- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీసే సాధారణ అలవాట్లు ఇవే.. మార్చుకోకపోతే రిస్క్‌లో పడ్డట్లే..
మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీసే సాధారణ అలవాట్లు ఇవే.. మార్చుకోకపోతే రిస్క్‌లో పడ్డట్లే..

దిశ, ఫీచర్స్ : రోజువారీ అలవాట్లు ఆనందాన్నే కాదు, ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంటాయి. ఆయా వ్యక్తులు కలిగి ఉన్న హాబిట్స్‌ను కొన్ని మేలు చేస్తే, మరికొన్ని కీడు కూడా చేయవచ్చు. అలాంటి వాటిలో మెదడు సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని, మానసిక స్థితర్వాన్ని దెబ్బతీసేవి కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవడం ద్వారా వాటికి దూరం గా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
1. ఎక్కువ సమయం నీడలోనే గడపడం
చీకటి.. వెలుగు లేదా రాత్రి.. పగలు వంటి ప్రకృతి పరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి అనుగుణంగా వ్యక్తుల శరీరం నిర్మితమై ఉంటుంది. కాబట్టి అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బందులకు గురౌతుంది. ఎక్కువ సమయం కేవలం నీడలో లేదా చీకటి వాతావరణంలో గడపడం (Staying in the Dark Too Much) కూడా అలాంటి. ఈ అలవాటు మెదడులో సెరోటోనిన్, డోపమైన్, వంటి హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. సూర్యరశ్మి లేకపోవడంవల్ల విటమిన్ డి లోపం ఏర్పడి, డిప్రెషన్, ఆందోళన వంటివి పెరుగుతాయి. ఈ పరిస్థితి మెదడు కణాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. జ్ఞాపక శక్తిని బలహీన పరుస్తుంది. దీర్ఘకాలంలో మానసిక రుగ్మతల ప్రమాదం పెరుగుతుంది. అందుకే రోజూ కొంత సమయం సహజ సిద్ధమైన వెలుతురులో గడపడం ఉత్తమం.
2. నెగెటివ్ వార్తలు ఎక్కువగా చూడటం
నెగెటివ్ కోణాలు మనల్ని అలర్ట్ చేసేలా ఉండాలి. కానీ అలవాటుగా మారితే మాత్రం నష్టం అంటున్నారు నిపుణుల. తరచుగా నెగెటివ్ వార్తలు అధికంగా చదవడం లేదా చూడటం (Consuming Too Much Negative News) కూడా అలాంటి ప్రభావాన్నే చూపుతాయి. ఇవి ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయి. బ్రెయిన్ హిస్పోకాంపస్‌ను దెబ్బతీస్తాయి. ఆందోళన, భయం, నిస్పృహ పెరిగి, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నెగటివ్ వార్తలను పరిమితం చేసి, సానుకూల సమాచారంపై దృష్టి పెట్టడం మెదడుకు మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
3. హెడ్‌ఫోన్స్‌తో అధిక శబ్దాలు వినడం
హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకొని అధిక శబ్దాలను వినడం (Headphones Full Volume) చెవుల్లోని కణాలను దెబ్బతీస్తుంది. ఇది మెదడు శ్రవణ కేంద్రాలను (auditory centers ) ప్రభావితం చేస్తుంది. టిన్నిటిస్, వినికిడి లోపం, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా అధిక శబ్దం నరాల సమతుల్యతను భంగపరుస్తుంది. ఏకాగ్రతను తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో మెదడు పనితీరు మందగించేలా చేస్తుంది. అందుకే మీరు వినే సౌండ్ లెవెల్ 60% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
4. సోషల్ ఐసోలేషన్
సామాజిక సంబంధాలు లేకపోవడం (Social Isolation) కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే మానవ సంబంధాలు ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మానసిక స్థిరత్వానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా ఒంటరితనం.. ఒత్తిడి, డిప్రెషన్, అల్జీమర్స్ రిస్క్‌ను పెంచుతుంది. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం మెదడుకు మేలు చేస్తుంది.
5. టూ మచ్ స్క్రీన్ టైమ్
ఎక్కువ సమయం ఫోన్లలో నిమగ్నమవడం, టీవీ, ఇతర గాడ్జెట్లు తరచుగా చూడటం డోపమైన్ హార్మోన్ స్థాయిలను అస్థిరపరుస్తుంది. ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైటింగ్ నిద్ర చక్రాన్ని (sleep cycle) భంగ పరుస్తుంది. మెదడు విశ్రాంతిని అడ్డుకోవడంవల్ల జ్ఞాపకశక్తిని, నిర్ణయాత్మక శక్తిని తగ్గిస్తుంది. అలా జరగొద్దంటే స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేసి, బయటి పరిస్థితుల్లో స్పెండ్ చేయాలి. ప్రకృతిని ఆస్వాదించాలి.
6. అధిక చక్కెరలు తీసుకోవడం
అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, ముఖ్యంగా స్వీట్లు, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ పండ్ల రసాలు, కుకీలు, ఐస్ క్రీములు వంటివి తీసుకోవడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అస్థిరపరుస్తాయి. ఇవి క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తాయి. ఈ పరిస్థితి మెదడు నరాలపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. బ్రెయిన్ ఇన్‌ఫ్లమేషన్(inflammation), డిమెన్షియా, ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతాయి. కాబట్టి సహజ ఆహారాలు, తక్కువ చక్కెర కలిగినవి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
7. కదలికలేని జీవితం
రోజంతా ఎక్కువ సమయం ఒకే దగ్గర కూర్చోవడం, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటి జీవన శైలి మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. కొత్త న్యూరాన్ల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇది ఒత్తిడి, డిప్రెషన్‌ను పెంచుతుంది. జ్ఞాపక శక్తిని బలహీన పరుస్తుంది. డిమెన్షియా, అల్జీమర్స్ ప్రమాదం పెరుగుతుంది. రోజూ 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
8. పేలవమైన నిద్ర అలవాట్లు
తగినంత నిద్రలేకపోవడం(Poor Sleeping Habits) మెదడు కణాల పునరుత్పత్తిని, జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. నిద్రలేమివల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోవు. పైగా కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మెదడు నరాల మధ్య సంబంధాలను బలహీన పరుస్తుంది. ఫలితంగా డిమెన్షియా ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రోజూ 7-8 గంటల నిద్ర అవసరం.






