- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహారాన్ని ఔషధంగా మార్చిన యువకుడు
ఫుడ్ పాయిజన్‌గా మారితే జీవితం నరకం.. ఈ సత్యాన్ని గ్రహించే రైతుగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రెండేళ్లు కష్టపడి సాగులో మెళకువలు నేర్చుకుని.. 2 సెంట్ల భూమిలోనే 900కిలోల బెండకాయ పండించి.. ‘ఫుడ్ ఫారెస్ట్’ ద్వారా సాగు టిప్స్ నేర్పుతున్న ప్రదీప్

దిశ, ఫీచర్స్: కొందరికి ఎలాంటి చెడు అలవాట్లుండవు. చూడటానికి కూడా ఫిట్‌గా ఉంటారు. కానీ తరుచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అదేంటో అర్థంకాని పరిస్థితి. సేమ్ ఇట్లనే అయింది తమిళనాడుకు చెందిన యువకుడు ప్రదీప్ కుమార్‌కు. మనోడు మందు ముట్టడు. సిగరెట్ తాగడు. అయినా కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అసలు దీని పనేందో చూడాలనుకొని అన్నీ వదిలేసి హెల్త్ మీదనే దృష్టిపెట్టి ఓ పరిష్కార మార్గాన్ని కనిపెట్టాడు.
ఆరోగ్య ఆలోచన..
మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన ప్రదీప్ కుమార్ ఎల్అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు రూ.70 వేల జీతం. ప్రాజెక్టు పనిమీద రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లేవాడు. జీవితం సుఖంగా, ఆరోగ్యంగా ఉందనుకున్నాడు. మద్యం ముట్టుకోడు.. సిగరెట్ తాగడు. రోజూ జిమ్‌కి వెళ్తాడు. చాలా క్రమశిక్షణతో మెలిగేవాడు. ఊకూకెనే వాళ్లమ్మ అస్వస్థతకు గురైంది. ఆ వెంటనే సర్జరీ అన్నారు. డబ్బుకూడా చాలా ఖర్చయ్యింది. ఆ తర్వాత తను కూడా అనారోగ్యానికి గురయ్యాడు. అన్ని మంచి అలవాట్లే ఉన్నా ఎందుకు అనారోగ్యానికి గురయ్యానా అని ఆలోచనలో పడ్డాడు.
విషాహారం..
ప్రదీప్‌కు కిడ్నీలో పెద్ద సైజు స్టోన్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. తినే ఆహారమే తనకు సమస్యలు తీసుకొచ్చిందని అర్థమైంది. రసాయనాలతో పండించిన కూరగాయలు, ఆహారం నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేస్తున్నాయని తెలుసుకున్నాడు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగం వదిలేసి సహజ వ్యవసాయం చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. అలా ఉద్యోగం వదిలేసి తన సొంతూరైన వెల్లూరు గ్రామానికి తిరిగి వచ్చేశాడు. రానైతే వచ్చాడు గానీ వ్యవసాయం గురించి తనకేమీ తెలియదు. అయినా సరే పట్టువదలకుండా రెండేళ్లు కష్టపడి సాగు మెళకువలు నేర్చుకున్నాడు.
ఆహారమే ఔషధం..
ఇంటర్నెట్.. నమ్మల్వార్ బోధనలు.. డాక్యుమెంటరీలు చూసి చాలా విషయాలు నేర్చుకొని సొంతంగా కొన్ని పద్ధతులు తయారుచేశాడు. ఆహారమే ఔషధం అనే నమ్మల్వార్ మాటలు అతన్ని చాలా ప్రభావితం చేశాయి. మధ్యప్రదేశ్‌లో అకాశ్ చౌరాసియా వద్ద నమ్మల్వార్ స్థాపించిన వనగం ఫౌండేషన్‌లో శిక్షణ పొందాడు. రసాయనాలు లేని సహజ వ్యవసాయం.. స్థానిక గింజలు.. మట్టి ఆరోగ్యం గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో సాగు మొదలుపెట్టాడు. కానీ రసాయనాల వల్ల భూమి సారం కోల్పోయి ఉంది. రెండేళ్లు కష్టమైంది.
కీహోల్ గార్డెన్..
సాగులో మంచి అనుభవం వచ్చాక ‘పలధాని విధై’ పద్ధతిని అనుసరించాడు. 20-25 రకాల గింజలు కలిపి విత్తి.. పండకుండానే మట్టిలో కలిపేశాడు. పక్షులు వచ్చాయి. పురుగులు మైక్రోబ్స్ పెరిగాయి. కలుపు మొక్కలను కూడా తీయకుండా కట్ చేసి మట్టిపైనే వదిలేశాడు. నెమ్మదిగా మట్టి మృదువుగా, ఫలవంతంగా మారింది. ఒక్క గింజే దేశాన్ని మార్చగలదు. స్థానిక గింజలకు 500 ఏళ్ల జ్ఞాపకశక్తి ఉంది అని 2 సెంట్ల భూమితో ఫ్రెష్‌గా మొదలుపెట్టాడు. ట్రాక్టర్ కూడా మళ్లదు దాంట్లో. ఖర్చు కేవలం 2-3 వేల రూపాయలే. కీహోల్ గార్డెన్ తయారు చేసి స్థానిక బెండకాయ మొదటి పంటగా వేశాడు.
సీడ్ ఫెస్టివల్..
మొదటి పంటే అద్భుతం. సాధారణంగా ఒక బెండ మొక్కకు 10-30 కాయలు వస్తే అతని తోటలో 120 కాయలు వచ్చాయి. 2 సెంట్లలోనే 600-900 కేజీలు పండాయి. ఆ నమ్మకంతో 2019లో ఫుడ్ ఫారెస్ట్ ప్రారంభించాడు. రసాయనాలు లేని స్వయం సమృద్ధి తోటగా తన సాగు విధానాన్ని మార్చి వాట్సాప్ ద్వారా నేరుగా కస్టమర్లకు అందిస్తున్నాడు. 2022లో రూ.1 లక్ష.. 2023లో రూ.4 లక్షలు.. 2024లో రూ.4 లక్షలు.. 2025లో రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ప్రతీ సంవత్సరం వెల్లూరు సీడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ సమాజ ఆరోగ్యం కోసం తపిస్తున్నాడు.






