కమ్మని క్యాసెట్ పాట.. అదో స్వర్ణయుగం

by Sujitha Rachapalli |

చిన్నప్పుడు ఏ ఊర్లో చూసినా, ఏ ఇంట్లో విన్నా టేప్ రికార్డర్ సౌండ్సే మార్మోగేవి. అప్పుడప్పుడే మా నాయిన మా ఇంట్లోకి కొత్త టేప్ రికార్డర్ తెచ్చిండు. పావుగంట, అద్దగంట కాదు.. గంటల తరబడి క్యాసెట్ల పాటలను ఆస్వాదించేవాళ్లం.

కమ్మని క్యాసెట్ పాట.. అదో స్వర్ణయుగం
X

దిశ, ఫీచర్స్ : చిన్నప్పుడు ఏ ఊర్లో చూసినా, ఏ ఇంట్లో విన్నా టేప్ రికార్డర్ సౌండ్సే మార్మోగేవి. అప్పుడప్పుడే మా నాయిన మా ఇంట్లోకి కొత్త టేప్ రికార్డర్ తెచ్చిండు. పావుగంట, అద్దగంట కాదు.. గంటల తరబడి క్యాసెట్ల పాటలను ఆస్వాదించేవాళ్లం. తరుచూ క్యాసెట్లు మార్చేవాళ్లం. నిజంగా అదొక స్వర్ణయుగం అని చెప్పాలి.

చిరంజీవి పాటంటే..

నాకు చిరంజీవి పాటలంటే ఇష్టం. క్యాసెట్లు అమ్మేటొళ్లు ఊర్లకొస్తే ముందు ముందుగాల్నే ఉరికి అవి రెండు.. ఇవి రెండు క్యాసెట్లు కొనుక్కునేవాళ్లం. టౌన్‌కు వెళ్తే చాలు.. సంచిలో కొత్త క్యాసెట్ లేకుండా ఇంటికి వచ్చేవాళ్లం కాదు. అంత అటాచ్మెంట్ ఏర్పడింది దానితో. చిరంంజీవి పాటంటే ఇష్టమున్నప్పటికీ క్యాసెట్లు మాత్రం వెంకటేశ్‌వి కొనేవాణ్ని. ‘పెళ్లి చేసుకుందాం’, ‘ప్రేమించుకుందాం రా’, ‘పవిత్ర బంధం’, ‘రోజా’ వంటి సినిమా క్యాసెట్ల పాటలు మళ్లీ మళ్లీ వినేవాళ్లం. ఆ కమ్మని సంగీతం ఇప్పటికీ చెవుల్లో మోగుతుంది. ఆ రోజుల్లో డిజిటల్ పాటలు లేవు కదా. క్యాసెట్ మీదుగానే ఎన్నో భావాలు వ్యక్తమయ్యేవి.

సంబంధం ఖాయం..

ఆగకుండా ఎప్పుడూ నడుస్తుంటే ఏదైనా మొరాయిస్తది కదా? అట్లా అప్పుడప్పుడు టేప్ రికార్డర్ ఖరాబయ్యేది. బుధవారం నాడు అంగడికి వెళ్లి అట్లనే దాన్ని కూడా తీసుకుపోతుండె. బుధవారం నాడు రిపేరుకు ఇస్తే ఒక్కొక్కసారి మల్లొచ్చే బుధవారం దాక రిపేర్ చేయకపోతుండె. ఎందుకంటే మా కంటే ముందుగాల ఎంతోమంది పెట్టిపోతుండె. అంటే టేప్ రికార్డర్ రిపేర్ చేసేటొళ్లకు అంత పని దొరికేది. పెండ్లి సూపులకు వెళ్లినప్పుడు ‘పిలగాడేం చేస్తడు’ అని అడిగితే ‘టేప్ రికార్డు దుకాణముంది’ అని చెప్తే పెండ్లి సంబంధం ఖాయం చేసేవాళ్లు. అట్లుండేది టేప్ రికార్డర్.. క్యాసెట్ల క్రేజ్.

టెలిఫోన్ ఆట..

ఒక్కొక్కసారి క్యాసెట్ రీలు సుట్టుకపోయి పాట మధ్యలోనే ఆగిపోయేది. అప్పుడు రీల్ తీసి చేతితో సరిచేసి మళ్లీ పెట్టేవాళ్లం. అలా ఐదారుసార్లు చుట్టుకుంటే అంతే కథ ఇగ. క్యాసెట్ కరాబయ్యేది. రీలు క్యాసెట్లో ఇరికిపోయినప్పుడు ఒకొక్కసారి స్లోగా సాగదీసినట్లు ఇంకోసారి స్పీడ్‌గా రైలు పరిగెత్తినట్లే ఉండేది. అప్పుడు అదంతా ఒక టెన్షన్. కానీ ఇప్పుడంతా మాకు ఆనందం కలిగిస్తోంది. కరాబైన రీలు ఏం చేసుకుంటాం. దానిని మేం వరి చేన్లో కొంగలు రాకుండా బెదురు కట్టేవాళ్లు. వాటి నుంచి ‘ర్రీయ్’మని వచ్చే సౌండుకు కొంగలు రాకపోయేది. ఇంకా ఆ రీల్‌ను ఇద్దరిద్దరం పట్టుకొని టెలిఫోన్ ఆట ఆడేవాళ్లం.

ఎట్లా మర్చిపోతం?

మా పెద్దవాళ్లకేమో ఒగ్గు కథలంటే ఇష్టం. సాయంత్రం అందరూ ఒకచోట కూర్చుని ఒగ్గు కథలు వినేవాళ్లు. టీవీ, మొబైల్ లేని రోజుల్లో ఈ క్యాసెట్లే గ్రామీణ ప్రజలను బతికించేవి. అందుకే క్యాసెట్లోని పాటలు మాకు వినోదం. క్రమంగా కామెడీ స్కిట్లు కూడా ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి. వాటిని విని పొట్టలు పట్టుకుని నవ్వేవాళ్లం. పల్లెటూరి కామెడీ హృదయానికి చాలా దగ్గరగా ఉండేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లో ఒక్క క్లిక్‌తో లక్షల పాటలు వస్తున్నా ఆ క్యాసెట్ రీల్ తిప్పినప్పుడు వచ్చే ఆనందం ఎట్లా మర్చిపోతం.? టెక్నాలజీ మారినా ఇలాంటి ఆ చిన్న చిన్న గుర్తులు మన బాల్యాన్ని ఎప్పటికీ తాకుతూనే ఉంటాయి.

- డి. జంగయ్య, పోచారం

Next Story