ఇది బాబుగారి సైకిల్ కాదు.. మన చిన్నప్పటి సైకిల్

by Daayi Srishailam |   (  Updated:2025-05-25 05:56:06  IST  )

సైకిల్ లేకపోతే అంతే..

ఇది బాబుగారి సైకిల్ కాదు.. మన చిన్నప్పటి సైకిల్
X

90s కిడ్స్‌కు సైకిలొక స్వీట్ మెమొరీ.

భూమికి జానెడున్నా..

సైకిల్ సందులో కాలుదూర్చి "సై" అనేటొళ్లు.

సైకిల్ కనిపిస్తే చాలు..

తొక్కేదాక పానం నిమ్మళం ఉండకపోయేది.

అసొంటి సైకిల్ మెమొరీని నెమరేసుకుందాం.

- దిశ, ఫీచర్స్

ఇప్పుడంటే థర్డ్ క్లాస్ పిల్లలు కూడా ఎలక్ట్రిక్ స్కూటీ మీద "రయ్"మని వెళ్తుండ్రు. అప్పట్లో ఇవన్నీ లేవుగా. సైకిల్ టైర్ కొట్టి గల్లీలు తిరుగుతుంటే "స్కూటర్ నడిపిన" ఫీలింగ్ ఉంటుండె. ఎప్పుడో ఒకసారి సైకిల్‌ను టచ్ చేసే అవకాశమొచ్చేది. అప్పుడిగ ప్రపంచాన్ని జయించిన అనుభూతి.

అన్నీ పెద్ద సైకిళ్లే

ఇంటికొక సైకిల్ కూడా లేకపోతుండె. ఎవరైనా సుట్టాలు సైకిల్ తీసుకొస్తే పోరగాళ్లంతా దానిచుట్టే చేరేది.. బెల్లంచుట్టూ ఈగలు చేరినట్టు. కానీ.. వాళ్లలో ఒక్కనికీ సైకిల్‌ను తొక్కే తాకత్ ఉండదు. ఇప్పటిలెక్క రేంజర్ సైకిళ్లు.. వయసుకు తగ్గట్టు హైట్ ఉండే సైకిళ్లు.. గేర్ల సైకిళ్లు లేకపోతుండె కదా. ఏ సైకిలైనా పెద్దొళ్ల సైజులోనే ఉండేటియి. అండ్ల అట్లాస్ సైకిలంటే ఫేమస్ ఇగ. ఎవరికైనా కొత్తగ పెండ్లయితే సైకిల్.. గడియారం కట్నం కింద పెట్టెటొళ్లు. పెండ్లికి వారం రోజుల ముందే పెండ్లి పిల్లొల్లు సైకిల్‌ను తీసుకొచ్చి ఇంట్ల పెడుతుండె కాబట్టీ.. ఇగ దానితో పోరగాళ్ల ఆటలు మామూలుగా ఉండకపోవు.

అన్నా సైకిలియ్యవా.?

సైకిల్ పెద్దది కాబట్టి ముందుగాల సైకిల్ సందులో అక్కడొక కాలు.. ఇక్కడొక కాలేసి డేక్కుంట డేక్కుంట తొక్కేటొళ్లు. దానిని కాంచిడ్ అనెటోళ్లు. ఎంతో తిప్పలవడ్తెగానీ కాంచిడొచ్చేది కాదు. అప్పటికే తప్పతప్ప కిందపడి మొకాళ్లు చెక్కలయ్యేటివి. దెబ్బ తాకినా.. రక్తంకారుతున్నా సైకిల్ తొక్కుడు మరవకపోతుండె. ఇగ ఇదిట్లుంటే వానికే సైకిల్ సక్కగరాదురయ్యా అంటే ఎన్కాల ఇంకొకన్ని కూసుండబెట్టుకునేది. ఊకె కిందవడ్తుండని.. స్కూల్‌కు డుమ్మా కొడ్తుండని ఇంటొళ్లు సైకిలియ్యకపోతే.. పక్కింటొళ్లకు ఆ పనీ ఈ పనీ ఆసరయ్యి సైకిల్ అడుకొని తొక్కుతుండె.

మనల్నెవ్వరు ఆపేది

అట్లి్ట్ల కాంచిడ్ తొక్కుడు నేర్చుకొని పర్ఫెక్ట్ ఐతుండె. పిలగానికి ఎట్లా సైకిల్ తొక్కుడొస్తుందని ఇంటొళ్లుగూడ మెస్లనియ్యకుండ పనిజెప్పుదురు. బాయికాడికి పోవుడు.. దుకాణం కాడికి పోవుడు.. మిరపకాయల గిర్నీ కాడికి.. పిండి గిర్నీ కాడికి ఊ అంటే ఆ అంటే పంపిస్తుండె. సైకిల్‌ను బ్యాలెన్స్ జేస్తున్నం.. దాన్ని నడిపే తాకత్ వొచ్చింది అనిపిస్తే కాంచిడ్ తొక్కుడు బంజేశి దండెమీదికి ఎక్కుతుండె. దండె తొక్కితే మస్తు పొడుగైతరు.. కాళ్లకు చేతులకు బలమొస్తది మంచిగ తొక్కు అని ఇంటొళ్లు సపోర్ట్ చేస్తుండె. ఇక సీటుమీదికెక్కి తొక్కుడే మిగిలింది. అదిగూడ నేర్సుకున్నమంటే మనల్ని ఆపెటొళ్లే ఉండరన్న ఫీలింగ్ ఉండేది.

కిరాయి సైకిల్

ఇంకేముందీ.. సీటుగూడ తొక్కొచ్చిందంటే ఊర్లపొంటి గూడ పంపించెటొళ్లు పెద్దొళ్లు. దగ్గర దగ్గర ఊర్లుంటే దసరా పండుగకు అక్కను తీస్కరాపో.. పెండ్లి కారట్లిచ్చిరాపో అని పనులన్నీ చెప్తుండె. మనకేందంటే సైకిలిస్తరు కాబట్టీ ఏడికివొమ్మంటే ఆడికిపోతుంటిమి. సైకిళ్లు లేనప్పుడు.. కిరాయి సైకిళ్లు తీసుకొని వెళ్తుంటిమి. ఒక్క రూపాయికి గంట సేపు తొక్కాలె. ఒక్క నిమిషం ఆల్శెమైనా రెండు రూపాయలు ఇయ్యవల్సి వస్తుండె. ఆ ఒక్క రూపాయి సంపాదిస్తందుకే గల్లగురిగీకి గాలమేసేటొళ్లం.. ఇంకో రూపాయంటే కష్టమై ఐదు నిమిషాల ముందే సైకిల్‌ని స్టాండ్‌కు చేర్చుతుంటిమి.

స్కూల్ దోస్తాన్

అప్పుడు అన్ని ఊర్లల్ల పదో తరగతి ఉండకపోయేది కదా.? పక్కూరికో.. పట్టణానికో పోవాల్నంటే కచ్చితంగా సైకిల్ ఉండాల్సిందే. అప్పటికప్పుడు సైకిల్ కొనుక్కునే పరిస్థితి ఉండకపోయేది కాబట్టీ.. మేనమామ దగ్గరున్న పాత సైకిలో.. లేక బావకు పెట్టిన సైకిలో తెచ్చుకొని మూడు నాలుగేండ్లు కాలం గడుపుతుంటిమి. సైకిల్ లేనొళ్లు వేరేవాళ్ల సైకిల్ మీద పోతుండె. ఇగ సైకిల్ మీదనే మాపటీలి సీన్మలకు పోవుడు.. ఎండకాలం సెలవులల్ల కుందేళ్ల షికారికి పోవుడు.. ఓహో మామూలుగా ఉంటుండెనా కథ..? సైకిల్‌తో ఇంత స్వీట్ మెమొరీస్ ఉన్నయి కాబట్టీ ఎప్పటికీ మర్చిపోలేం.

Next Story