- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాషన్ రన్‌వేపై ఆదివాసీ నేత కళ
ప్రపంచ వేదికపై.. ఆదివాసీ కళలు.. కళకే జీవితాన్ని అంకితం చేసిన రిచా మహేశ్వరి.. ఒడిశా నేత కళల కోసం బోయిటో ప్లాట్‌ఫామ్.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్

దిశ, ఫీచర్స్: ఒడిశా గిరిజనుల ప్రాచీన కళలను ఆధునిక ఫ్యాషన్‌గా మార్చి ప్రపంచ వేదికపై నిలబెడుతోంది రిచా మహేశ్వరి. ఒకవైపు ఆదివాసీ సంప్రదాయాన్ని కాపాడుతూనే మరోవైపు ఆ కళలకు కొత్త గుర్తింపు కోసం కృషి చేస్తోంది.
హృదయాన్ని కదిలించింది..
17 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పని చేసిన రిచా మహేశ్వరి ఒకసారి ఒడిశాను సందర్శించింది. అక్కడే ఏళ్ల తరబడి తమ నైపుణ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ కళాకారులను చూసింది. ఖండువా సిల్క్, కపగంధ, రింగా వంటి అపూర్వమైన నేత కళలున్నాయి. కానీ వాటికి తగిన గుర్తింపు లేదు. ఫాస్ట్ ఫ్యాషన్ యుగంలో ఈ కళాకారులు జీవనాధారం కోసం కష్టపడుతున్నారు. ఆ దృశ్యం రిచా హృదయాన్ని కదిలించింది. ఈ కళను మార్చాల్సిన అవసరం లేదు. దానికి సరైన గుర్తింపు ఇవ్వాలి అని ఆమె నిర్ణయించుకుంది. అందుకోసం తన కార్పొరేట్ జీవితాన్ని వదిలేసి పూర్తి సమయం ఈ కళకే అంకితం చేసింది.
ఆధునిక డిజైన్ దుస్తులుగా..
ఆదివాసీ సాంప్రదాయ కళలను బతికించేందుకు రిచా బోయిటో అనే ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. దీని ద్వారా ఒడిశా గిరిజన నేత కళాకారులు కొత్త జీవితం ప్రారంభించేలా దోహదం చేస్తోంది. నువాపట్నా సుందరమైన ఖండువా సిల్క్.. డోంగ్రియా గోండు గిరిజనుల కపగంధ.. బొండా సముదాయం ధరించే రింగా టెక్స్‌టైల్స్ వంటి సాంప్రదాయ నేత కళలను మార్చకుండానే వాటిని ఆధునిక ఫ్యాషన్‌గా రూపొందించింది రిచా. సహజ రంగులు.. చేనేత.. సంప్రదాయ పద్ధతులను కాపాడుతూ జాకెట్లు.. ట్రెంచ్ కోట్లు.. ఆధునిక డిజైన్ దుస్తులుగా మారుస్తోంది.
లగ్జరీ ఉత్పత్తులుగా..
గిరిజన గ్రామాలకు వెళ్లి కళాకారులతో గడిపేది. వారి పని విధానాలను అర్థం చేసుకునేది. ఇదంతా సులభం కాదు. చాలా కాలం తీసుకుంది. సహనం.. నిరంతర ప్రయత్నాలతో వారితో కలిసి నేర్చుకుంది. ఫలితంగా గోవాలో ఎగ్జిబిషన్లు నిర్వహించింది. ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ప్రదర్శనలిచ్చింది. యూరప్, ఆసియా దేశాల్లో షోకేస్‌లు కండక్ట్ చేసింది. ఒడిశా గిరిజన నేత కళలు ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్ వేదికపైకి మెరుస్తున్నాయి. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని ఈ కళలు ఇప్పుడు డిజైన్.. లగ్జరీ ఉత్పత్తులుగా గుర్తింపు పొందుతున్నాయి.
కళాకారుల ఆత్మగౌరవం..
రిచా కృషి వల్ల గిరిజన కళాకారుల జీవనం మారుతోంది. గతంలో ఆదరణలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఇప్పుడు స్థిరమైన ఆదాయం పొందుతున్నాయి. వారి కళకు కొత్త గౌరవం లభిస్తోంది. రిచా మహేశ్వరి చెప్పేదేంటంటే సాంప్రదాయ కళను కేవలం కాపాడటమొక్కటే చాలదు. దాన్ని ఈ రోజు ప్రపంచం కోరుకునేలా ధరించాలనిపించేలా చేయాలి అనుకుంది. చేసి చూపెట్టింది. అందుకే ఇప్పుడు ఆ ఆదివాసీ కళలు బతికాయి. బోయిటో ద్వారా ఒడిశా ఆదివాసీ కళలు ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్ నెట్టుకొస్తున్నాయి. రిచా కృషితో సంస్కృతి.. కళాకారుల ఆత్మగౌరవం.. వారసత్వం సజీవంగా ఉన్నాయి.






