సమ్మర్ హాలిడేస్ అంటే.. అమ్మమ్మ ఇల్లే.. అదో స్వర్గం..

by Sujitha Rachapalli |

మా అమ్మమ్మ గారి ఊరు స్వర్గంలా అనిపించేది.. బావమరుదులతో ఈతలు, మామ తెచ్చే పండ్లు.. అత్తమ్మ చేసే బజ్జీలు.. అమ్మమ్మ చేసే వంటకాలు.. కడుపు నిండా తిని.. అందరం కలిసి సీరియళ్లు, సినిమాలు చూస్తూ..

సమ్మర్ హాలిడేస్ అంటే.. అమ్మమ్మ ఇల్లే.. అదో స్వర్గం..
X

దిశ, ఫీచర్స్ : స్కూళ్లకు ఎండాకాలం సెలవులు వచ్చేశాయి. ఆ సెలవులేమోగానీ ఫోన్లకే అతుక్కుంటారు పిల్లలు. ఎంత చెప్పినా వినరు. అసలు మా జమానాలో ఇవేవీ లేవు. సెలవులు వచ్చిన మరుసటి రోజే మేం మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లే వాళ్లం. ఆట, అల్లరి, ఆనందం మాత్రమే మాకు తెలిసిన ఎండాకాలం సెలవుల మజా.

బామ్మర్దులతో అల్లరి..

ఎండాకాలం సెలవులు అంటే నాకు ఇప్పటికీ మొదట గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ల ఊరు. ఎందుకో ఏమోగానీ సెలవులు అంటే అమ్మమ్మ ఊరే.. అసలు స్వర్గంలా అనిపించేది. అక్కడికి వెళ్తే బావమరుదలతో కలిసి రోజంతా అల్లరి చేసేవాళ్లం. చెట్ల నీడలో దాగుడుమూతలు, సాయంత్రానికి బావి దగ్గర ఈతలు. ఇలా రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియక పోయేది. నీళ్లలో దిగితే సమయం ఆగిపోయినట్టుండేది. ఒకవైపు మా మామయ్య *ఇక చాలు పదండ్రా’ అని ఎంత మొత్తుకున్నా వినకుండా ‘ఐదు నిమిషాలు మామయ్యా.. ఐదే నిమిషాలు’ అంటూ ఎంతకూ బయటికి రాకపోయేది.

మామ వచ్చే వరకు..

సాయంత్రం అయ్యే సరికి మాత్రం బయటికి వెళ్లిన మామయ్య ఏం తీసుకొస్తాడో అని ఒక్కటే ఎదురుచూసేది. అప్పుడు ఈ కుర్ కురేలు, చట్ పట్‌లు వంటి అడ్డమైన తిండి ఉండకపోయేది. యాపిల్స్, అరటిపండ్లు ప్రతిరోజూ తెచ్చేవాడు. అత్తమ్మ ఆ లోపు వడియాలు, బజ్జీల్లాంటివి చేసిచ్చేది. మా మామ కూతురు నాకంటే వయసులో పెద్ద. ఆమె మంచి షర్బత్ చేసిచ్చేది. వీటన్నింటితో ఎంజాయ్ చేస్తూ ఈటీవీలో సీరియళ్లు, సినిమాలు అందరం కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తుండేవాళ్లం. ఇంటి దగ్గర ఉండబుద్ధి కాకపోతే తాతతో కలిసి బావి వైపు వెళ్లేవాళ్లం. అల్ల నేరేడు పండ్లు తినేవాళ్లం.

జాతర్లో జేబు నింపి..

అమ్మమ్మ నూకలతో వండిన అన్నం.. చింత చిగురు వంకాయ కూర.. నాటుకోడి కూర.. పచ్చి పులుసు చేసి మా కడుపు నింపేది. అందుకే అమ్మమ్మలు వర్ధిల్లాలి. మా బావమరుదులను పొట్టు పొట్టు తిట్టి మమ్మల్ని మాత్రం నాయినా అని పిలిచేది. అందరం కలిసి భోజనాన్ని పండుగలా ఆస్వాదించేవాళ్లం. బయట ఆడుతూ అలసిపోయి వచ్చాక ఆ వంటలు తింటే వచ్చే తృప్తి వర్ణించడానికి కూడా సాధ్యం కానట్టు ఉండేది. ప్రతీ సంవత్సరం మే నెలలో మా అమ్మమ్మ వాళ్ల ఊరిలో జాతర సాగేది. అటూ ఇటూ చూసి ఎవరూ చూడకముందే చిన్న చిన్న వస్తువులు జేబులో వేసుకున్న చిలిపితనం ఎలా మర్చిపోతాం.

ఐస్‌క్రీమ్ అంకుల్ వస్తే..

ఇక ప్రతీరోజూ చెక్క బ్యాట్.. జాతర్లో కొట్టేసిన రబ్బర్ బాల్‌తో క్రికెట్లో మునిగిపోయేవాళ్లం. ఉదయం సూర్యుడు తలపైకి రాకముందే మైదానంలోకి దిగిపోయి మధ్యాహ్నం ఎండ మండినా ఇంటికి చేరకపోయేది. అమ్మమ్మ కలిసినోళ్లందరితో కబురు పంపేది. లాస్ట్ ఓవర్.. లాస్ట్ మ్యాచ్ అంటూ ఏదో సాకు చెప్పి అసలు ఇంటి దారే మర్చిపోయేవాళ్లం. అమ్మమ్మనేమో పిలుస్తూనే ఉండేది. చెమటలు కారినా.. ఎండకు కాళ్లు మండినా ఆటలోనే మునిగిపోయేవాళ్లం. ఐస్ క్రీమ్ అంకుల్ ఊరీలిస్తూ వచ్చేవాడు. ఇక ఆకలి కూడా గుర్తుండేది కాదు.

ఆ అటాచ్మెంట్ పోవద్దని..

సెలవులు అయిపోతున్నాయి అనిపిస్తే మస్త్ బాధనిపించేది. అందర్నీ మిస్ అవుతానేమో అనిపించేది. ముఖ్యంగా బావమరదులను.. వాళ్లతో చేసినంత ఎంజాయ్ ఇంకెవరితోనూ చేయలేదు. ఆ అటాచ్మెంట్ పోవద్దని నేను మా మామయ్య చిన్న కూతుర్నే పెళ్లి చేసుకున్నా. నిజంగా ఆ రోజులు ఎంత సాదాసీదాగా ఉన్నా.. అందులోని ఆనందం మాత్రం అమూల్యం. ఫోన్లు లేవు ఏంలేవు. సెలవుల్లో స్వేచ్ఛ.. ఆటలు.. నవ్వులు అంతే బస్. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఒక్కోసారి మనసులోకి వస్తే ఎంత బిజీగా ఉన్నా కాసేపు ఆగిపోతాం. ఆ మధురానుభూతి ఇప్పటికీ మనసులో అలాగే మెదులుతూ ఉంటుంది.

- మల్లెల శ్రీనివాస్

Next Story