దివ్యాంగుల ఫ్యాషన్ డిజైనర్.!

by Daayi Srishailam |

వారికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చి దుస్తులను డిజైన్ చేస్తోంది సౌమితా బసు

దివ్యాంగుల ఫ్యాషన్ డిజైనర్.!
X

దిశ, ఫీచర్స్: దివ్యాంగులు, వృద్ధులు, చలనశీలత కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనీసం తమ దుస్తులు తాము వేసుకోలేని స్థితిలో ఉంటారు. ఎలాంటి దుస్తులు వేసినా సెట్ అవ్వవు. అలాంటి వారికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చి దుస్తులను డిజైన్ చేస్తోంది సౌమితా బసు. దానికోసం ప్రత్యేకమైన బ్రాండ్‌ను స్థాపించింది.

మానసిక ఆందోళన..

సౌమితా బసుకు 2019లో ఆర్థరైటిస్ వ్యాధి సోకింది. దీని ప్రభావం వల్ల ఆమె 80 శాతం కదలికలను కోల్పోయింది. సాధారణ పనులు కూడా కష్టమైపోయాయి. బట్టలు వేసుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేసినా అలసిపోయేది. వాళ్లమ్మ అమితా తనకు సహాయం చేసేది. స్నానం చేయడం లేదా కదలడం కూడా కష్టమైపోయేది. హాస్పిటల్‌కి వెళ్లడానికి కూడా సరైన బట్టల్లేవు. ప్రతీసారి నైట్ డ్రెస్‌లోనే వెళ్లలేం కదా. అందుకే ఇలాంటి చిన్న విషయాలు కూడా సమస్యలుగా మారాయి తనకు. శారీరక నొప్పితో పాటు మానసిక ఆందోళన కూడా ఎక్కువైంది దీనివల్ల.

రూ.21,000తో స్టార్ట్..

తనలాంటి వారికి సూట్ అయ్యేలా డ్రెస్‌లుంటే బాగుండు అనిపించింది తనకు. కానీ అలాంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు. ఫ్యాషన్ మార్కెట్ ఎంతసేపూ అందాల డిజైన్ల కోణంలోనే ఆలోచిస్తుందికానీ.. సామాజిక కోణంలో ఆలోచించదు కదా అని అనుకుంది. పోనీ.. తానే ఏమైనా చేద్దామా అంటే ఫ్యాషన్ ప్రపంచంలో తనలాంటి వారికి చోటు లేదని గ్రహించింది. ఏదో ఒకటిచేసి మార్పు తీసుకురావాలనిదద మాత్రం గట్టిగా నిర్ణయించుకుంది సౌమిత. వాళ్లమ్మతో కలిసి ప్రత్యామ్నాయ డిజైన్‌లు స్కెచ్ చేయడం స్టార్ట్ చేసింది. కేవలం రూ.21,000తో స్థానిక టైలర్లను సంప్రదించి డిజైన్లను తయారుచేసింది.

జెనికా బ్రాండ్‌..

ప్రతి ఫెయిల్యూర్ కొత్త అవకాశాలను చూపిస్తుందంటారు కదా. సౌమితకు అదే జరిగింది. తాను చేసిన ప్రయత్నంతో మొదటగా సౌమిత సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ.. ఆమె ఒక్కరే కాదు.. ఎంతోమంది వృద్ధ తల్లిదండ్రులు, రోగులు, దివ్యాంగులు, ప్రమాదాలకు గురైనవాళ్లు ఇలా ఎంతోమంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుంది. మెయిన్‌స్ట్రీమ్ ఫ్యాషన్‌లో వాళ్లకంటూ ఏమీ లేదు. ఆలోటును భర్తీ చేసేందుకే 2020లో "జెనికా బ్రాండ్‌"ను అధికారికంగా లాంచ్ చేసింది. వాళ్లమ్మ కేవలం సంరక్షకురాలు మాత్రమే కాదు.. జెనికాకు కో-ఫౌండర్‌ కూడా.

అడాప్టివ్ దుస్తులతో ఆత్మవిశ్వాసం..

శరీర కదలికలు మెరుగ్గా లేనివాళ్లకు గుండీ పెట్టుకోవడం, ప్యాంట్ వేసుకోవడం కూడా పెద్ద సవాల్. ముఖ్యంగా ఆర్థరైటిస్, స్పైనల్ ఇంజురీ, దీర్ఘకాలిక నొప్పి ఉన్నవాళ్లకు ఇది పెద్ద సమస్య. అడాప్టివ్ దుస్తులొక్కటే దీనికి పరిష్కారం అని భావించింది సౌమిత. అడాప్టివ్ దుస్తులు డిజైనర్ పరంగానే కాదు.. వేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. వాటిని ధరించినవాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జెనికాలో మ్యాగ్నెటిక్ క్లోజర్లు, వెల్క్రో ఫాస్టెనింగ్‌లు, బెండ్ లేని ప్యాంట్‌లు ఉంటాయి. వేళ్లు కదలని వాళ్లకు.. వెన్నునొప్పి ఉన్నవాళ్లకు వేరొకరి సహాయం లేకుండా వేసుకోవడానికి వీలుగా ఉంటాయ.

రూ.1.3 కోట్ల లక్ష్యం..

ఫ్యాషన్ స్టార్టప్ నడపడం అంత సులభమేం కాదు. కొత్తవాళ్లకైతే ఇంకా కష్టం. కానీ జెనికా మౌత్ టాక్‌తో.. లాయల్ కస్టమర్లతో చాలావరకు ఎదిగింది. మొదట గుజరాత్‌లోని గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్ నుంచి రూ.5 లక్షల సీడ్ గ్రాంట్ వచ్చింది. తర్వాత జుబిలంట్ భారతియా ఫౌండేషన్ సపోర్ట్ దొరికింది. మెంటార్లు కుటుంబంలా మారారు. టర్నోవర్ కొన్ని లక్షల్లో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. జెనికా బ్రాండ్ రూ.21,000 నుంచి ఇంక్లూసివ్ ఫ్యాషన్ బీకన్‌గా మారింది. ప్రొడక్షన్ స్కేలింగ్.. పెద్ద రిటైలర్లతో పార్ట్‌నర్‌షిప్‌లు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.

Next Story