AI impact : ఏఐ ఆటోమేషన్ ఎఫెక్ట్.. ఎప్పుడేం జరుగుతుందో..!

by Javid Pasha |

ఏఐ ఆధారిత సాంకేతిక సామర్థ్యాలు విస్తరిస్తున్న కొద్దీ, పనులను సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే సామర్థ్యం ఏర్పడుతుంది.

AI impact : ఏఐ ఆటోమేషన్ ఎఫెక్ట్.. ఎప్పుడేం జరుగుతుందో..!
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అత్యంగా వేగంగా డెవలప్ అవుతోంది. అనేక విషయాల్లో మేలు చేస్తోంది. అదే సందర్భంలో పలు ఆందోళనలకు కారణం అవుతోంది. నిన్నమొన్నటి వరకు అంతా బాగుందని అందరూ భావించినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రంగాల్లోని ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నట్లు ఇటీవలి ఒక అధ్యయనం పేర్కొన్నది.

ముఖ్యంగా డేటా ఎంట్రీ, ట్రాన్స్‌క్రిప్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ జాబ్స్‌ను ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ టెక్నాలజీ భర్తి చేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమైనట్లు ‘మైక్రోసాఫ్ట్ రీసెర్చ్’ 2025, జులైలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు ఇప్పటికే ఏఐ ఇక్కడ ఉపయోగించబడుతోంది. దీంతోపాటు రికార్డ్ కీపింగ్, కమ్యూనికేషన్, షెడ్యూలింగ్, టెక్నికల్ అనాలిసిస్ వంటి పనులు, సంబంధిత ఉద్యోగాలు ఏఐ వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయని అధ్యయనం పేర్కొన్నది.

ఏఐ ఆధారిత సాంకేతిక సామర్థ్యాలు విస్తరిస్తున్న కొద్దీ, పనులను మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్, రికార్డ్ నిర్వహణలోఇప్పటికే AI టూల్స్ అద్భుతం చేస్తున్నాయి. డేటాను ఎనలైజ్ చేసి, లెక్కలను ఆటోమేట్ చేస్తున్నాయి. కమ్యూనికేషన్, షెడ్యూలింగ్‌లో చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్‌లు మానన అవసరాన్ని తగ్గిస్తున్నాయి. టెక్నికల్ అనాలిసిస్‌లో AI అల్గారిథమ్‌లు సంక్లిష్ట డేటా(complex data)ను సైతం వేగంగా ప్రాసెస్ చేస్తున్నాయి.

అయితే క్లీనింగ్ వర్క్స్, నిర్మాణ రంగం, వ్యవసాయం, వైద్య సంరక్షణ వంటి రంగాలపై ఏఐ ప్రభావం ఉన్నప్పటికీ, ఇక్కడ ఉద్యోగాలకు పెద్దగా ఢోకా లేదని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. ఈ ఉద్యోగాలు భౌతిక శ్రమ(physical labor)పై, సేవలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. యంత్రాలు సులభంగా భర్తీ చేయడం కష్టంగా ఉంటాయి. ఉదాహరణకు వైద్య సంరక్షణలో రోగులతో సానుభూతితో కూడిన సంభాషణ లేదా నిర్మాణంలో సంక్లిష్టమైన పనులు ఏఐకి ఇంకా సవాలుగానే ఉన్నాయి. అయినప్పటికీ ఏఐ పురోగతి జాబ్ మార్కెట్లో కొన్ని ప్రతికూల, మరికొన్ని సానుకూల పరిణామాలకు దారితీయవచ్చు. కాబట్టి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మానవ కేంద్రీకృత రంగాలపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు కీలకమవుతుందని నిపుణులు అంటున్నారు. Link

Next Story