పురాతన ఆటలకు.. పునరుజ్జీవం.!

by Daayi Srishailam |

ఆటలను బతికిస్తూ మరోవైపు లక్షల రూపాయలు సంపాదిస్తోంది

పురాతన ఆటలకు.. పునరుజ్జీవం.!
X

దిశ, ఫీచర్స్: గ్రామీణ పురాతన ఆటలు కేవలం ఉల్లాసం కోసమే కాదు. అవి కుటుంబాలను కలిపే.. తరాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే గొలుసు. బెంగళూరులోని తనుశ్రీ ఈ ఆటలకు పునరుజ్జీవనం చేయాలనే సంకల్పంతో టెక్ ఉద్యోగాన్ని వదిలేసి భర్తతో కలిసి పనిచేస్తోంది. ''రోల్ ది డైస్'' వెంచర్ ద్వారా ఆటలను బతికిస్తూ మరోవైపు లక్షల రూపాయలు సంపాదిస్తోంది.

టెక్ ఫీల్డును వదిలి..

గ్యాడ్జెట్స్.. స్క్రీన్ల నుంచి నేటి తరాన్ని బయటపడించాలన్న ఆలోచనతో తనుశ్రీ సాంప్రదాయ ఆటలను తిరిగి బతికిస్తోంది. టెక్ రంగం నుంచి సాంస్కృతిక సంరక్షకురాలిగా మారి సామాజిక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తనుశ్రీ.. బిట్స్ పిలానీలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చదివి.. గ్లోబల్ ఎడ్జ్ సాఫ్ట్‌వేర్.. లాజికా వంటి ఐటీ కంపెనీల్లో పనిచేసింది. తర్వాత హ్యాండ్‌మేడ్ జ్యువెలరీలోకి వెళ్లింది. కానీ తనకు భారతీయ సాంప్రదాయ ఆటలను పునరుజ్జీవనం చేయాలనే ఆలోచన ఉండేది. 2023లో భర్త శశి శేఖర్‌తో కలిసి ''రోల్ ది డైస్''ను స్టార్ట్ చేసింది.

15కి పైగా భారతీయ ఆటలు..

ప్రజెంట్ జనరేషన్ మొత్తం స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారు. వాటికి దూరం చేయాలంటే మూలాలతో కనెక్టయ్యేలా దిశానిర్దేశనం చేయాలనుకున్నది తనుశ్రీ. ఆ మూలాలు కుటుంబాన్ని కలిపే ఆటలు అయుండాలని ఆలోచించింది. తనదీ.. భర్తదీ టెక్ బ్యాక్‌గ్రౌండే అయినా.. దానిని వదిలేసి ఆటలను ఎంచుకున్నది. సాంస్కృతిక సంరక్షణే దీనికి మార్గమని భావించి పురాతన ఆటలకు కొత్త జీవం పోస్తోంది. ''రోల్ ది డైస్'' మొదట చిన్నగానే స్టార్టయింది. అది క్రమంగా మెరుగవుతూ వచ్చింది. ఇప్పుడు 15కి పైగా భారతీయ సాంప్రదాయ ఆటలను అందించే వేదికైంది.

నెలకు రూ.2 లక్షలు..

చౌకా బారా.. పగడే.. అలగునిమణి.. చౌసర్.. చోపట్.. ఆడుహులి.. నవకంకరి.. షోలో గుట్టి.. తాబ్లా.. పల్లాంగుళి వంటి పురాతన ఆటలను పరిచయం చేస్తోంది తనుశ్రీ. తన ప్రయత్నంలో భర్త సహకారం మరిచిపోలేనిది. ప్రతి ఆట భారతదేశ వివిధ ప్రాంతాల సంస్కృతి.. జానపద కల్చర్లో ఇమిడి ఉంది. వీటిని కేవలం ఆటలుగా కాకుండా స్నేహాన్ని నేర్పే సాంస్కృతిక వేదికగా భావిస్తారు. అలాంటి ఆటలను పునరుజ్జీవనం చేయడం ద్వారా నేటికాలపు తల్లిదండ్రులు.. పిల్లలు స్క్రీన్‌లకు బదులు ఈ ఆటల ద్వారా క్వాలిటీ టైమ్ గడుపేలా ప్రోత్సహిస్తూ నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు.

Next Story