిట్‌ను అరోమాటిక్ థర్మోసెట్టింగ్ కోపాలిస్టర్ (ATSP) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పదార్థం మానవ చర్మం మాదిరి, తనకు తానే గాయాలను స్వయంగా బాగుచేసుకోగలదు. కాలక్రమంలో ఏర్పడే డ్యామేజ్‌ను స్వీయ మరమ్మతు చేసుకోగలదు. ప్రమాదాల్లో గాయపడినప్పటికీ వేడి ద్వారా తన ఆకారాన్ని తిరిగి పొందగలదు. ఒక విధంగా చెప్పాలంటే స్టీల్ కంటే బలంగా ఉండి, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. అట్లనే దీని రీసైక్లబిలిటీ ట్రెడీషనల్ ప్లాస్టిక్‌లకు సుస్థిర ప్రత్యామ్నాయం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా విమానాలు లేదా వాహనాలలో అరోమాటిక్ థర్మోసెట్టింగ్ కోపాలిస్టర్ బాండ్-ఎక్స్ఛేంజ్ కెమిస్ట్రీ ద్వారా వేడిని అప్లై చేయడం కారణంగా పగుళ్లు లేదా లోపాలను సరిచేయవచ్చు. తద్వారా అసలు బలాన్ని పునరుద్ధరించవచ్చు లేదా అంతకంటే మెరుగైన బలాన్ని కూడా సాధించవచ్చు.

విమానాలలో అత్యంత ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల శక్తి సామర్థ్యాలు సెల్ఫ్ హీలింగ్ (Self-healing)కాంపోజిట్ మెటీరియల్‌‌‌కు ఉన్నాయి. కాబట్టి ఇది భవిష్యత్ మెటీరియల్ డిజైన్‌లకు ముఖ్యమైనదే కాకుండా పర్యావరణ హితమైనదని పరిశోధకులు పేర్కొంటున్నారు. విమానాలు, వాహనాలలో భద్రతను మెరుగుపరచడమే కాకుండా రీసైక్లింగ్ సామర్థ్యం ద్వారా ఈ టెక్నాలజీ పర్యావరణ వ్యర్థాలను తగ్గిస్తుంది. మొత్తానికి ఖరీదైన మరమ్మతులను, నిర్వహణ సమయాన్ని తగ్గించడం ద్వారా విమాన, ఆటోమోటివ్ రంగాలలో సుస్థిరతను, దీర్ఘాకాలిక మన్నికను పెంచుతుంది.

Next Story