Strange and Unique Festival.. సంతోషాల కేళీ హోలీ.!

by Daayi Srishailam |   (  Updated:2025-03-14 14:54:06  IST  )

హోలీ ఎలా చేయాలి.? ఎక్కడెక్కడ ఎలా చేస్తారు.? అప్పుడెలా ఉండేది.? ఇప్పుడెలా తయారైంది.?

Strange and Unique Festival.. సంతోషాల కేళీ హోలీ.!
X

హోలీ అంటే..?

కోడుగుడ్లు కొట్టుకోవడం..

ఆయిల్ పూసుకోవడం..

మురికి కుంటలో తోసుకోవడం..

పెండ రుద్దుకోవడం..

ఇదేనా..?

ఏమో.. ఇదే అనుకునే పరిస్థితీ వస్తుందేమో.?

మోదుగుపూలతో సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడో మర్చిపోయారు జనాలు.

అసలు హోలీ ఎలా చేయాలి.?

ఎక్కడెక్కడ ఎలా చేస్తారు.?

అప్పుడెలా ఉండేది.? ఇప్పుడెలా తయారైంది.? వంటి విశేషాలతో స్పెషల్ స్టోరీ.

- దాయి శ్రీశైలం

విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడం వల్ల హోలీ పండగ వచ్చిందని అంటారు. అంతటి విశిష్టత ఉన్న ఈ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా జరుపుకుంటారు. హోలీ అంటే ఉల్లాసం.. ఉత్సాహం. పిల్లలకు.. పెద్దలకు అందరికీ నచ్చుతుంది. ఆద్యంతం కలర్‌ఫుల్‌గా సాగే హోలీ తమ జీవితాలను మరింత రంగులమయంగా మారుస్తుందనే నమ్మకం అందరిదీ.

మోదుగపూల హోలీ..

వసంతం వచ్చిందంటే చెట్ల ఆకులన్నీ రాలిపోయి మోడువారినట్లు కనిపిస్తాయి. ఆకురాలుతున్న వేళ మోదుగ చెట్లు మాత్రం పూలతో విరబూసుకుంటాయి. గుత్తులు గుత్తులుగా వేలాడుతూ గుభాలిస్తాయి. ఒకప్పుడు హోలీ అంటే ఇవే మరి. పండగ రెండు మూడు రోజులు ఉందనగా మోదుగ గుత్తులు కోసుకొచ్చేవాళ్లు. పూలన్నింటినీ తెంపి పొయ్యిమీద ఉడకబెట్టేవాళ్లు. పూల నుంచి రంగు వేరయ్యి నీళ్లన్నీ ఎర్రగా మారిపోతాయి. అదే హోలీ పండగ రంగు. దానిని డబ్బాల్లో పోసుకొని హోలీనాడు చల్లుకొని హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. ఇంకా గులాల్ చల్లుకొని హోలీ ఆడేవారు.

ఇప్పుడంతా కోడిగుడ్లే

మోదుగపూల సోయగంతో మొదలైన హోలీ ఇప్పుడు కోడిగుడ్లు కొట్టుకునే దాక వచ్చింది. గులాల్ లేవు ఏం లేవు. హోలీరోజు ఏ వాడ చూసినా.. ఏ గల్లీ చూసినా కోడిగుడ్ల కంపే. ఎక్కడ్నుంచి వచ్చిందో ఏమెగానీ దీన్నొక కల్చర్‌గా ఫీలవుతోంది యువత. గుడ్డు కొట్టకపోతే హోలీయే కాదన్నట్లు ఫీలవుతున్నారు. ఇంకా.. సాంపి కలర్ చల్లుకోవడం.. వేస్ట్ ఆయిల్ పూసుకోవడం.. మురికి కుంటలో తోసుకోవడం.. పెండ రుద్దుకోవడం ప్యాషనైపోయింది. అంతా అయిపోయే సరికి ఒక్కరి ఒంటిమీద కూడా అంగీ ప్యాంటులుండవు. ఇదేం పద్ధతిరా అని ఎవరైనా అడిగితే "ఇట్లుంటది మనతోని ముచ్చట" అని డైలాగులు మీదికెల్లి.

చితా భస్మంతో..

వారణాసిలో హోలీ వింతగా ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్‌లో మహా స్మశాన్ హారతితో హోలీ సెలబ్రేట్ చేస్తారు. దీనిని మసాన్‌కీ హోలీ అంటారు. చితి కాలిన తర్వాత వచ్చిన బూడిదను ఒకరిమీద ఒకరు చల్లుకొని హోలీ సెలబ్రేషన్స్ జరుపుతారు. ఆ సమయంలో మణికర్ణిక ఘాట్ హరిహర మహాదేవ్ స్మరణతో మార్మోగుతుంది. చితి బూడిదతో హోలీ ఆడటం శివుడికి ఆనందం.. భక్తులకు ముక్తికరం అని వాళ్ల నమ్మకం. వారణాసి ప్రజలకు మసాన్ హోలీ సాంస్కృతిక గుర్తింపుతో పాటు ఆధ్యాత్మిక స్వభావాన్ని చూపిస్తుంది. చితి బూడిదను చల్లుకున్న తర్వాతే కాశీలో హోలీ మొదలువుతంది.

లాఠ్ మార్ హోలీ

యూపీలోని బార్సానాలో హోలీ పండుగ రోజున బావ.. మరిది వరసయ్యే వాళ్లను లాఠీతో కొడతారట పెండ్లయిన ఆడవాళ్లు. శ్రీకృష్ణుడు రాధ కోసం బార్సానా వెళ్లేవాడట. రాధ స్నేహితులను ఆటపట్టిస్తూ కొంటె పనులు చేసేవాడట. ఒకసారి గ్రామంలోని మహిళలు సరదాగా కర్రలతో కొడుతూ తరిమేశారట.. ఆ సంఘటనకు గుర్తింపుగా లాఠ్ మార్ హోలీ వచ్చిందని చెప్తుంటారు. కొడుకులను బలంగా కొట్టడానికి అత్తలు నెల రోజుల్నుంచే కోడళ్లకు బలిష్టమైన ఆహారం పెడతారట. లాఠ్ మార్ హోలీ లెక్కనే కరోర్ మార్ హోలీ జరుపుతారు హర్యానాలో. వదిన మరదళ్లు.. బావ బావమరుదుల కర్రలతో కొట్టుకుంటారు.

గాడిదపై అల్లుడి ఊరేగింపు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా విడా గ్రామం హోలీకి చాలా ప్రత్యేకమైనది. కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి హోలీ రోజున ఊరేగించే సంప్రదాయం ఉందక్కడ. ఆ ఊరిలో ఒకప్పుడు దేశ్‌ముఖ్‌లు ఉండేవాళ్లు. హోలీ రోజున అల్లుడు.. కూతురు ఇంటికి వచ్చారట. ఐతే.. హోలీ ఆడటానికి అల్లుడు నిరాకరించాడట. ఎంత చెప్పినా వినకపోవడంతో గాడిదపై కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతూ రంగులు చల్లాడట మామ ఆనందరావ్ దేశ్‌ముఖ్. ఊరేగింపు అయిపోయాక విలువైన బహుమతులు.. కొత్త బట్టలు పెట్టి గౌరవిస్తారట. ఇక అప్పటి నుంచి ఇది ఆ ఊరి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది.

మేన మామల హోలీ

తెలంగాణ బార్డర్‌లోని కంగ్టి.. పిట్లం.. కర్ణాటకలోని బీదర్లో హోలీని ఇంకా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున మేన మామలు.. మేనల్లు్ళ్లకు.. మేన కోడళ్లకు చెక్కర మాలలు.. కూడక కర్జూర మాలలు బహుమతిగా ఇస్తుంటారు. చాలా సంవత్సరాల నుంచి ఇదొక ఆనవాయితీగా వస్తోంది. కాముడి దహనం అనంతరం శుభసూచకంగా వీటిని ఇస్తారట. చక్కెర మాలలు తీయదనానికి.. మధుర జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి. కూడక కర్జూరాలు ఆరోగ్య పరిరక్షణ.. దుష్టశక్తుల నివారణ.. మంగళకరమైన జీవితానికి సంకేతంగా ఇస్తుంటారని చెప్తున్నారు.

విదేశీ హోలీ

  1. - నేపాల్‌లో హోలీని ఫాగు పౌర్ణమి అని అంటారు. ఖాట్మాండు.. పోఖరా వంటి పెద్ద నగరాల్లో హోలీ రోజున వీధులు రంగు రంగుల లైట్లతో కాంతివంతంగా కనిపిస్తాయి. రంగులు.. గులాల్.. నీటి బుడగలు చల్లుకొని ప్రజలు హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు.
  2. - మారిషస్‌లో యూపీ.. బీహార్లో జరిగే హోలీ పండగలా సెలబ్రేట్ చేస్తారు. భజన కీర్తనలు.. హోలిక దహనం.. రంగులు చల్లుకొని హోలీని జరుపుకుంటారు.
  3. - ఫిజీలో హోలీని బహుళ వర్ణ పండుగ అంటారు. ఇక్కడ కూడ యూపీ.. బీహార్ నుంచి వెళ్లినవారు ఎక్కువగా ఉంటారు. సాంప్రదాయక నృత్యాలు.. సంగీతాల మధ్యన రంగులు చల్లుకొని సందడి చేస్తారు.
  4. - పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్.. కరాచీ.. లాహోర్ వంటి ప్రాంతాల్లో హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూ దేవాలయాల.. కమ్యునిటీ కేంద్రాలు రంగులమయం అవుతారు హోలీ రోజున.
  5. - బంగ్లాదేశ్‌లోని ఢాకా.. చిట్టగాంగ్,, సిల్హెట్ వంటి ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా హోలీని జరుపుతారు. ఇక్కడ హోలీని డోల్ పౌర్ణిమ లేదా బసంత ఉత్సవం అని అంటారు.

హోళీక కథ

  1. - హోలీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. మండుతున్న హోలీ మంటలనే హోళీక అంటారు.
  2. - హోలీ సంబరాల్లో ఇది ప్రధాన ఘట్టం.
  3. - హిందూ పురాణాల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుడు చెల్లెలైన హోళీక అనే రాక్షసి దహనానికి సంకేతంగా ఈ హోలీ మంటలు వేస్తారని చెప్తుంటారు.
  4. - రాక్షసుల పరాక్రమం హోళీక దహనంతో అంతమైందని అందుకు ప్రతీకగానే కామ దహనం చేస్తారని అంటారు.
Next Story