రిక్షా బుల్లోడు.. నెలకు లక్ష సంపాదన.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:36:19  IST  )

గంటల్లో వేల రూపాయలు సంపాదిస్తున్నాడు

రిక్షా బుల్లోడు.. నెలకు లక్ష సంపాదన.!
X

దిశ, ఫీచర్స్: యువత ఏం కోరుకుంటోంది. ఎంటైర్‌టైన్‌మెంట్ అంతే కదా.? ఆ ఎంటైర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌నే సంపాదన మార్గంగా మార్చుకునే వాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లలో ముజఫర్ నగర్ కుర్రాడు సుమిత్ ప్రజాపతి. అతడి వయసు 22 సంవత్సరాలు. కానీ.. ఇవాళ గంటల్లో వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అదికూడా సోషల్ మీడియా వేదికగా.

కంటెంట్ క్రియేషన్..

సుమిత్ ప్రజాపతి చిన్నప్పటి నుంచే కుటుంబ అవసరాల కోసం చిన్నప్పటి నుంచే పొలాల్లో పని చేసేవాడు. కార్లు కడగడం, కూరగాయలు అమ్మడం, బట్టల షాపుల్లో పనిచేయడం వంటివెన్నో పనులు చేశాడు. ఏడో తరగతి వరకు పేరెంట్సే చదివించినా ఆ తర్వాత అదో ఇదో పనిచేస బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాడు. ఆ తర్వాత తనకెందుకో సోషల్ మీడియా పట్ల ఆసక్తి పెరిగింది. రకరకాల ప్రయోగాలు చేసేవాడు. సొంతంగా కంటెంట్ క్రియేషన్ నేర్చుకున్నాడు. ఒకరిద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు మేనేజర్‌గా పని చేశాడు. కానీ గిట్టుబాటు కాక తనకంటూ ఏదైనా సొంత పని ఉంటే బాగుండని ఆలోచించాడు.

అనుకోని సంఘటన..

సుమిత్ జీవితంలో అదొక ఊహించని సంఘటన. వాళ్ల నాన్న జనరేటర్ సర్వీస్ ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు రాత్రి భోజనం చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించబోయినప్పుడు పైపు పగిలి మంటలు చెలరేగాయి. వాళ్ల నాన్నకు ఛాతీ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబం మొత్తం మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురైంది. ఇంటి లోన్, రిక్షా లోన్ ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో సుమిత్ తన తండ్రి ఈ-రిక్షాను నడపడం ప్రారంభించాడు. రిక్షా నడపాలి అనేది తన కెరీర్ ప్లాన్లో భాగం కానప్పటికీ అదొక కుటుంబ అవసరంగా బతుకు జట్కా బండిని లాగినట్లు తప్పనిసరి అయింది.

రిక్షా కంటెంట్..

రిక్షా నడపడం ప్రారంభించిన తర్వాత సుమిత్ తన సోషల్ మీడియా నైపుణ్యాన్ని ఉపయోగించాడు. కార్లు, బైక్‌ల చుట్టూ కంటెంట్ సృష్టించేవారు చాలామంది ఉన్నారు కానీ రిక్షా గురించి ఎవరూ వీడియోలు చేయడం లేదని గమనించాడు. మొదటి వీడియోలో కుటుంబంతో పెళ్లికి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ చేశాడు. రెండు రోజుల్లోనే అది మిలియన్ వ్యూస్ దాటింది. మొదట్లో ఇరుగుపొరుగు వాళ్లు ఎగతాళి చేశారు. తండ్రి కూడా 'ఇదేం పనిరా' అని హెచ్చరించారు. కానీ సుమిత్ దాన్ని సవాలుగా తీసుకుని రిక్షాను స్టేజ్‌గా మార్చి మోటివేషనల్ వీడియోలు క్రియేట్ చేశాడు. "ఏ పని చిన్నది కాదు" అనే ప్రచారం చేశాడు.

నటుడవ్వాలనీ..

సుమిత్ వారానికి రెండు రోజులు మాత్రమే రిక్షా నడిపి గంటల్లో రూ.25,000 సంపాదిస్తున్నాడు. రోజుకు నాలుగైదు బ్రాండ్ ప్రమోషన్లు వస్తున్నాయి. గత నెలలో రూ.1.5 లక్షలు సంపాదించాడు. ఈ డబ్బుతో కుటుంబ అప్పులు కొంత తీర్చాడు. కంటెంట్ క్రియేషన్‌కు మంచి ఫోన్ కొన్నాడు. చెల్లికి పాకెట్ మనీ ఇచ్చాడు. తల్లిని మొదటిసారి రెస్టారెంట్‌కు తీసుకెళ్లినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతకు ముందు అమ్మిన ఇంటిని తిరిగి కొనాలనేది అతని లక్ష్యం. భవిష్యత్తులో రిక్షా డ్రైవింగ్‌ను కొనసాగిస్తూనే సోషల్ మీడియా ద్వారా నటుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని కలలు కంటున్నాడు.

Next Story