కండరాలు పట్టు తప్పుతున్నాయా..? మీ బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆ లోపం ఉండొచ్చు..!

by Javid Pasha |   (  Updated:2025-10-16 09:23:34  IST  )

ప్రోటీన్ లేని బ్రేక్ ఫాస్ట్ తినే వారితో పోలిస్తే, ప్రోటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినేవారిలో 41% వరకు కండరాల అభివృద్ధి ఎక్కువగా ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు.

కండరాలు పట్టు తప్పుతున్నాయా..? మీ బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆ లోపం ఉండొచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల పలువురిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కండరాల బలహీనత కూడా ఉంటోంది. ముఖ్యంగా స్త్రీలలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కండరాలు పటుత్వం కోల్పోవడం కారణంగా అధిక అలసట, ఇతర అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. అయితే ఇది సంభవించడానికి గల సాధారణ కారణాల్లో ఉదయంపూట అల్పాహారంలో ప్రోటీన్లు లోపించడం కూడా ఒకటిగా ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కారణంగానే అధిక ప్రోటీన్ లేని బ్రేక్ ఫాస్ట్ లేదా ఉదయం భోజనం తినే వారితో పోలిస్తే, ప్రోటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినేవారిలో 41% వరకు కండరాల అభివృద్ధి ఎక్కువగా ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదయాన్నే తినే ఆహారంలో సరైన పోషకాలు, ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా లోపించిన పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే కండరాల ప్రోటీన్ ఉత్పత్తి (Muscle protein synthesis) ప్రారంభం అవుతుంది. రాత్రి నిద్రలో శరీరం ఉపవాస స్థితిలో ఉండటం వల్ల కండరాలు బలహీనపడతాయి. అదే ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ తినేవారిలో ఈ సమస్య ఉండదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఇది శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలను సరఫరా చేసి, కండరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది.

ప్రోటీన్ కలిగిన బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే.. రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం ఆకలి, అలాగే క్రేవింగ్స్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా అనవసర ఆహారాలు తినకుండా ఉండి, బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ లేదా భోజనంలో గుడ్లు, పాలు, యోగర్ట్, నట్స్, చీజ్, పెసర్లు, శనగలు, ఓట్స్, చికెన్ బ్రెస్ట్, సాల్మన్ ఫిష్, చియాసీడ్స్, ప్రోటీన్ షేక్స్ వంటి వాటిలో ఏదో ఒకటి ఉండేలా చూసుకోవడం బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు.

Next Story