స్టార్టప్‌లలో మహిళల నాయకత్వం.. ఆ విషయాల్లో పురుషులకంటే పర్ఫెక్ట్!!

by Javid Pasha |

ఐదు సంవత్సరాల కాలంలో మహిళల స్టార్టప్‌లు సగటున 730,000 డాలర్ల(₹6.61 కోట్లు) ఆదాయాన్ని సాధించాయి. పురుషుల స్టార్టప్‌లు 662,000 డాలర్లు(₹5.99 కోట్లు) సాధించాయి.

స్టార్టప్‌లలో మహిళల నాయకత్వం.. ఆ విషయాల్లో పురుషులకంటే పర్ఫెక్ట్!!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు స్టార్టప్‌ల యజమానులుగా, నిర్వాహకులుగా, వ్యవస్థాపకులుగా పురుషులే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు మహిళలు సైతం ప్రతిభ చాటుతున్నారు వివిధ స్టార్టప్‌లను, వ్యాపారాలను, పలు ఇతర బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించే మహిళలు క్రమంగా పెరుగుతున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అండ్ మాస్ చాలెంజ్ సంస్థలు నిర్వహించిన అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. ముఖ్యంగా వెంచర్ క్యాపిటల్(VC)లో పెట్టుబడుల విషయంలో మహిళల శక్తి, సామర్థ్యాలను ఇది విశ్లేషించింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్టుబడులు.. రాబడుల్లో కీ రోల్

ఒకప్పటి పురుషాధిక్య భావజాలాన్ని ఆధునిక మహిళ బద్దలు కొడుతోంది. అనేక విషయాల్లో తనేం తక్కువ కాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల విషయంలోనూ మహిళలు తమను తాము నిరూపించుకుంటన్నారని వీసీ సర్వే పేర్కొన్నది. ఇందులో పెట్టుబడి పెట్టిన ప్రతీ డాలరుకు మహిళలు నాయకత్వం వహించిన స్టార్టప్‌లు గతంలో 0.78 డాలర్ల ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని, అదే పురుషులు నాయకత్వం వహించిన స్టార్టప్‌లు కేవలం 0. 31 డాలర్లు మాత్రమే రాబడుతున్నాయని స్పష్టం చేసింది. ఇందుకోసం 2018 నాటి అధ్యయన వివరాలను సైతం సేకరించింది. 350 స్టార్టప్‌లను విశ్లేషించి, మహిళలు నాయకత్వం వహించిన కంపెనీలు నిధులను మరింత సమర్థవంతంగా ఉపయోగించి, ఎక్కువ ఆదాయాన్ని సాధిస్తున్నాయని తెలిపింది.

ఐదేండ్లలో సాధించిన అద్భుతం..

సర్వే ప్రకారం.. ఐదు సంవత్సరాల కాలంలో మహిళల స్టార్టప్‌లు సగటున 730,000 డాలర్ల ఆదాయాన్ని సాధించాయి. పురుషుల స్టార్టప్‌లు 662,000 డాలర్లు సాధించాయి. అయితే మహిళలు తక్కువ నిధులతో.. అంటే సగటున 935,000 డాలర్లుతో ఇది సాధించారు. పురుషులు 2.1 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. అయితే ఈ ఫలితాల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ, సమర్థవంతమైన మహిళలు ఉన్నప్పటికీ వెంచర్ క్యాపిటల్ ఫండింగ్‌లో మహిళల స్టార్టప్‌ల విషయానికి వస్తే ఇప్పటికీ తక్కువ వాటాను పొందుతున్నాయి. 2023లో యూఎస్ వెంచర్ క్యాపిటల్ ఫండింగ్‌లో కేవలం 2.1% మాత్రమే మహిళలు స్థాపించిన కంపెనీలకు వెళ్లింది. ఇక మిక్స్‌డ్ జెండర్ టీమ్‌లతో సహా 17.2%కు పెరిగింది. ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి అదర్ స్టడీస్ కూడా మహిళలు కలిగిన టీమ్‌లో 63% మెరుగైన పనితీరును చూపుతున్నాయని, 35% ఎక్కువ రాబడిని ఇస్తున్నాయని తెలిపాయి.

దేనికి సంకేతం?

ఒకప్పటితో పోలిస్తే మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అయినప్పటికీ స్టార్టప్‌ల వ్యవస్థాపనలో, నిర్వహణలో ఏదో ఒక రూపంలో లింగ వివక్ష ఉన్నందున పూర్తిస్థాయి సమానత్వం సాధ్యం కావడం లేదని నిపుణులు అంటున్నారు. మహిళలు వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నప్పటికీ.. వారి ఆధ్వర్యంలోని కంపెనీలు ఫండింగ్ విషయంలో మాత్రం ఇంకా పోరాడుతున్నాయి. 2024-2025లో కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. క్లైమేట్ టెక్ వంటి రంగాలలో మహిళలు కేవలం 1-5% ఫండింగ్ పొందుతున్నారు.

ఇండియాలో..

ఇండియాలో మహిళల నాయకత్వ పరిస్థితి కూడా పురోగతిని సాధిస్తన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వీరు ప్రతిభ కనబరుస్తున్నారు. 2024లో 7,000కు పైగా స్టార్టప్‌లను మహిళలు స్థాపించారు. ఇది మొత్తం స్టార్టప్‌లలో 7.5% వాటాను కలిగి ఉంది. అలాగే 45%కి పైగా రికగ్నైజ్డ్ స్టార్టప్‌లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు. అంటే మహిళలు స్థాపించిన స్టార్టప్‌లు $26 బిలియన్ (సుమారు ₹2.35 లక్షల కోట్లు) క్యుములేటివ్ ఫండింగ్ పొందాయి. గ్లోబల్‌గా రెండవ స్థానంలో ఉండి, ఏడు యూనికార్న్‌లు, 60కు పైగా అక్విజిషన్‌లు, అలాగే 10 పబ్లిక్ లిస్టింగ్‌లు సాధించాయి. స్టార్టప్ ఇండియా, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫాం (WEP) వంటి ప్రభుత్వ ఇనిషియేటివ్‌లు మెంటర్‌షిప్, ఫండింగ్ అండ్ మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహిస్తున్నాయి. మహిళలు ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఈ-కామర్స్ వంటి రంగాలలో సమర్థవంతమైన నాయకత్వం వహిస్తున్నారు. అయితే.. ఫండింగ్ గ్యాప్ ఇప్పటికీ ఉంటోంది. ఇండియన్ మహిళలు వెంచర్ క్యాపిటల్‌లో తక్కువ వాటాను పొందుతున్నారు.

Next Story