ఇన్‌స్పెక్షన్ టెక్నాలజీ.. పైపుల్లో ఈదుతూ సమాచారం అందించే రోబోలు!

by Javid Pasha |   (  Updated:2026-06-07 08:39:07  IST  )

మానవులు చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లోనూ సులభంగా పని చేయగల ఈల్ ఇన్‌స్పైర్డ్ స్మార్ట్ రోబోలను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు.

ఇన్‌స్పెక్షన్ టెక్నాలజీ.. పైపుల్లో ఈదుతూ సమాచారం అందించే రోబోలు!
X

దిశ, ఫీచర్స్ : రోబోటిక్ టెక్నాలజీ కేవలం హ్యూమనాయిడ్ రోబోలు, ఇండిస్ట్రియల్ రోబోలకే పరిమితం కాలేదు. మానవ అవసరాలు తీర్చే ప్రతీ రంగంలో, ప్రతీ పనిలో దీనిని ఉపయోగించుకునే ప్రయత్నాలు, పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సాంకేతిక శాస్త్రవేత్తలు భవంతులు, రోడ్లు, ప్రాజెక్టులు, భూగర్భం తదితర చోట్ల అమర్చిన పైప్‌లైన్‌ల ద్వారా కదులుతూ, ఇన్‌స్పెక్షన్ చేయగలిగే ఏఐ ఆధారిత చిన్న సాఫ్ట్ రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకీ అవి ఎలా పనిచేస్తాయి? ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైప్ ఇన్‌స్పెక్షన్ రోబోలు(క్యాప్సూల్ టైప్, ట్రాక్డ్ రోబోట్లు) ప్రపంచంలో ఇప్పటికే ఉప్పటికీ, వీటి ద్వారా సాంప్రదాయ పద్ధతిలో రోడ్లు లేదా పైప్‌లైన్ ప్రదేశాలను తవ్వి ఇన్‌స్పెక్షన్ చేయాల్సి వస్తుంది. దీంతో సమయం, డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది. వనరులకు నష్టం జరుగుతుంది. కానీ ప్రస్తుతం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న ఈల్ ఇన్‌స్పైర్డ్(eel-inspired soft robot) ఇన్‌స్పెక్షన్ రోబోలు(fish-like swimming soft robot) ఏఐ సెన్సార్లు, కెమెరాలు, రిపేరింగ్ టూల్స్‌తో అమర్చబడి ఉండటంవల్ల మరింత మెరుగైన ఫ్లెక్సిబిలిటీ, స్విమ్మింగ్ సామర్థ్యం, లీక్ రిపేర్ సామర్థ్యం కలిగి పైప్‌లైన్ వ్యవస్థలో తలెత్తే ఇబ్బందులను వెంటనే పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

పగుళ్లు, లీకేజీలను గుర్తిస్తూ..

ఈల్ ఇన్‌స్పైర్డ్ స్మార్ట్ రోబోలు మానవులు చేరుకోవడం కష్టమైన, అసురక్షితమైన ప్రాంతాల్లోనూ సులభంగా పని చేయగలవు. పాతబడిన నీటి, గ్యాస్, పారిశ్రామిక పైపులలో దాగి ఉండే చిన్న చిన్న పగుళ్లను, లీకేజీలను స్వయంగా గుర్తించి సమాచారం అందిస్తాయి. దీంతో నీరు, గ్యాస్ వృథా కాకుండా వెంటనే చర్యలు చేపట్టడానికి వీలుంటంది. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినకుండా, ప్రమాదాలు సంభవించకుండా సహాయపడతాయి. పైప్‌ లైన్లలో చొచ్చుకుపోతూ పనిచేయగలిగే ఈ సాఫ్ట్ రోబోలు మెత్తని పదార్థాలతో తయారవడంవల్ల ఇరుకైన, చెత్తా చెదారం నిండిన పైప్‌లైన్ నెట్‌వర్క్‌లలోనూ సులభంగా వంగి, తమను తాము కుదించుకొని, వక్రాకారాలకు, ప్రవాహాలకు అనుగుణంగా మార్పు చెందుతూ పనిచేస్తాయి.

సెన్సార్లు, కెమెరాలతో వర్క్.

ఏఐ సెన్సార్లు, కెమెరాలు, రిపేరింగ్ టూల్స్‌తో అమర్చబడి ఉంటాయి. కాబట్టి ఇన్‌స్పెక్షన్ సాఫ్ట్ రోబోలు పైప్‌ల‌ లోపలి స్థితిని ఖచ్చితంగా తెలియజేస్తాయి. నగరాల్లో, పైప్‌లైన్ వ్యవస్థ కలిగిన ప్రతీచోట ఇవి సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో డబ్బు, సమయం, వనరులు వృథాకాకుండా ఉంటాయి. నీటి వృథా చాలా వరకు తగ్గుతుంది. వనరుల సంరక్షణకు భరోసా లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పూర్తిస్థాయి ఇన్‌స్పెక్షన్ స్మార్ట్ రోబోలు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు సాంకేతిక శాస్త్రవేత్తలు నిపుణులు.

Next Story