అబ్బబ్బబ్బ.. ఏం ఎండల్‌‌‌‌‌‌రా ఇవీ..?

by Daayi Srishailam |

లెట్స్ ఫాలో అండ్ బీట్ ద హీట్.!!

అబ్బబ్బబ్బ.. ఏం ఎండల్‌‌‌‌‌‌రా ఇవీ..?
X

ఎండలు కొద్దిసేపు సల్లబడుతున్నయి.

కొద్దిసేపు బండలు పగిలిపోయేలా దంచుతున్నయి.

ఉదయంపూటనే ఉక్కపోస్తోంది.

ఈ మండే ఎండలకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఎండ తీవ్రత నుంచి ఎలా తప్పించుకోవాలి.?

సమ్మర్‌‌ సమ్మగా ఉండేందుకు ఏం చేయాలి.?

ఎలాంటి ఆహారం తీసుకోవాలి.?

ఏ రకమైన డ్రెసింగ్ వేసుకోవాలి.?

లెట్స్ ఫాలో అండ్ బీట్ ద హీట్.!!

- దిశ, ఫీచర్స్

రోడ్డుపై ఆమ్లెటేసి హీట్‌తో రోరింగ్ చేసే సీన్లు చూస్తున్నాం. భానుడి భగభగలు.. సూరీడి సెగభగలు కాచుకొని కూర్చున్నాయి. అసలే మన దగ్గర వాతావరణం హీటెక్కే ఉంటుందాయె. దానికి తోడు ఇలా అబ్బో అనిపిస్తే.. ఇక మనం బెదుర్సే.!

ఎండకు పైలం

సమ్మర్ వల్ల ప్రకాశవంతమైన ముఖాలు కాస్త వాడిపోతాయి. ఎంత చలినైనా తట్టుకుంటాం.. వానలో గంటల తరబడి తడవాల్సి వచ్చినా భరిస్తాం. కానీ సూరీడు సుర్రుమనే ఎండ ప్రతాపానికి లేచి గంతేస్తాం. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

మే అంతా దంచుడే

గత నెలలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం తగ్గిందట. భూమిలో.. గాలిలో తేమశాతం అమాంతం పడిపోయిందట. దీంతో వేడిపెరిగి వాతావరణం హీటెక్కుతుందని చెప్తున్నారు. 125 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే ఈయేడు ఎండల తీవ్రత చాలా ఎక్కువట. ఇక మే నెల మొత్తం ఎండలు దంచుడు దంచుతయని చెప్తున్నారు వాతావరణ నిపుణులు.

గుండె పదిలం

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టీ గుండె సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండ ప్రభావానికి ఎక్కువగా గురైతే రక్తంలో ఇన్‌ఫ్లమేషన్ స్థాయిలు పెరిగి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే కణాల సంఖ్య తగ్గుతుందట. ఎండ వేడిమికి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి మెదడుకు రక్త సరఫరా ఎక్కువయి మెదడులో రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇలా మెదడులో రక్త ప్రవాహం పెరగడం వల్ల బ్రెయిన్ ఒత్తిడికి గురై స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు. గతంలో "ది లాన్సెట్" జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎండ వేడిమి స్ట్రోక్ రిస్క్‌ను 35శాతం పెంచుతుంది.

ఇవి తినండి

వేసవిలో ద్రవాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగడం మంచిది. నీటిశాతం తక్కువగా ఉంటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల వాంతులు.. విరేచనాలు అవుతాయి. మజ్జిగ ఎక్కువగా తాగితే శరీరానికి కావాల్సిన కాల్షియం.. ప్రొటీన్లు అందుతాయి. తరుచూ నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి తప్పించుకోవచ్చు. ఖర్బూజ.. తర్బూజ పండ్లు.. కీరా.. రాగిజావా తీసుకోవాలి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండి ఒంటికి చలువ చేస్తాయి.

ఈ దుస్తులు వేసుకోండి

సమ్మర్‌లో డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్ దుస్తులు మంచివి. ప్లెయిన్ దుస్తులు కాకుండా చెక్ మోడల్స్ వేయాలి. ఏవైనా సమ్మర్ టూర్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వైట్ స్నీకర్స్ లేద పెన్సిల్ హిల్స్ ధరించడం ఉత్తమం. అలాగే బెల్ట్ మెడల్ దుస్తులు కూడా బెటర్. కాటన్.. ఖద్దర్.. పలచగా ఉండి శరీరానికి గాలి తగిలే దుస్తులను వాడాలి. కాటన్ దుస్తులు ఉష్ణోగ్రతను నియంత్రించి గాలినిస్తూ శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి. చెమటలు పట్టకుండా చేస్తాయి. చల్లదనాన్ని ఇస్తాయి. అయితే ప్యూర్ కాటన్ వస్త్రాలు మాత్రమే వాడటం మంచిది. కాటన్ మిక్చర్ వాడటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు.

జాగ్రత్తలు

- రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.

- ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి .

- ఎండలో ప్రయాణించేవారు గొడుగు.. హెల్మెట్.. గ్లౌజెస్ వాడాలి.

- ఆహారంలోతగినంత ఉప్పు.. నీరు.. పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి.

- డీ హైడ్రేషన్‌కు లోనవ్వకుండా చూసుకోవాలి.

వడదెబ్బ

- అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి.

- ఎండలో ఎక్కువగా తిరగొద్దు.

- కారం.. మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి.

- ధ్యానం.. యోగాను ప్రాక్టీస్ చేయాలి.

- శరీరం అతివేడిగా అనిపిస్తే చల్లటి నీటితో స్నానం చేయాలి.

- వేడిని నియంత్రించకపోతే శరీరం తట్టుకోలేక వడదెబ్బ వస్తుంది.

Next Story