పసి వయసు.. ప్రాణ దాత..!

by Javid Pasha |   (  Updated:2026-02-15 12:29:40  IST  )

ఫిబ్రవరి 13న అలిన్ షెరిన్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ క్షణంలో చిన్నారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అయినప్పటికీ, అంత దుఃఖంలోనూ తమ చిన్నారి కూతురు అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు అరుణ్ అబ్రహం, షెరిన్ అన్ జాన్‌ దంపతులు.

పసి వయసు.. ప్రాణ దాత..!
X

దిశ, ఫీచర్స్ : అన్న దానం.. ఒకరి ఆకలి తీరుస్తుంది. అవయవదానం.. ఒకరి ప్రాణాలు నిలబెడుతుంది. ఈ రోజుల్లో అన్నదానం చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. కానీ అవయవదానం చేసేవారు మాత్రమే చాలా అరుదుగా ముందుకొస్తుంటారు. నూటికో.. కోటికో ఒకరుంటారు. అలాంటి అరుదైన వారి లిస్టులో ఇప్పుడు కేరళ రాష్ట్రానికి చెందిన ఓ పదేళ్ల పాప అలిన్ షెరిన్ అబ్రహం కూడా చేరింది. ఓ యాక్సిడెంట్‌లో బ్రెయిడ్ డెడ్ అయిన ఆ చిన్నారి అవయవాలను పేరెంట్స్ డొనేట్ చేయడంతో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఆమె పేరెంట్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగింది? పదేళ్ల చిన్నారి అవయవదానం ఎందుకు చేయాల్సి వచ్చింది? కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా, మల్లప్పళ్లి గ్రామానికి చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ అన్ జాన్‌ల ముద్దుల కూతురే అలిన్ షెరిన్. తల్లిగారింటివద్ద షెరిన్ అన్ జాన్.. తన కూతరు అలిన్ షెరిన్‌తోపాటు, తన పేరెంట్స్‌తో, సోదరులతో కలిసి ఫిబ్రవరి 5న కొట్టాయం నుంచి తిరువల్లకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కొట్టాయం జిల్లాలోని పల్లం బోర్మా జంక్షన్ (MC రోడ్డు) వద్దకు రాగానే.. వారు ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా.. వేగంగా మరోకారు దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో చిన్నారి అలిన్ షెరిన్ తీవ్రంగా గాయపడింది. తల్లి, తాత-నానమ్మలు కూడా సీరియస్‌గా గాయపడ్డారు. వెంటనే అలిన్‌ను కొచ్చి అమృతా హాస్పిటల్‌కు తరలించారు. కానీ.. చికిత్స పొందుతున్న ఆ చిన్నారి కోలుకోలేకపోయింది.

ఫిబ్రవరి 13న అలిన్ షెరిన్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ క్షణంలో చిన్నారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అయినప్పటికీ, అంత దుఃఖంలోనూ తమ చిన్నారి కూతురు అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు అరుణ్ అబ్రహం, షెరిన్ అన్ జాన్‌ దంపతులు. అలిన్ షెరిన్ రెండు కిడ్నీలు ఓ పదేళ్ల పాపకు, లివర్ ఏడు నెలల నవజాత శిశువుకు, కళ్లు(కార్నియా) ఐ బ్యాంక్‌కు, హార్ట్ వాల్వ్ - శ్రీ చిత్రా ఇన్‌స్టిట్యూట్‌కు దానం చేశారు. దీంతో పదేళ్ల అలిన్ షెరిన్ యంగెస్ట్ ఆర్గాన్ డోనర్‌గా, అతి చిన్న వయసులో ప్రాణదాతగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ పాపకు సంబంధించి ముసి ముసి నవ్వులతో కూడిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్ల హృదయాలను టచ్ చేస్తోంది.

Next Story