మొదటిసారి విమానమెక్కిన తండ్రి.. ఇది కదా కొడుకు సక్సెస్

by Sujitha Rachapalli |

దుర్గేశ్ ఓజా సక్సెస్ జర్నీలో తండ్రి.. సూట్ వేసుకుని మరీ ఫ్లైట్ ఎక్కి.. ఆ ప్రయాణ అనుభవాలను ఊరందరితో పంచుకుని.. కుమారుడి విజయం చూసి మురిసిపోయిన నాన్న

మొదటిసారి విమానమెక్కిన తండ్రి.. ఇది కదా కొడుకు సక్సెస్
X

దిశ, ఫీచర్స్ : మనం ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. గాలిమోటార్లో విహరించవచ్చు. మనం అనుభవిస్తున్న ఆ సౌకర్యాల వెనక.. సంతోషాల వెనక అమ్మానాన్న కష్టం.. త్యాగం దాగివుంటాయి. అందుకే కనీసం ఒక్కరోజైనా మన పేరెంట్స్‌ని మన ఆఫీస్‌‌కు తీసుకెళ్లాలనో.. విమానంలో తిప్పాలనో అనుకుంటాం. అలాంటి మెమొరీయే ఇది.

కొత్త ప్రపంచంలోకి..

ఇండోర్‌కు చెందిన హైబ్రిడ్ ఇంటర్నెట్ కంపెనీ వ్యవస్థాపకుడైన దుర్గేశ్ విజయంలో తండ్రి పాత్ర ఎంతో ఉంది. కానీ అతనెప్పుడూ విమానం ఎక్కలేదు. దీంతో నాన్నను విమానమెక్కించాలనుకున్నాడు దుర్గేశ్. ఆ ప్రయాణం చిరస్మరణీయంగా ఉండాలని ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు. నాన్న కోసం విండో సీట్ బుక్ చేశాడు. మంచి భోజనం ఎంచుకున్నాడు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన తండ్రిని చూసి దుర్గేశ్ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. 2023లో తన వివాహంలో ధరించిన క్రిస్ప్ సూట్‌ను పర్ఫెక్ట్‌గా వేసుకొని వచ్చాడు. జీవితంలో ఎప్పుడూ సూట్ వేయని తండ్రి ఆ రోజు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు కనిపించాడు.

కళ్లు తడిసిపోయాయి..

దుర్గేశ్ వాళ్ల నాన్న ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడపలేదు. సాధారణ దుస్తులు, సాధారణ ఆహారం తీసుకునేవాడు. కుటుంబం కోసం కష్టపడి పనిచేశాడు. ఏవైనా పెళ్లళ్లు, పేరంటాలు, ముఖ్యమైన పండగలు ఉంటే మాత్రమే ప్యాంటు షర్టు వేసుకునేవాడు. అంతే.. సూట్ అయితే మాటలకు అందని విషయమే అని చెప్పొచ్చు. అయితే కొడుకు విజయం చూసి ఆయన మనసు నిండిపోయింది. కొడుకు తీసుకెళ్తున్న మొదటి ఫ్లయిట్‌కు సూటయ్యేలా సిద్ధమవ్వాలని ఆ సూట్ ఎంచుకున్నాడు. ఆ సూట్ ధరించి వచ్చిన తండ్రిని చూసి దుర్గేశ్ కళ్లు తడిసిపోయాయి.

జీవితపు పరమార్థం..

విమానం టేకాఫ్ అయినప్పుడు.. తండ్రి విండో దగ్గర కూర్చొని ఆకాశం, మేఘాలు, భూ ప్రపంచం చూసి ఆనందించాడు. విమానంలో వడ్డించిన భోజనం, ప్రయాణ అనుభవం.. అన్నీ గ్రామంలోని బంధువులు, స్నేహితులకు చెప్పి మురిసిపోయాడు. ఈ చిన్న ప్రయాణం నాన్నగా తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడిన తండ్రి ఇప్పుడు కొడుకు చేతుల మీదుగా కొత్త అనుభవం పొందాడు. దుర్గేశ్ ఒక ఫోటోలో తండ్రి టార్మాక్‌పై నిలబడి ఉన్న దృశ్యం పంచుకుంటూ ‘ఈ ఫోటో చూసినప్పుడల్లా జీవితపు పరమార్థం ఇదే కదా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

ప్రేమకు సంకేతం..

ఈ రోజుల్లో వ్యక్తిగత విజయాలు, కెరీర్, డబ్బు గురించి ఎక్కువ మాట్లాడతాం. కానీ దుర్గేశ్ ఓజా మనకు నిజమైన సంతోషం, జీవితం పరమార్థాన్ని గుర్తుచేశాడు. మన పేరెంట్స్‌కి ఏదైనా ఇవ్వడంలోనే జీవితం ఉందని తెలిసేలా చేశాడు. తండ్రి సూట్ వేసుకొని వచ్చిన ఆ క్షణం కేవలం దుస్తులు కాదు.. ప్రేమ, గర్వం, కృతజ్ఞతకు సంకేతంగా దానిని చూశాడు. మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వారికి ఒక చిన్న సంతోషం కలిగించడం జీవితంలో అతి పెద్ద విజయం.

Next Story