వైమానిక దళంలో.. వింగ్ కమాండర్‌.!

by Daayi Srishailam |

వైమానిక దళంలో తన కల సాకారం చేసుకుంది సునీతా పహల్

వైమానిక దళంలో.. వింగ్ కమాండర్‌.!
X

దిశ, ఫీచర్స్: పిల్లలు ఏమవ్వాలో నిర్ణయించుకునే అవకాశం వారికే ఇవ్వాలి. బాధ్యతగా ఏదైతే బాగుంటుందో మాత్రం సూచన చేయాలి. పిల్లలు ఇంజినీర్ అవ్వాలి.. అమెరికా వెళ్లాలి అని ఆలోచించే జనాలున్న ఈ రోజుల్లో.. మా పిల్లలు దేశసేవకు వెళ్తే సంతోషించే పేరెంట్స్ కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు అలాంటి సంతోషాన్ని కలిగించడమే కాకుండా.. వైమానిక దళంలో తన కల సాకారం చేసుకుంది హర్యానాకు చెందిన సునీతా పహల్.

కార్గిల్ పోరాట పటిమను చూసి..

హర్యానాలోని చర్ఖీ దాద్రీ జిల్లాలోని దతౌలి గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ పహల్ కూతురే సునీతా పహల్. ఆమె 14 సంవత్సరాల పాటు వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా సేవచేసి.. మహిళగా ఎన్నో అడ్డంకులను ఛేదించింది. సునీత 13 ఏళ్ల వయసున్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. మంచు కమ్మేసిన ప్రాంతాల్లో ప్రాణాలు అడ్డంపెట్టి పోరాడుతున్న సైనికుల దృశ్యాలను టీవీలో చూసి తాను కూడా ఆ పోరాట సైన్యంలో చేరాలని డిసైడైంది. అదే తన లక్ష్యంగా పెట్టుకుంది. దేశం కోసం ప్రాణం ఇచ్చినా తప్పులేదనే భావన తన మనసులో కలిగింది.

ఎలాంటి కోచింగ్ లేకుండా..

సునిత వాళ్ల ఊరిలో తనలాంటి అమ్మాయిలు చాలామంది టీచర్ ఉద్యోగం చేసేవాళ్లు. ఇంకా కొందరు ఇంట్లోనే పనిచేసేవాళ్లు. కానీ సునీత వాళ్లలా ఆ పనులకే పరిమితం కావాలనుకోలేదు. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసింది. మొదటి ప్రయత్నంలోనే రెండూ పాసైంది. ఎలాంటి కోచింగ్, మార్గదర్శనం లేకుండా సాధించాలి.. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ విజయం సాధించింది. సమాజాన్ని ఒప్పించడానికి యుద్ధమే చేయాల్సి వచ్చింది. అమ్మాయిలకు సైన్యమేంటి.. పెళ్లి చేసేయక అని ఎంతోమంది హెచ్చరించారు.

కఠోర సాధనే కదిలించింది..

ఓం ప్రకాశ్ ఆర్థికంగా ఉన్నోడేం కాదు. రెండెకరాల భూమి, ఐదారు పశువులు ఉండేవంతే. అతడు నెలకో రూ.50 సంపాదించేవాడు. తిప్పితిప్పి కొడితే ఇవన్నీ కుటుంబాన్ని పోషించడానికే అరకొరగా సరిపోయేవి. కానీ.. చదువు విలువ తెలిసినోడిగా తన కూతురు కోరుకున్నట్లు సైన్యంలో చేరడానికి ప్రోత్సహించాడు. సమాజం సునీత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. తన శరీరం.. మనసు పరీక్షించాయి. అకాడమీలో చేరినప్పుడు 10 కిలోమీటర్లు పరుగు, గంటలకొద్ది డ్రిల్లింగ్, 42 డిగ్రీల ఎండలో ప్రాక్టీస్ చేస్తే వేళ్ల నుంచి రక్తాలు కారేవి. ఆ కఠోర సాధనే తనను లక్ష్యం దిశగా బలమైన అడుగులేయించింది.

300 మందిలో ఆమె ఒక్కరే..

పరీక్షలన్నీ పాసై అనుకున్నది సాధించింది సునీత. మొదటి పోస్టింగ్ 2008లో నార్త్‌ఈస్ట్‌లోని ఫైటర్ బేస్‌లో. హర్యానా దాటని ఆమె ఒక్కసారిగా ఆపరేషన్లు నిర్వహించడం, ఎయిర్‌మెన్‌లను నడిపించడం, సాంకేతిక పనులు చేయడం మొదలుపెట్టింది. మొదటంతా కొత్తగా ఉండేది. కానీ త్వరగా నేర్చుకుంది. కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, టెక్నికల్ స్కిల్స్‌లో రాటుదేలిపోయింది. 300 మంది బ్యాచ్‌లో ఆమె ఒక్కరే అమ్మాయి. వైమానిక దళంలో పురుషులు, మహిళలు ఒకే బాధ్యతలు నిర్వహిస్తారు. అక్కడ ప్రత్యేక మినహాయింపులేం ఉండవు కాబట్టీ పోటీతత్వం.. నేర్చుకోవాలనే తపన రెట్టింపు ఉండేది.

ఎంఎన్‌సీలో ఐటీ హెడ్‌గా..

తన స్టామినా, పనిపట్ల అంకితభావం ఆమెకు ఫైటర్ స్క్వాడ్రన్ ఆపరేషన్ చేసే అవకాశం కల్పించాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ ఇండక్షన్‌లో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కమెండేషన్ పొందింది. 2021లో సునీతాకు వింగ్ కమాండర్‌గా పదోన్నతి లభించింది. తన ఆలోచనలన్నింటినీ దేశ రక్షణకు పెట్టుబడిగా పెట్టి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. 14 సంవత్సరాల సేవ తర్వాత సునీతా స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకుంది. ప్రస్తుతం బెంగళూరులో మల్టీనేషనల్ కార్పొరేషన్‌లో అడ్మినిస్ట్రేషన్, ఐటీ హెడ్‌గా పనిచేస్తుంది. సైన్యంలో నేర్చుకున్న క్రమశిక్షణ, లీడర్‌షిప్ క్వాలిటీస్ కొనసాగిస్తూ ధైర్యంగా ముందుకెళ్తోంది.

Next Story