హైపోథాలమస్.. ఆహారమే మహారోగ్యం.!

by Daayi Srishailam |

ఎంతోమందికి ఉపయోగపడేలా డాక్టర్లు ఆమోదించిన ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నాడు 23 సంవత్సరాల యవకుడు శ్రీహర్ష

హైపోథాలమస్.. ఆహారమే మహారోగ్యం.!
X

దిశ, ఫీచర్స్: చూస్తున్నాం కదా.? 30 ఏళ్లు కూడా నిండనివారికి బీపీ, షుగర్, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఆరోగ్య సోయి లేకపోవడం, ఎలాంటి లైఫ్ స్టయిల్ అలవర్చుకోవాలో తెలియకపోవడం వల్ల అనారోగ్యానికి ఆత్మీయులవుతున్నారు. ఇలాంటి ఎంతోమందికి ఉపయోగపడేలా డాక్టర్లు ఆమోదించిన ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నాడు 23 సంవత్సరాల యవకుడు శ్రీహర్ష.

డెంగ్యూ వచ్చినప్పుడు..

శ్రీహర్ష వాళ్లది ఏపీ. ఉన్నత చదువుల కోసం 2018లో ముంబైకి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. హెల్త్ సైన్సెస్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అతడికి డెంగ్యూ వచ్చింది. ప్లేట్‌లెట్ కౌంట్ 60,000కి తగ్గింది. ఆకలి లేదు. తరుచూ తీవ్రమైన వాంతులయ్యేవి. డాక్టరేమో ఘన, అర్ధ ఘన పదార్థాలు తినొద్దని కేవలం ద్రవాహారం తీసుకోవాలన్నాడు. అవికూడా పొప్పడి ఆకు రసం, కివీ ఫ్రూట్ జ్యూస్ వంటివి మాత్రమే. ఇంట్లో ఇవన్నీ కుదరలేదు. ఆసుపత్రిలోనేమో క్యాంటీన్ సౌకర్యం లేదు. ఆన్‌లైన్ మీల్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల కోసం సెర్చ్ చేశాడు కానీ.. అలాంటి సేవలేవీ దొరకలేదు. అప్పుడే అతనికొక ఐడియా వచ్చింది.

తిండి శ్రద్ధ లేదు..

తోడుగా ఎవరూ లేనివాళ్లకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఫుడ్ పరిస్థితి ఏంటి.? అని ఆలోచించాడు శ్రీహర్ష. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. రోగుల సంఖ్యేమో ఎక్కువుంటుంది. కానీ మార్కెట్‌లో వాళ్లకు కావాల్సిన ఆహార సేవలు అందుబాట్లో లేవు. కొంత స్టడీ చేస్తే.. ఇండియాలో లక్షల మంది డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ.. తిండి గురించి పట్టించుకోకుండా ఏది పడితే అది తింటున్నారని గ్రహించాడు.

హైపోథాలమస్ స్టార్టప్..

ఆరోగ్యాన్ని పదిలపరచుకోవాలి అనే విషయం అందరూ చర్చించుకునేలా తన స్నేహితుడు శరత్ చంద్రతో కలిసి "హైపోథాలమస్"ను స్టా్ర్ట్ చేశారు. తర్వాత క్లినికల్ డైటీషియన్ నిరాలి పరిఖ్‌ను కో-ఫౌండర్‌గా చేర్చుకున్నారు. మెదడులోని హైపోథాలమస్ గ్రంథి ఆహార అలవాట్లను నియంత్రిస్తుంది. దాని ప్రకారమే వీళ్ల కంపెనీ ఆరోగ్య సోయి ఉన్న వ్యక్తులు, రోగుల ఆహార అలవాట్లను నియంత్రించి సహాయపడాలనే ఉద్దేశంతో "హైపోథాలమస్" అనే పేరు పెట్టారు. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి శాంతినికేతన్, లైఫ్‌కేర్, లీలావతి వంటి ఆరు ఆసుపత్రులతో టై- అప్ అయ్యి పనిచేస్తున్నారు.

స్పెషల్ మీల్ ప్యాకేజీ..

శ్రీహర్ష స్టార్టప్‌కు ఉన్న అదనపు అడ్వాంటేజ్ ఏందంటే.. ఈ హాస్పిటల్స డాక్టర్లే పేషెంట్స్‌కి హైపోథాలమస్‌కు రెఫర్ చేస్తున్నారు. హైపోథాలమస్‌లోని క్లినికల్ డైటీషియన్లు రోగి వ్యాధి, లక్షణాలు, కోలుకునే కాలాన్ని బట్టి వ్యక్తిగతీకరించిన డైట్ చార్ట్‌లు తయారుచేస్తారు. టోఫు బాటిల్ గార్డ్ మిల్లెట్ దోసా, సెసమీ గ్రీన్ గ్రామ్ ఖిచ్డీ నుంచి బాటిల్ గార్డ్ బ్రౌన్ రైస్ దోసా, కార్డమమ్ మిల్క్ వంటివి కలిపి మీల్ ప్యాకేజీ అందిస్తున్నారు. మీల్ ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, మిడ్-మీల్, లంచ్, స్నాక్స్, డిన్నర్, బెడ్‌సైడ్ మీల్ ఉంటాయి. రోజుకు మూడుసార్లు డెలివరీ అయ్యే ఈ ఆరు మీల్ ప్యాకేజీ ధర రూ.600 ఉంటుంది.

రూ.7 లక్షల ఆదాయం..

హాస్పిటల్స్‌తో పాటు నేరుగా ఇంటికే వేడి వేడి రుచికరమైన భోజనాలు డెలివరీ అవుతుండటం పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2024లో ప్రారంభమైన హైపోథాలమస్ స్టార్టప్ డయాబెటిస్, క్యాన్సర్, ఊబకాయం, హైపర్‌టెన్షన్, థైరాయిడ్, పీసీఓఎస్, లివర్ వ్యాధి వంటి సమస్యలున్న 100కు పైగా రోగులకు నిత్యం సేవలు అందిస్తోంది. శ్రీ హర్ష రూ.15 లక్షల ప్రారంభ పెట్టుబడితో కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు నెలకు రూ.7 లక్షల ఆదాయం వస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరుకు విస్తరించాలని లక్ష్యం.

Next Story