యూరప్‌లో భారతీయ రుచులతో అదరగొడుతున్న ఇండియన్.. ఇదే సక్సెస్ సీక్రెట్

by Sujitha Rachapalli |

భారతీయం.. బహు రుచికరం.. ఆమ్‌స్టర్ డామ్‌లో అదరగొడుతున్న ఇండియన్.. భారతీయ వంటలతో దేవిందర్ ఒబెరాయ్ సక్సెస్..సీజన్‌ను బట్టి మెనూ చేంజ్

యూరప్‌లో భారతీయ రుచులతో అదరగొడుతున్న ఇండియన్.. ఇదే సక్సెస్ సీక్రెట్
X

దిశ, ఫీచర్స్ : భారతీయ సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మన రుచులకు ప్రపంచమే ఫిదా అవుతుంది. అలాంటి సాంప్రదాయ భారతీయ వంటకాలతో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఆహా అనిపిస్తోంది దేవిందర్ ఒబెరాయ్.

హోం ఫుడ్ అనుభూతి

ఇంజనీరింగ్ చేసి కార్పొరేట్ ఉద్యోగం చేసేందుకు నెదర్లాండ్స్‌కు వెళ్లింది దేవిందర్ ఒబెరాయ్. దాదాపు ఇరవై సంవత్సరాలు యూరప్‌లో గడిపింది. ఉద్యోగం.. చదువు.. మంచి జీతం.. మంచి పొజిషన్ వంటివన్నీ వదిలేసి ‘ఆమ్‌స్టర్‌డామ్ సిటీ ఫామ్ టేస్టింగ్ రూమ్’ అనే చిన్నపాటి రెస్టారెంట్‌ను ప్రారంభించింది. తన బాల్యంలో చవిచూసిన రుచులను యూరోపియన్ శైలికి జోడిస్తూ ‘హోం ఫుడ్’ అనుభూతినిస్తోంది. చిన్నప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మ పక్కన కూర్చుని వంటలు ఎలా తయారవుతాయో చూస్తూ.. రుచి చెక్ చేస్తూ పెరిగింది. ఫుడ్ అనేది కేవలం తినడానికి మాత్రమే కాదు.. అది ప్రేమ, ఆప్యాయత, సాంప్రదాయం వంటివన్నీ కలగలిసేదిగా ఆమె చెప్తోంది.

భారతీయ బ్రాండింగ్..

చిన్నప్పుడు దేవిందర్ ఇంటి తోటలో పండిన కూరగాయలు, బొగ్గుల మంట మీద చేసిన వంటలు వంటి సహజ వంట పద్ధతులను చూసేది. అవే తనలో లోతుగా పాతుకుపోయాయి. కానీ వాటిలో ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడా ఆ శిక్షణిచ్చేవాళ్లు కాదు. కేవలం వాటిని చూసి మాత్రమే వంంట నేర్చుకుంది. యూరప్‌లో ఆమెది కంప్లీట్ కార్పొరేట్ జీవితం. కానీ అక్కడి జీవనశైలి, ఆహార సంస్కృతి ఆమెను చాలా ప్రభావితం చేశాయి. మన దగ్గర విందు అంటే దావత్. ఒక మర్యాద. కానీ అక్కడ విందు అంటే ప్రదర్శన.. మనం ఏం పెట్టామని కాకుండా ఎలా పెట్టావని మాత్రమే చూస్తుంటారు. అయినప్పటికీ వారాంతాల్లో, సెలవుల్లో తన సొంత శైలిలో ప్రయోగాలు చేస్తూ భారతీయ వంటకాలకు బ్రాండింగ్ తీసుకొచ్చింది దేవి.

ఏ సీజన్‌లో.. ఎందుకు..

మొదట్లో వాళ్లమ్మమ్మ ఊరి సంప్రదాయమైన ఆల్కహాల్ లేని జింజర్ బీర్ తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత టేస్టింగ్ రూమ్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే ఆమ్‌స్టర్‌డామ్ సిటీ ఫామ్ టేస్టింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కస్టమర్లను కూడా చాలా పరిమితంగా అనుమతిస్తారు. ఒకసారి 16 నుంచి 20 మందికి మాత్రమే ఆతిథ్యమిస్తారు. స్థానిక మార్కెట్ నుంచి వచ్చే కూరగాయలు, ఫ్రూట్స్ ఆధారంగా మెనూ మారుతుంటుంది. అది కూడా ప్యూర్ వెజ్ మెనూ. ఇక్కడ ప్రతి డిష్‌కి ఒక చిన్న కథ ఉంటుంది. ఆ డిష్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఏ సీజన్‌లో.. అది కూడా ఎందుకు ఎంపిక చేశారు.. దాని చుట్టూ ఉన్న జ్ఞాపకాలేంటివన్నీ తెలుసుకొని భారతీయ రుచులు బహు రుచికరం అని చాటి చెప్తోంది.

Next Story