Technoference : రియల్ కమ్యూనికేషన్‌‌ను దెబ్బతీస్తున్న ‘రీల్స్’ వ్యసనం!

by Javid Pasha |

Technoference : రియల్ కమ్యూనికేషన్‌‌ను దెబ్బతీస్తున్న ‘రీల్స్’ వ్యసనం!

Technoference : రియల్ కమ్యూనికేషన్‌‌ను దెబ్బతీస్తున్న ‘రీల్స్’ వ్యసనం!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవారు. సంతోషంగా గడిపేవారు. ఈ విధమైన కమ్యూనికేషన్ వల్ల పరస్పర అవగాహ కూడా ఏర్పడేది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసేది. తమ పిల్లల మనస్తత్వం ఎలాంటిదో, వారిని ఎలా డీల్ చేయాలో పేరెంట్స్‌కు, ఫ్యామిలీలోని ఇతర సభ్యులకు ఈజీగా అర్థమయ్యేది. అట్లనే పిల్లలు కూడా ఆయా పరిస్థితుల్లో తమ పేరెంట్స్‌ను, కుటుంబంలోని ఇతరులను అర్థం చేసుకోవడంలో ఇలాంటి ఓపెన్ కమ్యూనికేషన్ ఎంతగానో దోహద పడేది. మనుషుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించేది. ప్రేమానురాగాలను చిగురింపజేసేది. అనుబంధాలను మరింత బలోపేతం చేసేది. కానీ రాను రాను ఈ పరిస్థితిలో కొంత ప్రతికూల మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రియల్ కమ్యూనికేషన్‌ను ‘రీల్స్ వ్యసనం’ దెబ్బ తీస్తోందని అంటున్నారు.

అనుబంధాలకు బీటలు

లోకజ్ఞానం తెలియాలంటే నలుగురిలో కలిసిపోవాలని, అందరితో మాట్లాడుతూ ఉండాలని పెద్దలు అంటుంటారు. అలాంటప్పుడే బంధాలు బలపడతాయని, అనుబంధాలు పెనవేసుకుంటాయని చెబుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే సామాజిక జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ కమ్యూనికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. కానీ ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఇతర స్ర్కీన్లతో గడిపే సమయం అలాంటి మానవ పరస్పర చర్యలను నిరోధిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ టెక్నాలజీని వినియోగించుకునే తీరు కొందరి జీవితాల్లో ప్రత్యక్ష అనుబంధాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించకుండా చేస్తోంది. ఈ పరిస్థితినే మానసిక నిపుణులు ‘టెక్నోఫెరెన్స్’గా పేర్కొంటున్నారు. రీల్స్ స్క్రోల్ చేయడంలో ఉన్న ఆసక్తి రియల్ కమ్యూనికేషన్ పై లేకపోవడాన్ని, సాంకేతికత వల్ల వ్యక్తుల మధ్య పరస్పర చర్యలకు కలిగే అంతరాయాన్ని నిపుణులు ‘టెక్నోఫెరెన్స్’ గా పిలుస్తున్నారు.

మారుతున్న అలవాట్లు

ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే.. పరస్పరం మాట్లాడుకోవడం, అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం ద్వారా మాత్రమే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇది తర తరాల మానవ అనుభవాల సారాంశమని నిపుణులు అంటున్నారు. అయితే మోడర్న్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ బంధాలకు బీటలు వారుతున్నాయని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, టాబ్లాయిడ్స్ వంటి స్ర్కీన్లు ఇందులో కీ రోల్ పోషిస్తున్నాయి. ముఖ్యంగా యువత రియల్ కమ్యూనికేషన్ కంటే ఎక్కువ సమయం రీల్స్ స్క్రోల్ చేయడానికో, క్రియేట్ చేయడానికో కేటాయిస్తూ అసలు విషయాన్ని మర్చిపోతోంది. ఇక ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వ్యక్తులు తన పిల్లలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేసి స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూస్తూనో, సోషల్ మీడియాలో మునిగి తేలుతూనో కూర్చుంటున్నారు. ఇక కాలేజీ నుంచి, స్కూళ్ల నుంచి రాగానే పుస్తకాలు పట్టడానికి బదులు పిల్లలు కూడా ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటానికో, రీల్స్ స్ర్కోల్ చేయడానికో, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేయడానికో మొగ్గు చూపుతున్నారే తప్ప కుటుంబంతో మాట్లాడటానికి, సాదక బాదకాలు తెలుసుకోవడానికి వారికి సమయం ఉండట్లేదు. ఇలాగైతే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు?.

పిల్లలు, పేరెంట్స్‌పై ప్రభావం

సెలవు రోజుల్లోనో, ఖాళీ సమయం దొరికితేనో కుటుంబ సభ్యులంతా కలిసి ప్రేమగా మాట్లాడుకోవచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ ఈ రోజుల్లో ఇది చాలామందికి ఒక నెరవేరని కలగా మిగులుతోంది. ఎక్కువ శాతం కుటుంబాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఎవరికివారు ఫోన్లలో తలదూర్చేస్తుంటారు లేదా టీవీల్లో సినిమాలు, సీరియల్స్ వంటివి చూస్తూ కాలక్షేపం చేసేస్తుంటారు. ఇక్కడే మొదలవుతుంది అసలు ప్రాబ్లం. ప్రత్యక్షంగా మాట్లాడుకోకపోవడం, బాధలు, సంతోషాలు, సరదాలు పంచుకోకపోవడం, చర్చించకపోవడం చివరకు వ్యక్తిత్వాలు, మనస్తత్వాలపై ప్రభావం చూపుతున్నాయి. నేడు తమ పిల్లల మనస్తత్వం ఏంటో తల్లిదండ్రులకు తెలియకుండా పోతోంది. అలాగే తమ పేరెంట్స్ మనసులో ఎంత ప్రేమ ఉందో, పిల్లల జీవితాలకు సబంధించి వారి అభిప్రాయం, ఉద్దేశం, ప్లాన్ ఏమిటో ఈతరం పిల్లలకు తెలియడం లేదు. ఇక ఆర్థికపరమైన అంశాలు, బాధలు కుటుంబంలో ఆ బాధ్యత మోసే తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరికి సంబంధించిన అంశంగానే చూస్తున్నారు తప్ప అందరూ కలిసి మంచీ చెడూ మాట్లాడుకోవడం లేదు.

రిలేషన్ షిప్‌పై ప్రభావం

ఇక్కడ టెక్నాలజీని వ్యతిరేకించడం కాదు కానీ, దానిని యూజ్ చేసుకునే విధానంలో లిమిట్స్ లేకపోవడం చివరికి భార్యా భర్తల బంధాల్లోనూ చిచ్చు పెడుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడుకోని పరిస్థితులను క్రియేట్ చేస్తోంది స్మార్ట్ ఫోన్. ఒకే సోఫాలో కూర్చొని కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇన్‌స్టా రీల్స్ స్ర్కోల్ చేయడంలో ఒకరు, టీవీ సీరియల్ చూడటంలో మరొకరు నిమగ్నవడం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో కనిపించే కామన్ సిచువేషన్. ఇదే కొన్నిసార్లు మనస్పర్థలకు కారణం అవుతోంది. చివరికి బెడ్ రూమ్‌లో కూడా అదే పరిస్థితి. ఏదో కాసేపు పర్సనల్ లైఫ్ గడిపాక, ఎక్కువసేపు ఎవరికివారు సెల్ ఫోన్‌తోనే గడుపున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

టెక్నోఫెరెన్స్ టేకోవర్

ఎవరు ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు? వ్యక్తిగతంగా, సామాజికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే అంశాలు కుటుంబాల్లో లేదా వ్యక్తుల మధ్య చర్చించుకోవడం దాదాపు తగ్గుతోంది. కలిసి ఉంటూ కూడా మనసులో ఒంటరితనాన్ని అనుభవస్తూ అవస్థలు పడే కపుల్స్ సంఖ్య పెరిగిపోతోంది. ‘టెక్నోఫెరెన్స్’ రుగ్మతే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.చివరికి పేరెంటింగ్, సన్నిహిత సంబంధాలకు సంబంధించి నేడు స్క్రీన్ టైమ్ థెరపీ కూడా అందుబాటులోకి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీని అవసరానికి మాత్రమే వాడుకోవడం, అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story