- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : చాలా మందిలో కనిపించే సాధారణ సమస్యల్లో తలనొప్పి ఒకటి. అలసట, ఆందోళన, అధిక ఒత్తిడి, వాతావరణం పడకపోవడం, ఫుడ్ పడకపోవడం వంటి సందర్భాల్లో ఇది వస్తూ ఉంటుంది. అలాగే జలుబు, జ్వరం వంటి వివిధ అనారోగ్యాలవల్ల కూడా హెడేక్ వస్తుంది. అయితే వీటితో సంబంధం లేకుండా కూడా కొందరిని ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుంది. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
*నిపుణుల స్రకారం ఉదయాన్నే తలనొప్పి ఎక్కువగా నిద్రలేమి కారణంగా వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి అతినిద్రవల్ల కూడా రావచ్చు. కాబట్టి సరైన నిద్ర అలవాట్లను ఫాలో కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే నిద్ర ఎంతసేపు అనేది కాకుండా అది పేలవమైన నిద్రనా?, నాణ్యమైన నిద్రనా అనేది కూడా ముఖ్యం. ఒక్కోసారి నిద్ర ఎక్కువైనా తలనొప్పి రావచ్చు. సమయానికి పడుకోవడం, క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోవడం మంచిది.
*అలాగే మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి కారణంగా కూడా కొందరిలో నిద్ర సరిగ్గా పట్టదు. దీనివల్ల కూడా ఉదయం లేవగానే తలనొప్పి వస్తూ ఉంటుంది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తడాన్ని టెన్షన్ హెడేక్స్ అని కూడా అంటారు. స్ట్రెస్, యాంగ్జైటీ, హెడేక్ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఏదీ ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
*నిద్ర రుగ్మతలు, ముఖ్యంగా స్లీప్ అప్నియా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వారిలోనూ తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వైద్య నిపుణులను సంప్రదించాలి.
పరిష్కారం ఏమిటి?
* తలనొప్పి సమస్య పూర్తిగా పోవాలంటే సరైన, నాణ్యమైన నిద్ర అలవాట్లను మెయింటైన్ చేయాలి. అందుకోసం మీరు చేసే వర్క్ అలాగే డే అండ్ నైట్ షిఫ్ట్‌లను బట్టి కూడా క్వాలిటీ స్లీప్ కోసం ఏ సమయం కేటాయించాలో నిర్ణయించుకోండి. కనీసం 10 నుంచి 15 రోజులపాటు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం చేయాలి. దానికి మీ శరీరం అలవాటు పడుతుంది. కాబట్టి తలనొప్పి తలెత్తే అవకాశం తగ్గుతుంది. మైగ్రేన్ వంటి సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
* తరచుగా ఆల్కహాల్ సేవించడం కూడా ఉదయం లేవగానే తలనొప్పికి కారణం అవుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. దీంతోపాటు మంచి పోషకాహారం తీసుకోవడం, తీసుకున్న ప్రతిసారి మితంగా తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం వంటివి ఉదయంపూట వచ్చే సాధారణ తలనొప్పి నుంచి శాశ్వత ఉపశమనాన్ని కలిగిస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అయితే చలికాలంలో నిద్రలేవగానే తలనొప్పికి కారణం కూడా ముఖ్యంగా నిద్రసరిపోకపోవడమే అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం.అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






