ఆధునికత కాదు స్థానికత ముఖ్యం.. అనుపమా కుండూ స్టైలే వేరు

by Sujitha Rachapalli |

అనుపమా కుండూ.. వాస్తుకు కొత్త పునాదివేస్తుంది.. మోడ్రన్ వాస్తు శిల్పులకు పూర్తిగా భిన్నంగా.. స్థానికతకు, వాతావరణానికి అనుకూలంగా నిర్మాణాలు చేపడుతోంది..

ఆధునికత కాదు స్థానికత ముఖ్యం.. అనుపమా కుండూ స్టైలే వేరు
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా నగరాలన్నీ ఒకేలా కనిపిస్తున్న ఈ జమానాలో ఒక వాస్తుశిల్పి తన సొంత మార్గం వెతికి స్థానికతకు ప్రాధాన్యమిస్తూ నిర్మాణాలు చేపడుతోంది. ఆమె పేరు అనుపమా కుండూ. ఆధునిక వాస్తువిద్యలోని ఏకరూపతను సవాలు చేస్తూ స్థానిక మూలాలతో కూడిన నవీన ఆలోచనలతో ముందుకెళ్తోందామె.

ఆరోవిల్లెను చూసి..

పూణేలో జన్మించిన అనుపమ సర్ జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో వాస్తువిద్యను అభ్యసించింది. చాలామంది వాస్తుశిల్పులు గాజు టవర్లు, అంతర్జాతీయ ప్రాజెక్టులు, త్వరిత విజయాల వైపు వెళ్తే అనుపమ ఆ మార్గాన్ని వదిలేసింది. ఆరోవిల్లెకు వెళ్లి అక్కడ ఒక భిన్నమైన వాస్తువిద్యా ప్రయోగాన్ని ప్రారంభించింది. ఆరోవిల్లె పుదుచ్చేరి సమీపంలో ఉన్న ఒక అంతర్జాతీయ పట్టణం. 1968లో మాతా అమృతానందమయి స్థాపించిన ఆధ్యాత్మిక, ప్రయోగాత్మక నగరం ఇది. ఇక్కడ వివిధ దేశాల ప్రజలు ఐక్యత, శాంతి, మానవ ఐక్యత కోసం కలిసి జీవిస్తారు.

తిరస్కరిస్తోంది..

ఆరోవిల్లెలో అనుపమకు ఏర్పడిన అనుభవాలు తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. నిర్మాణాలు తామున్న ప్రదేశానికి అనుగుణంగా ఉండాలి.. ఆ ప్రదేశం మీద బలవంతంగా రుద్దకూడదు అనే ఆలోచనను అవలంబించింది. ఆధునిక నిర్మాణాల్లో గాజు, స్టీల్, స్టాండర్డ్ మెటీరియల్స్ ఉపయోగించి ఒకేలా కనిపించే భవనాలు వస్తున్నాయి. కానీ అనుపమా కుండూ ఈ ధోరణిని తిరస్కరిస్తోంది. ఆమె టెర్రాకోటా, సున్నం, రీసైకిల్ చేసిన పదార్థాలు వంటి స్థానిక మెటీరియల్స్‌ను ఎంచుకొని ఆర్కిటెక్టింగ్‌‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

చివరి ఫీచర్ కాదు..

అనుపమ ఈ పదార్థాలనే ఎందుకు వాడుతుందంటే.. ఇవి వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. కాలంతో పాటు అందంగా మారుతాయన్నమాట. ఆమె నిర్మించిన వాల్ హౌస్, ఫుల్ ఫిల్ హోమ్స్ వంటి ప్రాజెక్టులు దూరం నుంచి ఆకట్టుకునే పెద్ద భవనాలు కావు. వీటిని ఉపయోగించేటప్పుడు.. కాంతి పడేటప్పుడు.. కాలం గడిచేటప్పుడు వాటి సౌందర్యం మరింతగా వెల్లడవుతుంది. సస్టెయినబులిటీ అనేది తన ప్రాజెక్టు చివర్లో జోడించే ఫీచర్ కాదు.. ప్రారంభం నుంచే ఉండే మొత్తం ఆలోచనా విధానంగా భావిస్తుంది.

అలా ఎందుకుండాలి?

సాంప్రదాయ పద్ధతులను కేవలం సంప్రదాయం కోసం కాకుండా వాటిని నవీనంగా మలిచి ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తుంది అనుపమ. నిర్మాణాల్లోనే కాదు.. విద్యారంగంలోనూ అనుపమ ఒక మంచి అధ్యాపకురాలు. జ్యూరిచ్‌లోని ఈటీహెచ్ జ్యూరీచ్.. స్పెయిన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో బోధిస్తోంది. భారతదేశంలోని భవనం యూరప్‌లోని భవనం లాగా ఎందుకు ఉండాలి? సామర్థ్యం కంటే గుర్తింపు ఎందుకు ముఖ్యం కావాలి? ఆధునికత అంటే ఏకరూపతను అంగీకరించడమేనా? అనేవి విద్యార్థులకు చెప్తుంది.

Next Story