Crime News :ఉమెన్ సూసైడ్ బాధితుల్లో 50% పైగా హౌస్‌వైఫ్స్..

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-26 05:50:01  IST  )

సమకాలీన సమాజంలో గృహిణుల జీవన స్థితి అనేక బాధ్యతలతో కూడుకున్నది. ఇంటి, వంట పని సహా వృత్తిపర బాధ్యతలతో తీరికలేకుండా గడిపే చాలామంది మహిళలు తమ మానసిక ఆరోగ్యంపై ఆయా పనుల ప్రభావాన్ని గుర్తించకుండా అదే వర్క్‌ఫ్లో కొనసాగిస్తున్నారు..Latest Telugu News

Crime News :ఉమెన్ సూసైడ్ బాధితుల్లో 50% పైగా హౌస్‌వైఫ్స్..
X

దిశ, ఫీచర్స్ : సమకాలీన సమాజంలో గృహిణుల జీవన స్థితి అనేక బాధ్యతలతో కూడుకున్నది. ఇంటి, వంట పని సహా వృత్తిపర బాధ్యతలతో తీరికలేకుండా గడిపే చాలామంది మహిళలు తమ మానసిక ఆరోగ్యంపై ఆయా పనుల ప్రభావాన్ని గుర్తించకుండా అదే వర్క్‌ఫ్లో కొనసాగిస్తున్నారు. అయితే కాలక్రమేణా పని భారం వారికి ప్రతికూలంగా తయారవుతోంది. ఇంకా చెప్పాలంటే మెజారిటీ మహిళలు కుటుంబ అవసరాల కోసం తమ ఆసక్తులను త్యాగం చేస్తుంటారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం మొత్తం మహిళా ఆత్మహత్య బాధితుల్లో 50 శాతానికి పైగా గృహిణులే ఉన్నారు. మహిళల మానసిక ఆరోగ్య స్థితిని తెలియస్తున్న ఈ డేటా సమాజానికి హెచ్చరిక జారీ చేస్తోంది.

ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల్లో 50 శాతానికి పైగా(45,026 మందిలో 23,179 మంది) గృహిణులు ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) వెల్లడించింది. అంతేకాదు మొత్తం భారతీయుల ఆత్మహత్యల్లో 14.1 శాతం గృహిణులే(1,64,033 మందిలో 23,179 మంది). ఈ గణాంకాలు మహిళల మానసిక స్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి. వారు ఎక్కువ సమయం భర్త, అత్తమామలు, తోబుట్టువులు, పిల్లల ఆలనాపాలనలో నిమగ్నమవుతూ తమ కోసం అరుదుగా టైమ్ కేటాయించుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

నిపుణులు ఏం చెప్తున్నారు?

కనిపించని అంచనాల భారాన్ని మోస్తున్న గృహిణులకు ప్రపంచం ఇప్పటికే 'సూపర్ ఉమెన్' బిరుదును ఇచ్చింది. అయితే ఇలా పిలవడం తరచుగా వారు పనిని ఎలా చేస్తారో ప్రచారం చేస్తుందని, వాటిని చేస్తూనే ఉండేలా ప్రేరేపిస్తుందని చాలా మంది వాదిస్తున్నారు. 'మహిళలు.. సామాజిక ఒత్తిళ్లు, సమస్యలు, పిల్లలు, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. రోజువారీ పని, బాధ్యతల భారాన్ని తరచూ ఎదుర్కొంటారు. ఇది వారి మెంటల్ హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మహిళలు ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాలి. ఇందుకు కుటుంబ సభ్యుల మద్దతు అవసరం' అని క్లినికల్ సైకాలజిస్ట్, డాక్టర్ ప్రాచీ వర్మ తెలిపారు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు

గృహిణుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న అనేక అంశాల్లో లింగ ఆధారిత హింస ఒకటి. ఇటువంటి హింస మహిళల్లో డిప్రెషన్, ఆందోళన, భయం సహా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను అభివృద్ధి చేస్తుంది. ఒంటరిగా ఈ సమస్యలను అధిగమించడం వారికి కఠినంగా మారుతుంది. చాలా సందర్భాల్లో గృహిణులు.. హింస, సామాజిక ఒత్తిడి, మోయలేని బాధ్యతలను ఎదుర్కోవడంలో విఫలమైన తర్వాత ఆత్మహత్య ప్రవర్తనలు పుట్టుకొస్తాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. 10,000 మంది మహిళలపై నిర్వహించిన పరిశోధనలో 26 శాతం మంది తమ జీవితకాలమంతా లైఫ్ పార్ట్‌నర్ నుంచి శారీరక హింసను అనుభవించినట్లు నివేదించారు. చాలా వరకు కేసులు నమోదు కానందున వాస్తవ డేటా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మహిళలు తమ నొప్పిని నిశ్శబ్దంగా భరించకుండా బహిర్గతపరచాలని ఇటీవలి సంవత్సరాల్లో నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ మానసిక ఆరోగ్య రుగ్మతల అనుభవాలను పంచుకునేటప్పుడు అపరాధం, అవమానం, అసౌకర్యం, సంకోచాన్ని అనుభవిస్తు్న్నారు. కాబట్టి ఈ సమాజం తమను జడ్జ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్‌గా మాట్లాడాల్సిన సమయం ఇదేనని వారికి భరోసాన్నిచ్చే ప్రయత్నం చేయాలి. 'మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఈ విషయంలో కుటుంబం నుంచి మద్దతు లభించడం' అనేది గృహిణులు తమ మానసిక ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన రెండు ముఖ్యమైన మార్గాలు. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడి సహా ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితుల లక్షణాలతో మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాజం కూడా వారి స్థితిని విమర్శించే బదులు సపోర్ట్ సిస్టమ్‌గా నిలబడాలి.

Next Story