మగతోడు వద్దు.. ఒంటరితనమే ముద్దు..! పెళ్లి, సంప్రదాయంపట్ల మహిళల్లో మారుతున్న ధోరణి..

by Javid Pasha |   (  Updated:2025-10-06 09:00:18  IST  )

2030 నాటికి 25 నుంచి 45 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో 45% మంది మహిళలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండే అవకాశముందని మోరాన్ స్టాన్లీ అధ్యయనం పేర్కొన్నది.

మగతోడు వద్దు.. ఒంటరితనమే ముద్దు..! పెళ్లి, సంప్రదాయంపట్ల మహిళల్లో మారుతున్న ధోరణి..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడైతే పద్దెనిమిదేండ్లు పైబడితే చాలు ఆడ పిల్లలకు పెళ్లి చేసేద్దామని పేరెంట్స్ ఆలోచించేవారు. అమ్మాయిలు కూడా ఒక విధంగా పెళ్లంటే ముచ్చటపడేవారు. కొందరైతే చదువుకంటే కూడా పెళ్లికే ప్రయారిటీ ఇచ్చేవారు. మరికొందరు పెళ్లి చేసుకొని కూడా భర్త సహకారంతోనో, తల్లిదండ్రుల సహకారంతోనో చదువు కొనసాగించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆధునిక అమ్మాయిల్లో పెళ్లిపట్ల ఉండే ఆలోచనలు, సంప్రదాయ ధోరణులు, భావాలు మారుతున్నాయి. వాటికంటే కూడా కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్యమే ముఖ్యమని ఆధునిక మహిళలు భావిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం పేర్కొన్నది. ఇక పెళ్లి, మగతోడు వంటివి రెండవ ప్రాధాన్యత అంశాలుగా మహిళలు భావిస్తుండగా, అవి లేకపోయినా ఒంటరిగా ఉండగలుగుతామని చెబుతున్నారు.

ఆధునిక మహిళల్లో అనేకమందికి.. పెళ్లి ఇప్పుడంత ముఖ్యమైన విషయమో, తప్పనిసరి అవసరమో అనుకోవడం లేదు అంటోంది అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ అయిన మోరాన్ స్టాన్లీ అధ్యయనం. పైగా 2030 నాటికి 25 నుంచి 45 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో 45% మంది పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండే అవకాశముందని కూడా పేర్కొన్నది. ఎందుకలా? వరకట్న దురాచాలు, పురుషాధిక్యత, సంప్రదాయాల పేరుతో మహిళలను తక్కువ చేసి చూడటం వంటివి మహిళల్లో ఈ విధమైన మార్పులకు కారణం అవుతున్నాయని కూడా అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు పేర్కొంటున్నారు.

పెళ్లి, సంప్రదాయం వంటివి చాలా వరకు సమానత్వ ధోరణికి వ్యతిరేకంగా ఉంటున్నాయని, స్త్రీలను బానిసత్వంలోకి నెడుతున్నాయని ఆధునిక మహిళలు, ముఖ్యంగా ఫెమినిస్టులు భావిస్తున్నారు. దీంతో తమకు పెళ్లి, మాతృత్వం, సంప్రదాయం కంటే కూడా కెరీర్ డెవలప్‌మెంట్, పర్సనల్ డెవలప్ మెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వంటివి సౌకర్యాన్ని, స్వేచ్ఛను ఇస్తాయని బలంగా నమ్ముతున్నారు. ఈ విధమైన ఆలోచనలే 2030 నాటికి 45% మంది మహిళలు పెళ్లి చేసుకోకుండా, ఒంటరిగా ఉండేందుకు దారితీస్తాయని అధ్యయనం పేర్కొన్నది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని కూడా నిపుణులు అంటున్నారు. మొత్తానికి మగతోడు లేకున్నా ఉండగలుగుతామనే మహిళల సంఖ్య ప్రస్తుతం పెరుగుతోందని చెబుతున్నారు. Link

Next Story