మీ చిన్నారులు స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్నారా? ఈ రిస్క్ పొంచి ఉన్నట్టే!

by Javid Pasha |

పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల డిప్రెషన్, ఒబేసిటీ, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు

మీ చిన్నారులు స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్నారా? ఈ రిస్క్ పొంచి ఉన్నట్టే!
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుతం జీవితంలో ఒక భాగమైపోయింది. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం వాడితే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే అతిగా వాడటం మాత్రం పలు అనర్థాలకు దారితీస్తుందని మానసి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని, 13 ఏండ్లలోపు పిల్లలు స్మార్ట్ ఫోన్ తురచుగా వాడటం లేదా చూడటం ప్రమాదకరమని జర్నల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ కెపాబిలిటీస్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యయనంలో భాగంగా నిపుణులు 163 దేశాల నుంచి, 18 నుంచి 24 ఏండ్ల వయసు గల మొత్తం ఒక లక్షకంటే ఎక్కువ మందిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు 13 సంవత్సరాలలోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడటంవల్ల మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 12 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సుగల పిల్లలు స్మార్ట్‌ఫోన్ తరచుగా వాడటంవల్ల ఆత్మహత్యా ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, వాస్తవికత నుంచి వేరుపడటం, భావోద్వేగ నియంత్రణలో లోపం(Emotional dysregulation), తక్కువ స్వీయ- నిర్ధారణ (Self-evaluation) వంటి సమస్యలు ఎదుర్కొన్నట్టు తేలింది. ఇక బాలురకంటే కూడా బాలికలు ఈ విషయంలో మరింత ఎక్కువగా సమస్యను ఎదుర్కొన్నారని, 5-6 సంవత్సరాల వయస్సులో స్మార్ట్‌ఫోన్ చూస్తున్న బాలికలలో 48% మంది తమకు ఒక్కసారైనా సూసైడ్ థాట్స్ వచ్చిందని వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొన్నది.

మరొక అధ్యయనం ప్రకారం కూడా.. దాదాపు ఇదే వెల్లడించింది. 12 సంవత్సరాల వయస్సుగల పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల డిప్రెషన్, ఒబేసిటీ, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. దీంతోపాటు పిల్లల్లో సైబర్‌ బెదిరింపులు(Cyberbullying), నిద్రా భంగం, కుటుంబ సంబంధాలలో లోపాలు వంటివి స్మార్ట్‌ఫోన్ అధిక వాడకం వల్ల కలుగుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు అనేక రకాల సోషల్ మీడియా యాక్సెస్‌కు దారి తీయడం కూడా ఇందుకు కారణం అవుతున్నది. ఈ పరిస్థితి 18 ఏండ్లు దాటిన మానసిక పరిపక్వత ఉన్న యువతపై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు కానీ.. 13 ఏండ్లలోపు వారిలో మాత్రం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ యాక్సెస్‌ను నియంత్రించాలని, డిజిటల్ లిటరసీని ప్రోత్సహించాలని, గాడ్జెట్స్ వాడకంలో పరిమితులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story