ఆలస్యం నుంచి ఆవిష్కరణ.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే పరికరాన్ని అభివృద్ధి చేసిన మహిళ

by Javid Pasha |   (  Updated:2026-05-22 15:16:56  IST  )

టెక్నాలజీ రీసెర్చ్‌పైనే పూర్తిగా కేంద్రీకరించిన ఆ మహిళ ఏఐ ఆధారిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు.

ఆలస్యం నుంచి ఆవిష్కరణ.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే పరికరాన్ని అభివృద్ధి చేసిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ మరణాలకు గల కారణాలలో దానిని ముందస్తుగా గుర్తించలేకపోవడం కూడా ఒకటి అంటుంటారు నిపుణులు. ప్రారంభంలోనే పసిగడితే తగిన చికిత్స అందించడం ద్వారా జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. కానీ ఇక్కడే చాలామంది విఫలం అవుతుంటారు. అయితే ఈ ఆలస్యాన్ని సాంకేతికతో అధిగమించాలనే లక్ష్యంతో ముందడుగు వేసిన ఓ మహిళ బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే అద్భుతమైన పరికరాన్ని అభివృద్ధి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆ సాంకేతిక పరికరం ఏమిటి?

ఉద్యోగం వదిలి.. పరిశోధనలవైపు

పేరు గీతా మంజునాథ్.. బెంగళూరు నివాసి. సాంకేతిక రంగంలో 20-25 ఏళ్లకు పైగా పనిచేశారు. Hewlett Packard (HP) Labsలో Principal Research Scientistగా 17 ఏళ్లు వర్క్ చేశారు. తర్వాత Xerox Research Centre Indiaలో Lab Director (Data Analytics & AI Research)గా పని చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ -IIScలో పీహెచ్‌డీ చేశారు. అయితే ఆమె తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడం వరకే పరిమితం కాలేదు. అంతకు మించి సాంకేతిక విషయాలపై ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆమె తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి 2016లో నిరామయ్ హెల్త్ అనలిటిక్స్ స్థాపించి, సొంతంగా సాంకేతిక పరిశోధనలు మొదలు పెట్టారు.

సవాలుగా తీసుకొని..

టెక్నాలజీ రీసెర్చ్‌పైనే పూర్తిగా కేంద్రీకరించిన గీతా మంజునాథ్ దేశంలోనే మొదటి ఏఐ ఆధారిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీనిని థర్మలైటిక్స్(Thermalytix) అని కూడా పిలుస్తారు. ఇది థర్మల్ ఇమేజింగ్+ ఏఐ కలయికతో పనిచేస్తుంది. తక్కువ ఖర్చు, రేడియేషన్ ప్రభావం లేని పోర్టబుల్ డివైజ్ కావడంతో గ్రామీణ ప్రాంతాలు, ఆరోగ్య శిబిరాలు, చిన్న క్లినిక్‌లలో కూడా ఉపయోగించడం చాలా సులభం. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడం ఇప్పుడు గతంకంటే చాలా సులభమైపోయింది. ప్రస్తుతం భారత దేశంలోని 200కు పైగా ఆస్పత్రులు & స్ర్కీనింగ్ సెంటర్లలో ఇది అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. 22కి పైగా దేశాల్లోనూ ఈ సాంకేతికత విస్తరించింది. క్యాన్సర్ గుర్తింపులో ఏర్పడుతున్న ఆలస్యాన్ని సవాలుగా తీసుకొని ఒక కొత్త ఆలోచనకు, ఆవిష్కరణకు తెరతీసిన గీతా మంజునాథ్ సక్సెస్ జర్నీ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు!

Next Story