అక్షరాలు నేర్పిన మనవడు.. 87 ఏళ్ల వయసులో పరీక్ష రాసిన ముసలవ్వ

by Sujitha Rachapalli |

86 ఏళ్లలో అక్షరాలు దిద్దిన నానమ్మ .. మనవడు నేర్పించిన అక్షరాలతో లిటరసీ టెస్ట్.. ప్రతీ ఒక్కరికి ఆదర్శం ఈ ముసలవ్వ కథ

అక్షరాలు నేర్పిన మనవడు.. 87 ఏళ్ల వయసులో పరీక్ష రాసిన ముసలవ్వ
X

దిశ, ఫీచర్స్ : చదువుకు వయసుతో సంబంధం లేదు. చదువొస్తే అదెప్పుడైనా మన జీవితాన్ని మార్చగలదు. అలాంటి ఒక 86 ఏళ్ల నాన్నమ్మ కథ ఇది. తన పేరు అనుసూయ బాయ్ వాడేకర్. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని మార్సవల్లి గ్రామం తనది.

నేర్చుకోవాలనే తపన..

ఒక చిన్న గదిలో కట్టె బెంచీపై కూర్చొని చేతిలో పెన్సిల్ పట్టుకొని పరీక్ష రాస్తున్న ఈ బామ్మ ఎవరి మనసునైనా కదిలిస్తుంది. యుల్లాస్ నవ భారత సాక్షరత కార్యక్రమం కింద ఆమె లిటరసీ టెస్ట్ రాసింది. ఇది సాధారణ పరీక్ష కాదు. దాదాపు ఒక శతాబ్దం క్రితం మొదలైన ఒక అసంపూర్తి కలకు చివరి అధ్యాయం. గ్రామస్తులు ఆమెను చూసి ‘ఈ వయసులో కూడా చదువుతోందా’ అని ఆశ్చర్యపోతుంటారు. వయసు ఎంతైనా.. నేర్చుకోవాలనే తపన ముందు ఏమీ అడ్డు రాదని అనసూయమ్మ కథ చెప్తోంది.

పుస్తకాలకు దూరంగా..

అనుసూయ బాయ్ చిన్నతనంలో అమ్మాయిలకు చదువు అవసరం లేదని భావించేవారు. దీంతో పాఠశాలలు, పుస్తకాలకు దూరంగా తన బాల్యం గడిచింది. చిన్నతనం నుంచే ఇంటి పనులు, కూలి పనులు చేసేది. ఒకరకంగా అవన్నీ తన జీవితాన్ని ఆక్రమించాయి. ఎప్పుడైనా సంతకం పెట్టాల్సి వచ్చినా, బోర్డు చదవాల్సి వచ్చినా ఇతరుల సహాయం కోరేది. అలా ఏళ్లు గడిచాయి. ప్రపంచం అక్షరాలతో నిండిపోయింది. కానీ అనుసూయ జీవితం మాత్రం జ్ఞాపకాలు, అలవాట్లు, ఇతరుల సహాయంపైనే సాగింది. చదువు అనేది ఆమెకు ఎప్పుడూ దక్కని కలగానే మిగిలిపోయింది.

నాన్నమ్మకు ప్రేమతో..

ఒకరోజు తన మనవడు తన ఆసక్తిని గమనించి అక్షరాలు నేర్పడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క అక్షరం చెప్పి వాటి ఆకారం గీయడం.. శబ్దాలు పునరావృత్తి చేయడం.. ఇలా చిన్న చిన్న సెషన్లు అనసూయ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఏ స్కూల్ లేదా క్లాస్ రూమ్‌తో సంబంధం లేకుండా.. కేవలం మనవడి ప్రేమతో ఒక మంచి ప్రయత్నం మొదలైంది. క్రమంగా గ్రామంలోని స్వచ్ఛంద సేవకులు ఆమె ఆసక్తిని గమనించారు. అక్షరాలు గుర్తుపట్టడం నుంచి సరళమైన పదాలు, వాక్యాలు రాయడం వరకు ఆమె ప్రయాణం సాగింది.

స్మార్ట్‌ జమానాలో..

అనుసూయ యుల్లాస్ లిటరసీ టెస్ట్ రాయడానికి సిద్ధమైంది. కాగితం మీద అది సాధారణ పరీక్షగా కనిపించినా గ్రామస్తులకు అది అసాధారణమైన ఘట్టం. 86 ఏళ్ల వయసులో ఎవరైనా ఇంకా పరీక్ష రాయడం చూడడం అరుదు కదా. వయసు ఎన్ని ఏళ్లయినా నేర్చుకోవచ్చని.. ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చని నిరూపిస్తోంది. ఆమె చేతిలోని పెన్సిల్ కేవలం ఒక పరీక్షకు మాత్రమే కాదు... అదొక ఆశ, ఉత్సాహం, ఎన్నేళ్లయినా కలలు నెరవేర్చుకోవచ్చనే సందేశమిస్తోంది. ఈ రోజు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు.. ఇంటర్నెట్‌ ప్రపంచంలో మునిగినప్పటికీ అనుసూయ మాత్రం ఇంకా అక్షరాల కోసం కష్టపడుతోంది.

Next Story